అధ్యక్షపీఠం కోసం ఆధిపత్య పోరు!

– భద్రాద్రి కొత్తగూడెంలో కేడర్ ఉన్నా సరైన లీడర్ కరువు
– జిల్లా నాయకత్వ పగ్గాల కోసం ముగ్గురు నేతల పోటా పోటీ
– పదవుల కోసం పాకులాడుతూ కారు చక్రాల గాలి తీస్తున్నారా.?
– అధిష్టానం దృష్టి సారించాలని ద్వితీయ శ్రేణి నేతల విజ్ఞప్తి

ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి కొత్తగూడెం, నవంబర్ 16 : గత అసెంబ్లీ ఎన్నికల ఓటమి అనంతరం ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా దూకుడు పెంచింది. అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ తని ఉనికిని కాపాడుకోవడమే కాక జనానికి దగ్గరయ్యే యత్నం చేస్తున్నది. తమ హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తు చేస్తూ ఔర్ ఏక్ బార్ కేసీఆర్ అన్న నినాదంతో పార్టీ ముందుకు నడిపే యత్నం చేస్తుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ శ్రేయస్సు మరిచి జిల్లా అధ్యక్ష పీఠం కోసం ఎవరికి వారు తమ వ్యూహాలు పన్నడంలో బిజీ అయిపోయారు.

సరైన లీడర్ కరువు

జిల్లావ్యాప్తంగా కావలసినంత కేడర్ ఉన్నా బీఆర్ఎస్ పార్టీకి సరైన లీడర్ లేని లోటు స్పష్టంగా కనబడుతున్నది. జిల్లాలో ఆంధ్రా సరిహద్దు ప్రాంతాలు ఉన్నప్పటికీ మలి దశ తెలంగాణ ఉద్యమం మొదలైన నుంచి జిల్లావ్యాప్తంగా వేలమంది ప్రత్యేక రాష్ట్రం కోసం రోడ్డెక్కి పోరాడిన ఉద్యమకారులకు బిఆర్ఎస్ పార్టీ సరైన ప్రాధాన్యం కల్పించకపోవడం, వారిని గుర్తించే నాయకులు లేకపోవడంతో పార్టీలు మారే
మనసు రాక సైలెంట్ మోడ్ లో ఉండిపో యారు. కొంతకాలంగా జిల్లాకి బాస్ నేనంటే నేనే అంటూ వద్దిరాజు రవిచంద్ర, రేగ కాంతారావు, మరోవైపు వనమా వర్గం సొంత ప్రచారాలు సాగించడంతో పార్టీ కార్యకర్తలంతా ఎవరు కాబోయే లీడర్ అన్నది అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.

జిల్లా నాయకత్వ పగ్గాల కోసం పోటా పోటీ
జిల్లా అధ్యక్ష పీఠం కోసం వద్దిరాజు రవి చంద్ర. రేగా కాంతారావు. వనమా రాఘవ పోటీ పడుతూ కారు వేగాన్ని తగ్గిస్తున్నారని పార్టీ వర్గాలు చర్చించుకోవడం గమనార్ధం. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వద్దిరాజు రవిచంద్రకు ఇల్లందు నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పజెప్పింది అధిష్ఠానం. ఈ రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఓటమిపాలవడంతో వద్దిరాజు తన మార్కు చూపించలేకపోయాడని, జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెడితే పార్టీ మరింత బలహీనపడే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు జిల్లా మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించినప్పటికీ ఆశించిన ఫలితం దక్కలేదని మరో వర్గం పెదవి విరుస్తున్నది. ఇక వనమా రాఘవ విషయానికి వొస్తే తనపై ఉన్న సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని అధిష్ఠానానికి మొరపెట్టుకుంటూనే రాజకీయ వారసత్వాన్ని తనయురాలు వనమా అలేఖ్యకి కట్టబెట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అలేఖ్యను కొత్తగూడెం బరిలో నిలబెట్టి రాఘవ జిల్లా అధ్యక్ష పీఠం అధిరోహించాలని పావులు కదుపుతున్నారు.

పదవుల కోసం పాకులాడుతూ..

ఈ ముగ్గురు నేతలు పదవుల కోసం పార్టీకి నష్టం చేకూరుస్తున్నారంటూ కొందరు ద్వితీయస్థాయి నాయకులు మదనపడుతున్నారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి అనేక అవకాశాలు ఉన్నప్పటికీ ఏ ఒక్క నాయకుడు నోరు మెదపకపోవడంతో ప్రతిపక్ష పార్టీల నాయకులతో వీరికి సత్సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం షికార్లు చేస్తున్నది. అధిష్టాన ఆశీర్వాద బలం తమకే ఉందంటూ ఈ ముగ్గురు నాయకులు ఆధిపత్య పోరుకు ఆజ్యం పోస్తున్నారని సొంత పార్టీలోనే కొందరు కార్యకర్తలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ముందుండి నడిపించగల సత్తా ఉన్న మలిదశ ఉద్యమకారులను, కార్యకర్తలను, పార్టీ అభిమానులను ఒక తాటిపై నడిపించాల్సిన నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడ‌డంపై అధిష్టానం దృష్టిసారించి సత్తా గల నాయకుడికి జిల్లా పగ్గాలు అప్పజెప్పాలని పార్టీ వర్గాలు కోరుతున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *