ఎన్నికల వ్యవస్థ నుంచి సమాఖ్య వ్యవస్థ వరకు
రాజ్యాంగ సంస్థల పరిరక్షణే నేటి ప్రధాన కర్తవ్యం.
ఆచార్య జయశంకర్ 15వ స్మారకోపన్యాసం లో ‘ది వైర్’ వ్యవస్థాపక సంపాదకుడు సిద్ధార్థ్ వరదరాజన్
గత పన్నెండు సంవత్సరాలుగా దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగబద్ధమైన సంస్థలు, ప్రాథమిక హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛలు క్రమంగా బలహీనపడుతున్నాయని ఆందోళన ప్రముఖ జర్నలిస్టు, ‘ది వైర్’ వ్యవస్థాపక సంపాదకుడు సిద్ధార్థ్ వరదరాజన్ వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యావంతుల వేదిక ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ఆచార్య జయశంకర్ 15వ స్మారకోపన్యాసం కార్యక్రమంకు రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య అధ్యక్షత వహించగా ప్రధాన వక్త గా సిద్ధార్థ్ వరదరాజన్ భారత ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సమకాలీన సవాళ్లను లోతుగా విశ్లేషించారు. ప్రజాస్వామ్యం,రాజ్యాంగ విలువలు,సమాఖ్య వ్యవస్థ,పౌర స్వేచ్ఛలు,సంస్థాగత స్వతంత్రత వంటి అంశాలపై ఆయన చేసిన ప్రసంగం దేశ రాజకీయ, సామాజిక పరిణామాలపై కీలకమైన చర్చకు దారితీసింది. ఈ సందర్బంగా వరదరాజన్ మాట్లాడుతూ ఆచార్య జయశంకర్ తెలంగాణ ఉద్యమాన్ని కేవలం భౌగోళిక సరిహద్దుల మార్పు కోసం జరిగిన పోరాటంగా చూడలేదని,రాజకీయ,ఆర్థిక అధికారాల కేంద్రీకరణకు వ్యతిరేకంగా సామాన్య ప్రజలకు పాలనలో భాగస్వామ్యం కల్పించాలన్నదే ఆయన అసలు ఆకాంక్ష అని వివరించారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు మాత్రమే ప్రజాస్వామ్య సాధికారతకు పరిష్కారం కాదని, రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా అధికార వికేంద్రీకరణ, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల భాగస్వామ్యం కొనసాగాలని స్పష్టం చేశారు.

ఎన్నికల సంఘం స్వతంత్రతపై ప్రశ్నలు
భారత ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైన ఎన్నికల వ్యవస్థ స్వతంత్రత తీవ్రంగా ప్రశ్నార్థకమవుతోందని సిద్ధార్థ్ వరదరాజన్ పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ఎన్నికల సంఘానికి స్వతంత్ర అధికారాలు కల్పించినప్పటికీ, ఎన్నికల కమిషనర్ల నియామకంలో ప్రభుత్వ ఆధిపత్యానికి అవకాశం ఉండటం సంస్థాగత బలహీనతగా అభివర్ణించారు. ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలకు అతీతంగా, పారదర్శకమైన కొలీజియం విధానంలో జరగాలని సుప్రీంకోర్టు సూచించినప్పటికీ, తరువాత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఆ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని విమర్శించారు. వోటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), వోటర్ల పేర్ల తొలగింపు, ఎన్నికల ప్రక్రియలో రాజకీయ జోక్యం వంటి అంశాలు ప్రజాస్వామ్యంపై ఆందోళనలను పెంచుతున్నాయని పేర్కొన్నారు.
నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారతానికి ముప్పు:
నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ భారత సమాఖ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. జనాభా ప్రాతిపదికన లోక్సభ స్థానాల పునర్విభజన జరిగితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి వంటి దక్షిణ భారత ప్రాంతాల రాజకీయ ప్రాతినిధ్యం, అధికార సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉందన్నారు. ఉత్తర భారత రాష్ట్రాలకు రాజకీయంగా అధిక ప్రాధాన్యత లభించి, దక్షిణ భారత రాష్ట్రాల ప్రాతినిధ్యం బలహీనపడే పరిస్థితి ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అస్సాంలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా నియోజకవర్గాల సరిహద్దులను రూపొందించడాన్ని గెర్రీమాండరింగ్గా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా 850 లోక్సభ స్థానాల ఏర్పాటు ప్రతిపాదన పార్లమెంటు చర్చలు, ప్రతిపక్షాల పాత్ర, ప్రభుత్వ జవాబుదారీతనాన్ని మరింత బలహీనపరిచే ప్రమాదం ఉందన్నారు.
ఫిరాయింపుల రాజకీయాలు-పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి విఘాతం
ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను ప్రలోభాలు, బెదిరింపులు, రాజకీయ ఒత్తిళ్ల ద్వారా అధికారపక్షంలోకి చేర్చుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులో స్పీకర్ నిర్ణయాలు కీలకంగా మారడం, రాజకీయ పక్షపాతానికి అవకాశం కల్పిస్తోందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పరిణామాలను ప్రస్తావిస్తూ, న్యాయస్థానాల జోక్యం ఆలస్యమైతే ప్రజాస్వామ్యానికి జరిగిన నష్టాన్ని సరిదిద్దడం కష్టమవుతుందని వివరించారు.
దేశంలో ప్రధాన స్రవంతి టెలివిజన్ మీడియా ప్రభుత్వ అనుకూల ప్రచారానికి పరిమితమవుతోందని, స్వతంత్ర జర్నలిజానికి డిజిటల్ మీడియా ప్రధాన వేదికగా నిలుస్తోందని అన్నారు. ప్రభుత్వ విధానాలను విమర్శించే జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం, పోలీసు వ్యవస్థను ఉపయోగించి వేధించడం, UAPA, NSA వంటి చట్టాల దుర్వినియోగం ఆందోళనకరమని పేర్కొన్నారు. సిద్ధిక్ కప్పన్, కాశ్మీర్ జర్నలిస్టులు, ఇతర ప్రాంతాల్లో మీడియా ప్రతినిధులు ఎదుర్కొన్న కేసులను ఉదాహరణలుగా ప్రస్తావించారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వ సహాయక చర్యల్లోని లోపాలను బయటపెట్టిన జర్నలిస్టులపైనా కేసులు నమోదు చేయడాన్ని విమర్శించారు.
ఎమర్జెన్సీ కాలంలో అమలైన ప్రత్యక్ష సెన్సార్షిప్ స్థానంలో నేడు డిజిటల్ వేదికలపై కంటెంట్ తొలగింపు ఆదేశాలు, ఐటీ నిబంధనల దుర్వినియోగం ద్వారా పరోక్ష సెన్సార్షిప్ కొనసాగుతోందని వివరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వార్తలు, కార్టూన్లు, వ్యంగ్య చిత్రాలు,సామాజిక మాధ్యమ పోస్టులను తొలగించే చర్యలు ప్రజల సమాచార హక్కును దెబ్బతీస్తున్నాయని అన్నారు. స్వతంత్ర మీడియా మనుగడకు పాఠకులు,వీక్షకులు ఆర్థికంగా మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
పౌర స్వేచ్ఛలు, నిరసన హక్కుల పరిరక్షణ
భావప్రకటనా స్వేచ్ఛ, సంఘటితమయ్యే హక్కు, శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కులు ప్రజాస్వామ్యానికి ప్రాణాధారాలని పేర్కొన్నారు. దేశంలోని అనేక నగరాల్లో ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు.విద్యార్థి సంఘాల ఏర్పాటు, విశ్వవిద్యాలయాల్లో ఎన్నికలు, కార్మికుల హక్కుల కోసం ఉద్యమించే స్వేచ్ఛ కూడా పరిమితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల కాలంలోనే పౌర స్వేచ్ఛలపై ఆంక్షలకు అవకాశం కల్పించామని, కొద్దిమందికి మాత్రమే నష్టం జరుగుతుందని భావించి మౌనంగా ఉండటం వల్ల నేడు సమాజమంతా దాని ప్రభావాన్ని ఎదుర్కొంటోందని విశ్లేషించారు. పౌర హక్కుల సంఘాలను తిరిగి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు సంస్థాగత రక్షణ అవసరం
న్యాయమూర్తుల నియామకాలు,పదోన్నతుల్లో పారదర్శకత లోపించడం,కొలీజియం సిఫారసులను ప్రభుత్వం నిలిపివేయడం న్యాయవ్యవస్థ స్వతంత్రతపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. జస్టిస్ ఎస్. మురళీధర్, జస్టిస్ అఖిల్ ఖురేషీ వంటి న్యాయమూర్తులకు ఉన్నత పదవుల్లో అవకాశాలు కల్పించడంలో జరిగిన పరిణామాలను ప్రస్తావించారు. న్యాయమూర్తుల ఎంపిక,.పదోన్నతుల ప్రక్రియలో ప్రభుత్వ జోక్యానికి అవకాశం లేకుండా బహిరంగ, పారదర్శక విధానం అవసరమని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రాల హక్కులను, అధికారాలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని, అయితే కేంద్ర దర్యాప్తు సంస్థల వినియోగం, జీఎస్టీ విధానం, పన్నుల ఆదాయ పంపిణీలో అసమానతలు రాష్ట్రాల అధికారాలను బలహీనపరుస్తున్నాయని విమర్శించారు. ‘సహకార సమాఖ్య విధానం’ అనే నినాదానికి, వాస్తవంగా అమలవుతున్న విధానాలకు మధ్య వ్యత్యాసం ఉందన్నారు. ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే భాష వంటి నినాదాల ద్వారా భారతదేశంలోని భాషా, మత, సాంస్కృతిక వైవిధ్యాన్ని అనుమానంతో చూడటం ప్రజాస్వామ్యానికి, సమాఖ్య వ్యవస్థకు ప్రమాదకరమని హెచ్చరించారు.
భారతదేశంలో ఏ ఒక్క భాషకూ, మతానికీ, జీవన విధానానికీ ప్రత్యేక ఆధిపత్యం ఉండకూడదని, అన్ని భాషలు, మతాలు, సంస్కృతులు సమాన గౌరవం పొందాలని స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణ భారత రాష్ట్రాలు తమ రాజకీయ విభేదాలను పక్కనపెట్టి రాష్ట్రాల సమాన ప్రాతినిధ్యం, సమాఖ్య స్ఫూర్తి పరిరక్షణ కోసం ఒక స్పష్టమైన వైఖరి తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రజలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక సాధికారత కల్పించే ప్రజాస్వామిక సమాజం. ఆయన నమ్మిన రాజ్యాంగబద్ధమైన పోరాట పద్ధతులు,హేతుబద్ధమైన చర్చలు, ప్రజా ఉద్యమాలు నేటి పరిస్థితుల్లో మరింత అవసరమని ఈ స్మారకోపన్యాసం స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యాన్ని తిరిగి సాధించుకోవడం అంటే గతంలో కోల్పోయిన హక్కులను పునరుద్ధరించడమే కాకుండా, గతంలో లేని సంస్థాగత రక్షణలను నిర్మించుకోవడం కూడా. ఎన్నికల సంఘం స్వతంత్రత, మీడియా స్వేచ్ఛ, న్యాయవ్యవస్థ నిష్పాక్షికత, పౌర హక్కులు, రాష్ట్రాల సమాన హోదా పరిరక్షణ కోసం ప్రజలు, ప్రజాసంఘాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ప్రజాస్వామ్య పరిరక్షణే ఆచార్య జయశంకర్ ఆశయాలకు నిజమైన నివాళి.కార్యక్రమం ప్రారంభం కు ముందుగా ఆచార్య జయశంకర్ సార్ కు పూలమాలలు వేసి నివాలు లు అర్పించారు. ఈ కార్యక్రమంకు స్వాగత ఉపన్యాసం డా. తిప్పర్తి యాదయ్య చేయగా, ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరాం, ఐఏఎస్ ఆకునూరి మురళి,ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్, ధోన్నగంటి కృష్ణ, రవీందర్ గౌడ్, విజయ్ కుమార్, పందుల సైదులు, బైరెడ్డి సతీష్ రెడ్డి,డేగల సారయ్య,సంజీవ, తదితరులు పాల్గొన్నారు.





