మీడియా కమిషన్ను ఏర్పాటు చేయాలి
మీడియా, జర్నలిస్టులకు సంబంధించి సమగ్ర అధ్యయనం జరగాలి
నేషనల్ ప్రెస్ డే లో వక్తల వినతి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 16 : మీడియాలో వచ్చిన పెను మార్పులు, సోషల్ మీడియా ఉధృతి నేపథ్యంలో మీడియా, జర్నలిస్టులకు సంబంధించి సమగ్ర అధ్యయనం చేసేందుకు మీడియా కమిషన్ ను ఏర్పాటు చేయాలని వక్తలు కోరారు. సోషల్ మీడియా దూసుకుపోతున్న తరుణంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో కచ్చితత్వం, వాస్తవాల ఆధారంగా వేగంగా వార్తలను అందించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమి కార్యాలయంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు, తెలంగాణ మీడియా అకాడమి సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ పత్రికా దినోత్సవం (నేషనల్ ప్రెస్ డే) కార్యక్రమం మీడియా అకాడమి చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగింది. దేశంలో మొదటి ప్రెస్ కమిషన్ ఏర్పాటు చేసి వర్కింగ్ జర్నలిస్టులు, వార్తా పత్రికల చట్టాల రూపకల్పనకు ఆనాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ సూచనల మేరకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను 1966 నవంబర్ 16న ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన రోజునే జాతీయ పత్రికా దినోత్సవం(నేషనల్ ప్రెస్ డే) నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తున్నదన్నారు. భవిష్యత్తు తరాలకు అనుగుణంగా మీడియాలో మార్పులు, సమీకరణలు అవసరమన్నారు. ఇప్పటికే ప్రధాన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సంస్థలు ప్రజల విశ్వాసాన్ని కొల్పోతున్నాయని, దీని స్థానంలో సోషల్ మీడియా ప్రజలకు చేరువైనందున దాని పట్ల ఆసక్తి కనబరుస్తున్నారని అన్నారు. అంతేగాక కొన్ని యాజమాన్యాలు ప్రభుత్వాధినేతల మద్దతు కోసం అసలు వార్తల స్వరూలనే మార్చివేస్తున్నాయని కోదండరాం ఆరోపించారు. ఇది ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. సంచలన కథనాల కోసం ఆరాటపడటం కాక సమాజానికి ఏది అవసరం, ఏ వార్తలను అందిస్తున్నాం, అవి ప్రజలకు ఎంత మేలు చేస్తున్నాయి అనేది ఆలోచన చేయాలన్నారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిజం, పాప్లిస్ట్, రెస్పాన్సిబుల్ అనే అంశం గురించి వివరించారు. మీడియా ఎప్పుడూ ప్రజల పక్షానే ఉండాలన్నారు. సమాజంలో తప్పుడు సమాచారం వ్యాప్తిచెందుతున్నందున మీడియా సంస్థలు తమ విశ్వసనీయతను కాపాడుకునేందుకు కచ్చితమైన, నైతిక వార్తా సేకరణలే ముఖ్యమని అన్నారు. దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో పత్రికలు పోషించిన పాత్ర చాలా కీలకమన్నారు. అదేవిధంగా దేశంలో పాత్రికేయుల ప్రమాణాలను కాపాడటానికి, మీడియా సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి అందరం కలిసికట్టుగా అంకితభావంతో పని చేయాలని ఆయన కోరారు. విజ్ఞానవంతమైన, పారదర్శకమైన సమాజాన్ని నిర్మించడానికి జర్నలిస్టులు కృషి చేయాలన్నారు. పాత్రికేయ భవిష్యత్తు బలంగా, స్వేచ్ఛగా, బాధ్యతాయుతంగా ఉండేలా మీడియా సంస్థలు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేగాక మీడియా చట్టాలపై జర్నలిస్టులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రొఫెసర్ కె.హరగోపాల్ మాట్లాడుతూ దేశంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థాపించినప్పటి నుండి ఒక స్వతంత్ర సంస్థగా కొనసాగుతున్నదన్నారు. జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ పర్యవేక్షణ చేస్తున్నదన్నారు. అదేవిధంగా మీడియాపై బెదిరింపులు వచ్చినప్పుడు రక్షించడం కూడా ఆ సంస్థ బాధ్యతే అన్నారు. ప్రభుత్వాలు కూడా మీడియాను నియంత్రించాలని ఎప్పూడూ చూస్తాయి కానీ జర్నలిస్టులపై ఎన్ని ప్రయోగాలు చేసినా అవి సాధ్యం కావని గ్రహించి మీడియా సంస్థలను తమ గుప్పెట్లో పెట్టుకుంటున్నాయని ఆయన వివరించారు. మీడియా సంస్థలలో పని చేసే జర్నలిస్టులు తమ వృత్తిలో ఒక క్రమశిక్షణను అలవర్చుకోవాలన్నారు. మనకి మనమే ఉన్నతులుగా తీర్చిదిద్దుకోవాలన్నారు. అప్పుడే సమాజంలో జర్నలిస్టులకు గొప్ప గౌరవం లభిస్తుందన్నారు. పద్మజ మాట్లాడుతూ మీడియా అంటే నేడు ఇండస్ట్రీ అనుకుంటున్నారని, పత్రికలు, ఛానళ్లు ప్రారంభించడం, పాఠకులు, వీక్షకులను తయారు చేసుకోవడం, క్షేత్రస్థాయిలో జర్నలిస్టులు, న్యూస్ రూమ్లలో యాంకర్స్ వార్తలను అందించడం పరిపాటిగా మారిందన్నారు. ప్రజలకు ప్రభుత్వ, సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలపై అవగాహన కలిగించాలన్నారు. ప్రకృత్తి వైపరీత్యాల గురించి ముందే హెచ్చరించే వార్తలను కవర్ చేయాలన్నారు. కానీ నేడు సంచలనాలకు మారుపేరుగా రాజకీయ లేదా నేర వార్తలను ప్రధానంగా చూపిస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక పోక్సో కేసుల విషయంలో చిన్నారుల గోప్యత ముఖ్యం అని అనేక సందర్భాలలో తెలియజేసినా మీడియాలో అవే తప్పులు మళ్లి మళ్లీ చేస్తున్నారన్నారు. అమేర్ అలీ ఖాన్ మాట్లాడుతూ మీడియా వృత్తిలోకి వచ్చేది అడ్డదారుల్లో డబ్బులు సంపాదించడానికి కాదన్నారు. నీతినిజాయతీతో పని చేసి జర్నలిజం వృత్తికి మంచి పేరు తేవాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు కె.రామచంద్రమూర్తి, మల్లెపల్లి లక్ష్మయ్య, ఎన్.వేణుగోపాల్, కె.సాజయ్య, టియుడబ్ల్యూజే అధ్యక్షుడు కె.విరాహత్ అలీ, ప్రధానకార్యదర్శి కె.రామ్ నారాయణ, మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు, జర్నలిస్టులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





