– పట్టా/పొజిషన్ సర్టిఫికెట్ల వాపస్‌కు ఆదేశాలు
– 7లక్షల మందికి ప్రయోజనం
– దశాబ్దకాలపు నిరీక్షణకు తెరదించిన ప్రజా ప్రభుత్వం
– రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 16 : దశాబ్దాలుగా పేదలు కన్న సొంతింటి కలను సాకారం చేస్తూ వారి ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తున్న ప్రజా ప్రభుత్వం మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇందిరమ్మ సహా వివిధ ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల కింద ఇళ్లు నిర్మించుకున్న పేదలకు గతంలో జారీ చేసిన పట్టాలను తిరిగి అందించాలని నిర్ణయించినట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు పేదల సొంతింటిపై హక్కును మరింత భద్రం చేస్తూ వారి కుటుంబాలకు భరోసా కల్పించే దిశగా ప్రజా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం లక్షలాది పేద కుటుంబాలకు ఊరటనివ్వనుందన్నారు. గతంలో అమలు చేసిన విధానం ప్రకారం ప్రభుత్వం వద్దనే ఉన్న లబ్ధిదారుల ఇండ్ల పట్టాలు/పొజిషన్ సర్టిఫికెట్లను వెనక్కి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా ఏడు లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. దశాబ్దానికి పైగా లబ్ధిదారులకు సంబంధించిన వారి ఇంటి పట్టా సర్టిఫికెట్లు తిరిగి రాకపోవడంతో వారు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తనకు అనేక విజ్ఞాపనలు వచ్చిన దరిమిలా ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. రాష్ట్రంలో 22-ఎ మీద సమీక్షలు జరుగుతున్న సమయంలో ఈ పట్టాలు తహసీల్దార్ కార్యాలయాల్లో భారీగా ఉన్నాయని ముఖ్యమంత్రి దృష్టికి రాగా వెంటనే పేదలకు వాటిని వాపస్ చేయాలంటూ ఆదేశించారని, దానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్లకు ఈ ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. 2014 కంటే ముందు అమలు చేసిన పథకంలో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ సబ్సిడీ, లబ్ధిదారుల వాటాతోపాటు, బ్యాంకు రుణం ద్వారా ఆర్ధిక సహాయం అందించే వారు. ఈ రుణాల కోసం లబ్ధిదారుల ఇండ్లకు చెందిన పట్టాలను ష్యూరిటీగా ఉంచుకునేవారు. రుణ వాయిదాలన్నిటినీ సక్రమంగా చెల్లించిన వారికి పట్టాలను తిరిగి ఇచ్చేవారు. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం ఇందిరమ్మ పథకాన్ని నిలిపివేయడంతో వివిధ కారణాలతో కొంతమంది లబ్ధిదారులకు పత్రాలను తిరిగి ఇవ్వలేదని, ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని, వాటిని వాపస్ చేయాలంటూ జిల్లా కలెక్టర్లను ఆదేశించామని మంత్రి పొంగులేటి తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





