ఈ విఘ్నాలు తొలగించేదెవరు?!

“ఈ సంవత్సరం జిఎచ్ఎంసి పరిధిలో లక్షా యాబై వేలు,సైబరాబాద్ పరిధిలో లక్షా ఇరవై వేలు, మల్కాజిగిరి పరిధిలో ఎనబై వేల విగ్రహాల నిమజ్జనం జరిగిందని అధికారులు ప్రకటించారు గాని, వాస్తవంగా జరిగిన నిమజ్జనాల సంఖ్యలో ఇది సగమో ముప్పాతికో మాత్రమే. అలాగే, ఈ 4,527 టన్నుల వ్యర్థాల లెక్క కూడా వాస్తవంగా జరిగినదానిలో కొంతభాగం మాత్రమే కావచ్చు. జిఎచ్ఎంసి పరిధిలో సగటున రోజుకు 9,000 టన్నుల వ్యర్థాలు పోగవుతాయని అంచనా కాగా, అంతకన్న ఎక్కువ వచ్చినదాన్ని మాత్రమే ఉజ్జాయింపుగా జిఎచ్ఎంసి ప్రకటిస్తుండవచ్చు..”
ప్రతి సంవత్సరం హైదరాబాద్ ను ముంచెత్తి పదకొండు రోజులపాటు ఊపిరి సలపనివ్వని వరద, శని, ఆదివారాల్లో ముగిసింది. ఈ వరద ఇప్పుడు ఒక్క హైదరాబాదునూ, తెలంగాణ మొత్తాన్నీ మాత్రమే కాదు, దేశాన్నే ముంచుతున్నది. పేరుకు ఈ వరద పేరు దైవభక్తి. కాని నిజమైన దైవభక్తులు కూడా ఆమోదించలేని పరిణామాలకు నిలయంగా మారింది. ఈ వరదలో కొట్టుకొస్తున్న చెత్తనూ తెట్టనూ మురుగునీటినీ చూస్తే నిజంగా దైవభక్తి అంటే ఇదేనా అని అనుమానం వస్తుంది. ఇది ప్రతి సంవత్సరమూ జరుగుతున్న తతంగం గనుక ఏడాదికేడాదికీ “దైవభక్తి” పేరిట ఈ ధ్వని కాలుష్యం, ట్రాఫిక్ అడ్డంకులు,పర్యావరణ విధ్వంసం, రౌడీ ప్రదర్శన, రాజకీయ విన్యాసాల పరిమాణం పెరిగిపోతున్నాయి గనుక ఒక్కసారి ఆగి అసలీ వ్యవహారం ఏమిటో, దీనిలో దైవభక్తి ఎంత ఉందో ఆలోచించాలి. భక్తుల విశ్వాసంలో వినాయకుడు విఘ్నేశ్వరుడు. విఘ్నాలను తొలగించేవాడు. వినాయక పూజ చేసిన వారికి ఎటువంటి విఘ్నాలూ రాకుండా కాపాడతాడు. కాని ఆ వినాయక పూజే పదకొండు రోజులపాటు అనేక విఘ్నాలకు కారణమవుతుంటే, ఈ కొత్త విఘ్నాలు తొలగించేదెవరు?

అధికారిక లెక్కల ప్రకారమే ఈ సంవత్సరం ఒక్క హైదరాబాద్ నగరంలో, మొత్తం నగరం కూడా కాదు కేవలం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిఎచ్ఎంసి) పరిధిలోనే, ఈ పదకొండు రోజుల్లో 4,527 టన్నుల చెత్త పోగయింది. అందులో విగ్రహాల వ్యర్థాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, సిమెంట్, రసాయనిక రంగులు,ఇనుము, కలప, విస్తరాకులు, తడి చెత్త, పూలదండలు, పూజా సామగ్రి, ప్లాస్టిక్ సీసాలు, డబ్బాలు, కొబ్బరి చిప్పలు, నిర్మాణ వ్యర్థాలు, వ్యర్థ వస్త్రాలు, చింపిపోసిన కాగితాలు, తెంపిన ఇంటర్నెట్ కేబుల్ వైర్లు వగైరా ఎన్నో రకాల పదార్థాలున్నాయి. ఇందులో కేవలం పూల వ్యర్థాలు 24 టన్నులు! ఇరవై నాలుగు వేల కిలోల పూలు, అంటే కోట్ల పూలు. ఒక్క పువ్వుకే పుష్పవిలాపం వినిపించిన కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి నేలలో కోట్ల పూల విలాపాలు! ఈ చెత్తలో రోడ్ల మీద సేకరించిందీ ఉంది, పెద్ద జలాశయాల్లో నిమజ్జనాల తర్వాత సేకరించిందీ ఉంది, ప్రత్యేకంగా రసాయన కాలుష్యాన్ని తగ్గించడానికి జిఎచ్ఎంసి ఏర్పాటు చేసినదాదాపు వంద బేబీ పాండ్స్ నుంచి సేకరించిందీ ఉంది.

ఈ సంవత్సరం జిఎచ్ఎంసి పరిధిలో లక్షా యాబై వేలు,సైబరాబాద్ పరిధిలో లక్షా ఇరవై వేలు, మల్కాజిగిరి పరిధిలో ఎనబై వేల విగ్రహాల నిమజ్జనం జరిగిందని అధికారులు ప్రకటించారు గాని, వాస్తవంగా జరిగిన నిమజ్జనాల సంఖ్యలో ఇది సగమో ముప్పాతికో మాత్రమే. అలాగే, ఈ 4,527 టన్నుల వ్యర్థాల లెక్క కూడా వాస్తవంగా జరిగినదానిలో కొంతభాగం మాత్రమే కావచ్చు. జిఎచ్ఎంసి పరిధిలో సగటున రోజుకు 9,000 టన్నుల వ్యర్థాలు పోగవుతాయని అంచనా కాగా, అంతకన్న ఎక్కువ వచ్చినదాన్ని మాత్రమే ఉజ్జాయింపుగా జిఎచ్ఎంసి ప్రకటిస్తుండవచ్చు.

రోడ్డు మీదనైనా, మండపం దగ్గరైనా, చెరువులోనైనా పారేసేవాళ్లుపారేసి పోతారు. వాళ్లకు ఏ బాధ్యతా లేదు. కాని ఈ చెత్త ఎత్తి,నగరాన్ని శుభ్రం చేయడానికి వందలాది బృందాలు, పది నుంచి ఇరవై వేల మంది పారిశుధ్య కార్మికులు కావాలి. ఉన్న పారిశుధ్య కార్మికులు అదనపు పని చేయాలి. చెత్త రవాణా వాహనాలు, చెత్త ఎత్తిపోసే వాహనాలు, అంచెలు అంచెలుగా పర్యవేక్షక సిబ్బంది… బహుశా ఈ అదనపు ప్రయత్నానికి కొన్ని వందల కోట్ల రూపాయలైనా ఖర్చవుతుంది. అది మళ్లీ ప్రజలమీద పన్నుల భారం అవుతుంది. ఈ చెత్త పరిమాణం లెక్క సరైనదే అనుకున్నా గుర్తించవలసిన ఆశ్చర్యకర విషయాలున్నాయి. ఈ సంవత్సరం పోగయిందంటున్న 4,527 టన్నుల వ్యర్థాలు గత సంవత్సరం పోగయిన వ్యర్థాల (3,266 టన్నుల) కన్న 40 శాతం ఎక్కువ! మూడు సంవత్సరాల కింద 2023లో పోగయిన వ్యర్థాల (1,100 టన్నుల) తో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ. అబ్బ ఎంత అభివృద్ధి! ఇదంతా భక్తి పెరిగిందనడానికి సూచనేనా? లేక మన పౌర స్పృహ దిగజారుతున్నదనడానికి సూచనా?

“ఇందులో భక్తి ఏమీ లేదు, కేవలం అహంకారం, ఆడంబరం,సంపద చూపుకోవడం, పెత్తనం చూపుకోవడం, దౌర్జన్యం, పౌర జీవితానికి విఘ్నాలు కలిగించడం, తమ వంటి భక్తులతోనే పోటీ పడడం, లేదా ఇద్దరు పోటీదార్ల మధ్య భక్తి ఒక సాధనం కావడం. వినాయకుడికి ఉండ్రాళ్లు ఇష్టం అని పాత సంప్రదాయం. ఇప్పుడు వినాయకుడి లడ్డు ప్రచారంలోకి వచ్చింది. ఆ లడ్డూను వేలం పాడడం, అందులో వందలో వేలో కాదు, లక్షల రూపాయలు చేతులు మారడం. ఈసారి బండ్లగూడ జాగీర్ లడ్డు ఒక కోటి ఒక లక్ష రూపాయలు పాడిందట. ఏమిటిది, ఇంకా భక్తే అనుకుంటున్నారా? ..” 

మూడు సంవత్సరాల్లో నాలుగు రెట్ల చెత్త పెరిగిందంటే, విగ్రహాలు,మండపాలు నాలుగు రెట్లో, అంతకన్న ఎక్కువో పెరిగాయన్నమాట. గతంలో వాడకు, బస్తీకి, విశాలమైన లొకాలిటీకి ఒకటో రెండో విగ్రహాలు ఉండే చోట, ఇప్పుడు ఒక వాడలోనే, ఒక బస్తీలోనే, ఒక లొకాలిటీలో నాలుగు, ఐదు, పది విగ్రహాలు ఉంటున్నాయి. ఒకే వీథిలో, యాబై, వంద అడుగుల లోపల రెండు మూడు విగ్రహాలు ఏర్పాటయిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. కులాన్ని బట్టి,రాజకీయాలను బట్టి, పరపతిని బట్టి, రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో నిలబడే అవకాశాన్ని బట్టి, చందాలు వసూలు చేయగలిగే అవకాశాన్ని బట్టి, దాదాగిరి చేయగల అవకాశాన్ని బట్టి విగ్రహాలు,మండపాలు ఏర్పడుతున్నాయి. ప్రతి చోటా ఒక వేదిక, గంటో రెండు గంటలో పూజలు, పది గంటలో పద్దెనిమిది గంటలో బూతు పాటలు, వీలైతే వెకిలి నాట్యాలు, వేదిక ముందు అన్నదానమో, ప్రసాదమో పంపిణీ జరుగుతుండగా, వేదిక వెనుక సారా పొట్లాల నుంచి ఖరీదైన సీసాల దాకా సరఫరా! ఇదంతా భక్తి అని నిజమైన భక్తులైనా అనుకుంటున్నారా?

విగ్రహాలు పెట్టడంలో ఒక మండపానికీ మరొక మండపానికీ, ఒక దాదాకూ మరొక దాదాకూ, ఒక భక్త శిఖామణికీ మరొక భక్త శిఖామణికీ ఇంత పోటీ ఎందుకు? అసలది భక్తా పోటీనా?అవతలివాళ్లు అయిదడుగులు తెస్తే మనం ఆరడుగులు,అవతలి వాళ్ల దగ్గర మూషిక వాహనం మాత్రమే ఉంటే మన వినాయకుడు సింహం మీద చెయ్యివేసి చిద్విలాసంగా నవ్వాలి… అసలు వక్రతుండ మహాకాయ అని వినాయక వ్రతకల్పంలో చెప్పిన ఆకారాలేనా ఇవి? అసలు ఆ విగ్రహాలు భక్తి ప్రపత్తులతో తయారుచేసినట్టుగా ఉంటున్నాయా, పోటీ తత్వంతో విచిత్రంగా కనబడడానికి, ప్రత్యర్థులను భయపెట్టడానికి తయారుచేసినట్టుగా ఉంటున్నాయా?

వీథిలో అడ్డంగా, నాలుగు చక్రాల వాహనాలు వెళ్లడానికి కూడా వీలు లేకుండా మండపాలు కట్టి ట్రాఫిక్ అడ్డంకులు సృష్టించడం,ప్రతి మండపం దగ్గర డిజే లు వేలాది వాట్ల స్పీకర్లు పెట్టి ధ్వనికాలుష్యం కలగజేయడం, ఆ ఉరుములకు, పిడుగులకు పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, పెంపుడు జంతువులు అదిరి, బెదిరి పోవడం. కోవిడ్ వల్ల ఊపిరితిత్తులు బలహీనమైనవాళ్లు కొందరు చనిపోవడం, హాస్పిటల్స్ పాలు కావడం, నానాటికీ ఎక్కువగా చెత్త పోగేసి కాలుష్యానికి కారణం కావడం, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో, రసాయనాలతో జలాశయాలకూ,తద్వారా భూగర్భ జలానికీ, ప్రజారోగ్యానికీ, పర్యావరణానికి ప్రమాదం కలిగించడం.

ఇందులో భక్తి ఏమీ లేదు, కేవలం అహంకారం, ఆడంబరం,సంపద చూపుకోవడం, పెత్తనం చూపుకోవడం, దౌర్జన్యం, పౌర జీవితానికి విఘ్నాలు కలిగించడం, తమ వంటి భక్తులతోనే పోటీ పడడం, లేదా ఇద్దరు పోటీదార్ల మధ్య భక్తి ఒక సాధనం కావడం. వినాయకుడికి ఉండ్రాళ్లు ఇష్టం అని పాత సంప్రదాయం. ఇప్పుడు వినాయకుడి లడ్డు ప్రచారంలోకి వచ్చింది. ఆ లడ్డూను వేలం పాడడం, అందులో వందలో వేలో కాదు, లక్షల రూపాయలు చేతులు మారడం. ఈసారి బండ్లగూడ జాగీర్ లడ్డు ఒక కోటి ఒక లక్ష రూపాయలు పాడిందట. ఏమిటిది, ఇంకా భక్తే అనుకుంటున్నారా?

అన్నిటినీ మించి చివరి రెండు రోజుల గందరగోళం. ఎన్నిసార్లు ఎంతమంది పర్యావరణ వాదులు, శాస్త్రవేత్తలు, సమాజం గురించి నెనరు ఉన్న పౌరసమాజ కార్యకర్తలు చెవిన ఇల్లు కట్టుకొని పోరినా, న్యాయస్థానాలు కచ్చితమైన ఆదేశాలు ఇచ్చినా ఈ విఘ్నాలు పెరుగుతూనే ఉన్నాయి గాని తగ్గడం లేదు. ప్రభుత్వం ఇష్టగానో, కష్టంగానో పర్యావరణ విధ్వంసం వద్దు అని చెపుతున్నాయథావిధిగా సాగిపోతూనే ఉంది. కాలుష్య కారక విగ్రహాలను టాంక్ బండ్ మీద నిమజ్జనం చేయనివ్వబోమని ప్రకటించి,ఇనుప జాలీలు, బారికేడ్లు నిర్మించిన పోలీసులు, హిందుత్వ వాదులు వాటిని కూలదోస్తుంటే మౌనసాక్షులుగా నిలబడిన వీడియోలు ప్రచారంలో ఉన్నాయి. ప్రభుత్వమే అధికారికంగా మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేసింది. ఈ సంవత్సరం దాని విలువ 17.8 కోట్ల రూపాయలు. ఇది కూడా వాస్తవికమైన అంకె కాకపోవచ్చు. ఎన్నోరెట్లు ఎక్కువ విద్యుత్తు ఖర్చయ్యే ఉంటుంది. అది రాబట్టడానికి వినియోగదారుల మీద ఆ మేరకు భారమూ పెరుగుతుంది.

“అసలు భగవంతుడికీ భక్తుడికీ మధ్య సంబంధం వ్యక్తిగతమైనదని, అందులో మరే జోక్యమూ ఉండగూడదని భావించే భక్తితత్వాన్ని ప్రబోధించిన నేల ఇది. ఇటువంటి ఉత్సవాల్లో వ్యక్తిగత భక్తితో పాటు, సామూహిక కలయిక, వేడుక అంశం కూడా ఉంది గనుక ఇవి కుటుంబ  స్థాయికీ, బంధుమిత్రుల కలయికల స్థాయికీ పెరిగాయి. అప్పటికి కూడా భక్తినీ, దైవాన్నీ ఇంకా ఇంతలా బజారుకీడ్వలేదు..”

ఇంత ఆడంబరంగా, దౌర్జన్యపూరితంగా, దురాక్రమణగా, కాలుష్య కారకంగా, రభసగా ఉండేది భక్తేనా అని భక్తులైనా తమ మనసులను తరచి చూసుకోవలసి ఉంది. నిర్మలమైన నీ ఆరాధనకు ఇంత పటాటోపం, ఇంత ఖర్చు, ఇంత గోల ఎందుకు ప్రభూ అని తమ దేవతలను ప్రశాంతంగా అడగవలసి ఉంది. మూడు నాలుగు దశాబ్దాల కింద వినాయక పూజతో ఒక్కసారి పోల్చి చూడండి. గ్రామాల్లో అతి కొద్ది కుటుంబాల్లో మాత్రమే ఈ పూజ జరిగేది. ఊరంతటికీ సంబంధం లేదు. ఊరి చెరువు రేగడి మట్టితో కుమ్మరి చేసిన ఒక అడుగుకు మించని వినాయక విగ్రహాన్ని పూజించేవారు. పట్టణాల్లో ఒకటో రెండో చోట్ల కూడలిలో ఒక మూలకు చిన్న మండపం వేసి, బహిరంగంగా కాస్త పెద్ద వినాయక విగ్రహ పూజ జరిగేది. సాయంత్రం పూట మైకు పెట్టి స్థానిక కళాకారుల పాటలు, మాటలు, మిమిక్రీ ప్రదర్శనలు వంటివి ఉండేవి. అది ఒక నైసర్గికమైన, ప్రశాంతమైన, నిర్మలమైన భక్తి. ఇప్పటిలా ఆడంబర ప్రదర్శన కాదు, ఇతర ప్రయోజనాల కోసం ప్రదర్శన కాదు.

అసలు భగవంతుడికీ భక్తుడికీ మధ్య సంబంధం వ్యక్తిగతమైనదని, అందులో మరే జోక్యమూ ఉండగూడదని భావించే భక్తితత్వాన్ని ప్రబోధించిన నేల ఇది. ఇటువంటి ఉత్సవాల్లో వ్యక్తిగత భక్తితో పాటు, సామూహిక కలయిక, వేడుక అంశం కూడా ఉంది గనుక ఇవి కుటుంబ స్థాయికీ,బంధుమిత్రుల కలయికల స్థాయికీ పెరిగాయి. అప్పటికి కూడా భక్తినీ, దైవాన్నీ ఇంకా ఇంతలా బజారుకీడ్వలేదు. ముఖ్యంగా గణపతి బహిరంగ ఉత్సవాల విషయానికే వస్తే తొలి జాతీయోద్యమ కాలంలో, వలసవాదానికి వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసేందుకు, వారి మధ్య సామూహిక అనుబంధాన్ని,సంఘీభావాన్ని పెంచేందుకు ఒక సాధనంగా ఈ ఉత్సవాలను వాడుకోవాలని బాల గంగాధర్ తిలక్ భావించాడు. అలా తిలక్ వల్ల మహారాష్ట్రలో వినాయకుడు బజారుకెక్కాడు. అది ఒక సామాజిక, రాజకీయ అవసరం అనుకున్నప్పటికీ, అది చిలవలు పలువలుగా విశ్వరూపం ధరించి ఇవాళ్టికి చేరిన స్థితి చూస్తే ఇది ఒకప్పుడు ఒక మంచి పని కోసం మొదలయిందనే సమర్థన కూడా సరిపోదు. హైదరాబాద్ రాజ్యంలో కలిసి ఉన్న మరాఠీ జిల్లాల వల్ల, ఈ ఉత్సవపు అనుకరణ హైదరాబాద్ కు కూడా వ్యాపించింది. ‘గణపతి బప్ప మోర్యా’ అనే మరాఠీ భాషా నినాదం, మరాఠీ సంత్ మోర్య పేరుతో సహా, అర్థం కూడా తెలియకుండానే హైదరాబాద్ లో మార్మోగేటంతగా ఈ అనుకరణ సాగింది.

ఆ ఉత్సవంలోకి రాజకీయాలు, కులాలు, వీథుల మధ్య, ఒక వీథిలోనే రెండు ముఠాల మధ్య పోటీలు ప్రవేశించి, దురాక్రమించి ఇప్పుడిది కోట్లాది రూపాయల వ్యాపారంగా మారిపోయింది. నిరాటంకమైన జులాయితనపు రౌడీ ప్రదర్శనగా, విచ్చలవిడి దౌర్జన్యంగా, పౌర స్పృహ రద్దుగా,కాలుష్యంగా మారిపోయింది. ఇంకా దీన్ని భక్తి అని అమాయకంగా అనుకుంటూ సాగనిద్దామా? ఈ విఘ్నాన్ని తొలగించేదెవరు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *