రానున్న ఉత్పాతం – ప్రకృతి పాలెంత? మనిషి పాలెంత?

“కాలం కాకపోవడం, అనావృష్టి ఏర్పడడం, పంటలకూ పశువులకూ మనుషులకూ అవసరమైన నీరు రాకపోవడం తెలంగాణకు కొత్తేమీ కాదు, గతంలో కూడా జరిగేవి. కాని అప్పుడు సమాజం స్పందించిన తీరుకూ ఇప్పుడు స్పందిస్తున్న తీరుకూ మధ్య వ్యత్యాసం గురించి ఆలోచించవలసి ఉంది. ఒక పెద్ద ఉత్పాతం రానున్నదని సమాజానికీ పట్టడం లేదు, ప్రభుత్వానికీ పట్టడం లేదు!”

హైదరాబాద్ నగరానికి మంచినీరు సరఫరా చేసే జలాశయాలన్నీ అడుగంటాయని, నవంబర్ చివరి నాటికి ఆ జలాశయాలన్నీ పూర్తిగా వట్టి పోవచ్చుననీ, ఇంటింటికీ మంచినీటి సరఫరా బాగా తగ్గడం గాని, పూర్తిగా ఆగిపోవడం గాని జరగవఃచ్చునని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సూవరేజ్ బోర్డ్ హైదరాబాద్ ప్రజలందరికీ ఒక నోటీసు పంపింది. నీటి పొదుపుకు ఏయే చర్యలు తీసుకోవాలో సూచనలతో ప్రతి నీటి చుక్కనూ కాపాడండి అని నినాదం ఇచ్చింది. ఇది హైదరాబాద్ నగరానికి సంబంధించిన తీవ్రమైన స్థితి మాత్రమే కాదు. మొత్తం రాష్ట్రం స్థితే, బహుశా దేశం స్థితే అలా ఉంది. తెలంగాణ జనాభాలో మూడో వంతు హైదరాబాద్ నగరంలోనే నివసిస్తున్నందువల్ల హైదరాబాద్ సమస్యలే తెలంగాణ సమస్యగా కనబడే, చూసే, చూపే అవకాశం కూడా ఉంది. మొత్తం రాష్ట్రంలో హైదరాబాదు సమస్యలను మించిన సమస్యలున్నాయి.

వాటర్ బోర్డ్ నోటీసు మొదటి వాక్యంలోనే “ప్రస్తుతం సాగుతున్న ఎల్ నినో ప్రభావం వల్ల, రానున్న కరువు వల్ల” అని కారణాలు చెప్పారు. తెలంగాణ మీద ఎల్ నినో ప్రభావం అని చెప్పగలది ఎంతో ఎవరికీ తెలియదు గాని దాన్ని తగ్గించడానికనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవల చాలా హడావుడి చేసింది, చేస్తున్నది. నోడల్ అధికారులను నియమించింది. వాటర్ బోర్డూ, ప్రభుత్వమూ చెప్పినా చెప్పకపోయినా ఈ ఏడాది వానాకాలం మొత్తం మీద వానలు పడవలసినంతగా పడలేదని, కాలెండర్లలో ప్రవేశించిన చలికాలం వాస్తవంగా ప్రవేశించలేదని, నిత్య ఎండా కాలం సాగుతున్నదని ప్రతి ఒక్కరికీ తెలుసు. ప్రతి సంవత్సరం జూలై, ఆగస్టులలో గోదావరికీ, కృష్ణకూ రెండు మూడు సార్లో కనీసం ఒక్క సారో వచ్చే వరద, ఈ సంవత్సరం వరద కాదు గదా, గట్లు ఒరసి నీరు ప్రవహించిన స్థితి కూడా రాలేదని వార్తలు జాగ్రత్తగా చూసేవారికి తెలుసు. మొత్తం మీద తెలంగాణలో ఈసారి కాలం కాలేదు. కాలం కాకపోవడం, అనావృష్టి ఏర్పడడం, పంటలకూ పశువులకూ మనుషులకూ అవసరమైన నీరు రాకపోవడం తెలంగాణకు కొత్తేమీ కాదు, గతంలో కూడా జరిగేవి. కాని అప్పుడు సమాజం స్పందించిన తీరుకూ ఇప్పుడు స్పందిస్తున్న తీరుకూ మధ్య వ్యత్యాసం గురించి ఆలోచించవలసి ఉంది. ఒక పెద్ద ఉత్పాతం రానున్నదని సమాజానికీ పట్టడం లేదు, ప్రభుత్వానికీ పట్టడం లేదు!

ముందు తెలంగాణలో అనావృష్టి తీవ్రత గురించి తెలుసుకోవాలి. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలో ప్రవేశించి, వర్షాకాలం మొదలై, సెప్టెంబర్ మధ్య దాకా సాగుతుంది. అప్పుడు తిరుగు రుతుపవనాలు, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో అక్టోబర్, నవంబర్ లలో కూడా కొద్దిగా వానలు కురుస్తాయి. ప్రధానంగా జూలై, ఆగస్ట్ లలో ఎక్కువ వర్షపాతం నమోదై నదులూ వాగులూ వంకలూ పారుతాయి. చెరువులూ కుంటలూ జలాశయాలన్నీ నిండుతాయి. ముమ్మరంగా వ్యవసాయ పనులు సాగుతాయి. ఏడాది పొడుగునా మనుషుల తాగునీటి అవసరాలు తీర్చే జలాశయాలు నిండుతాయి. కాని ఈ సంవత్సారం ఎల్ నినో ప్రభావం వల్ల నైరుతి రుతుపవనాలు ఉండవలసినట్టుగా లేవంటున్నారు. జూన్ లో సాధారణ వర్షపాతం కన్నా 12 శాతం తక్కువ నమోదయింది. జూలైలో పరిస్తితి కాస్త మెరుగు పడినప్పటికీ ఆగస్ట్ లో వర్షపాతం కొరత చాలా ఎక్కువగా 38 శాతంగా నమోదయింది. మొత్తంగా నైరుతి రుతుపవనాల కాలంలో సాధారణ వర్షపాతం కన్నా 17 శాతం కొరత ఉందని వాతావరణ శాఖ చెపుతున్నది. వారి అంకెలు ఏమి చెప్పినప్పటికీ నవంబర్ చివరినాటికే హైదరాబాద్ జలాశయాలు అడుగంటిపోయే పరిస్థితి ఉందంటే, కొరత చాలా ఎక్కువగా ఉందని అర్థం.

“ఇదంతా ప్రకృతి వల్ల జరిగిందని నెపం ప్రకృతి మీద పెట్టవచ్చు. లేదా సాధారణ ప్రజలకు అర్థం కాని ఎల్ నినో ను సాకుగా చూపెట్టవచ్చు. కనిపించని దేవుడి మీద, వరుణుడి మీద కూడా భారం వేయవచ్చు. కాని ఇటువంటి ఉత్పాతాలు వచ్చినప్పుడు ప్రజలను ఆదుకోవలసిన బాధ్యత ప్రజల పన్నులతో నడిచే, విలాసాలు అనుభవించే ప్రభుత్వానిది. నిజానికి ఇటువంటి ఉత్పాతాలు రావడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవడం, ఉత్పాతం రానున్నదని గుర్తించడానికి తగిన వ్యవస్థలు నిర్మించడం, అది వచ్చి మీద పడిన తర్వాత బాధిత ప్రజానీకానికి సహాయ సహకారాలు, ఉపశమనం అందించడం ప్రభుత్వ బాధ్యత. ఆధునిక ప్రజాస్వామిక ప్రాతినిధ్య పరిపాలనలో ఇటువంటివన్నీ ప్రభుత్వ కనీస కర్తవ్యాలని ఎప్పటికప్పుడు అంకుశంతో పొడిచి చెపుతుండవలసిన బాధ్యత సమాజానిది, పౌరసమాజానిది, ప్రచార మాధ్యమాలది..”

రాష్ట్రంలోని మొత్తం 612 మండలాల్లో, 539 గ్రామీణ మండలాల్లో, 315 మండలాల్లో అనావృష్టి పరిస్థితి నెలకొన్నదనే వార్తలు వస్తున్నాయి. అంటే గ్రామీణ తెలంగాణలో సగానికన్న ఎక్కువ కరువు బారిన పడిందనో, పడబోతున్నదనో చెప్పవచ్చు. నాలుగు చినుకులు పడ్డాయి గదా అనే భరోసాతో వేసి ఉన్న పంటలకు అవసరమైన నీరు దొరకదు. ఎక్కువ భూగర్భ జలాలు లాగవలసి వస్తుంది. ఎక్కువ విద్యుచ్ఛక్తి అవసరమవుతుంది. ఏమి చేసినా పంట విఫలమైపోతుంది. రైతాంగం అప్పుల భారం పెరుగుతుంది. పశుగ్రాసం కూడా దొరకని స్థితి వస్తుంది. పంటల వైఫల్యం వల్ల ఆహారధాన్యాల ధరలు పెరుగుతాయి. పట్టణ ప్రజల మీద కూడా భారం పడుతుంది. జలాశయాలు అడుగంటడం వల్ల, భూగర్భ జలాలు వట్టిపోవడం వల్ల తాగు నీటికి కూడా కటకట ఏర్పడుతుంది.

ఇదంతా ప్రకృతి వల్ల జరిగిందని నెపం ప్రకృతి మీద పెట్టవచ్చు. లేదా సాధారణ ప్రజలకు అర్థం కాని ఎల్ నినో ను సాకుగా చూపెట్టవచ్చు. కనిపించని దేవుడి మీద, వరుణుడి మీద కూడా భారం వేయవచ్చు. కాని ఇటువంటి ఉత్పాతాలు వచ్చినప్పుడు ప్రజలను ఆదుకోవలసిన బాధ్యత ప్రజల పన్నులతో నడిచే, విలాసాలు అనుభవించే ప్రభుత్వానిది. నిజానికి ఇటువంటి ఉత్పాతాలు రావడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవడం, ఉత్పాతం రానున్నదని గుర్తించడానికి తగిన వ్యవస్థలు నిర్మించడం, అది వచ్చి మీద పడిన తర్వాత బాధిత ప్రజానీకానికి సహాయ సహకారాలు, ఉపశమనం అందించడం ప్రభుత్వ బాధ్యత. ఆధునిక ప్రజాస్వామిక ప్రాతినిధ్య పరిపాలనలో ఇటువంటివన్నీ ప్రభుత్వ కనీస కర్తవ్యాలని ఎప్పటికప్పుడు అంకుశంతో పొడిచి చెపుతుండవలసిన బాధ్యత సమాజానిది, పౌరసమాజానిది, ప్రచార మాధ్యమాలది.

కాని మన తలకిందుల సమాజంలో ఎవరికీ వారి బాధ్యతలు తెలియని, గుర్తుండని పాడుకాలం దాపురించింది. ఒక సమస్య వస్తే ఎవరి మీదికి నెడదామా, బాధ్యత ఎట్లా తప్పించుకుందామా అనేదే వ్యక్తులకైనా, సంస్థలకైనా, బాధ్యతాయుత వ్యవస్థలకైనా ఏకైక ప్రయత్నంగా మారిపోయింది. బాధ్యతారహితంగా ఉండడం ఒక ఎత్తయితే, బాధ్యతారహితంగా ఉంటూనే ఏవో అపారమైన బాధ్యతలు మోస్తున్నట్టు నటించడం, ఇతరులను నమ్మించడం, చారానా కోడికి బారానా మసాలా ఆడంబరాలతో హడావుడి చేయడం మరొక ఎత్తు. మన ప్రభుత్వాలు పెద్ద ఎత్తున నేర్చుకున్న కళ. తెలంగాణను ముంచెత్తుతున్న కరువు విషయంలో, హైదరాబాద్ నగరాన్ని మరి కొన్ని వారాల్లో ముంచెత్తనున్న నీటి ఎద్దడి విషయంలో ప్రభుత్వ వ్యవహారం సరిగ్గా అట్లాగే ఉంది. కాలుష్య కారక వినాయక నిమజ్జన కార్యక్రమానికీ, దుర్గా నిమజ్జన కార్యక్రమానికీ, ప్రభుత్వాధినేతల భద్రతకూ చేసిన స్థాయి ఏర్పాట్లయినా రానున్న కరువు, నీటి ఎద్దడి మూడున్నర కోట్ల ప్రజలకు కల్పించబోయే ఇబ్బందుల విషయంలో కనబడడం లేదు.

పూర్తిగా కనబడడం లేదని అనడం కూడా సరికాదు. గత రెండు నెలల్లో లెక్కలేనన్ని సమావేశాలు జరిగాయి. ఆదేశాలు వెలువడ్డాయి. ముఖ్యమంత్రి నుంచీ, మంత్రివర్గ సహచరుల నుంచీ, ఉన్నతాధికారుల నుంచీ గంభీరమైన ప్రకటనలు వెలువడ్డాయి. వేల కోట్ల రూపాయల సహాయ పథకాల ప్రకటనలు వెలువడ్డాయి. ఈ ఆర్భాటాలలో ఎంత వాస్తవరూపం ధరించిందో తెలియదు. ప్రకటించిన కేటాయింపుల్లో పది శాతమో, పాతిక శాతమో కూడా విడుదలైనట్టు వార్తలు లేవు. ఇప్పటికే మొదలైన, రానున్న ఉత్పాతాన్ని తట్టుకోవడానికి ఎన్ని ప్రభుత్వ శాఖలు ఎంతగా సంసిద్ధమయ్యాయో తెలియదు. తమ కింది సిబ్బందిని అందుకు సిద్ధం చేయడానికి అధికారపీఠాలు ఏ ప్రయత్నాలు చేస్తున్నాయో తెలియదు.

ముందున్నది సాధారణమైన పని కాదు. ఎన్నో పనులు సకాలంలో, క్రమబద్ధంగా, ప్రణాళికాబద్ధంగా చేయవలసి ఉంది. ప్రస్తుతం ఉన్న పంటలను రక్షించాలి. యాసంగి పంటల ప్రణాళికలు దెబ్బ తినకుండా చూడాలి. మొత్తంగా వ్యవసాయ సంక్షోభానికి గురవుతున్న రైతాంగానికి సహాయం అందించాలి. నష్టపోయిన పంటలకు బీమా పథకాలు రూపొందించాలి. నీటి కొరతను దృష్టిలో పెట్టుకుని పంట వేయగూడదని సలహా ఇవ్వదలచుకుంటే, క్రాప్ హాలిడే ప్రకటిస్తే, నష్టపరిహారం గురించి ఆలోచించాలి. పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ నీటి ఎద్దడిని అధిగమించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి.

“ప్రకటనల ఆడంబరాలను దాటి, నిజంగా రైతాంగ, వ్యవసాయ, గ్రామీణ, సాగు నీటి, తాగు నీటి సంక్షోభాన్ని నివారించడానికి, కనీసం తగ్గించడానికి ప్రభుత్వం మరింత ఎక్కువ చిత్తశుద్ధితో, కేంద్రీకరణతో పని చేయవలసి ఉంది. ఈ సందర్భంలో అడగవలసిన ప్రశ్నలు: ఇప్పుడు సాగులో ఉన్న, నీటి కొరతకు ఎండిపోతున్న పంటలకు రైతులకు నష్టపరిహారం అందుతుందా? ఎప్పటికి? పంట నష్టం జరిగిందా లేదా అనేదానితో సంబంధం లేకుండా రైతులు స్వచ్ఛందంగా పంట మానేస్తే వారికి నష్టపరిహారం అందుతుందా? వ్యవసాయమే సంక్షోభంలో పడినప్పుడు, వ్యవసాయ పనుల మీద ఆధారపడిన భూమి లేని వ్యవసాయ కూలీల బతుకు తెరువు గురించి ప్రభుత్వం ఏమి ఆలోచిస్తున్నది? అదనపు పని దినాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం అలా ఉంచి, రాష్ట్రంలో తన పరిధిలో అదనపు పని దినాలు కల్పించడానికి రాష్ట్రప్రభుత్వం దగ్గర ప్రణాళికలేమన్నా ఉన్నాయా? తాగునీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి చేపట్టనున్న చర్యలు ఏమిటి? “  

రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించడం జూలై మొదటివారంలో మొదలయిందని, అప్పుడే వర్షపాత అంచనాలు, భూగర్భ జలాల అంచనాలు, రిజర్వాయర్లలో నీటి లభ్యత, ఆయా జిల్లాల్లో పంటల పద్ధతి నివేదికలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగాలను ఆదేశించిందని వార్తలు వచ్చాయి. సెప్టెంబర్ 18న శాసనసభ సమావేశమైనప్పుడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని సమీక్షించి ఒక ఏకగ్రీవ తీర్మానం చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిశీలనా బృందాన్ని పంపాలని, రు. 20,000 కోట్ల ప్రత్యేక సహాయ ప్యాకేజీ ఇవ్వాలని, ఉత్పాత సహాయ నిధులు ఇవ్వాలని, పంట నష్ట పరిహార సహాయాన్ని అందించాలని, తాగునీరు, పశుగ్రాసం, భూగర్భ జల పునరుద్ధరణలకు సహాయం అందించాలని ఆ తీర్మానంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇప్పుడు ఇస్తున్న 125దినాలకు అదనంగా మరొక 50 దినాలు ఇవ్వాలని కోరారు. ఈ కోరికలకు కేంద్ర ప్రభుత్వం స్పందించిందో లేదో నెల గడిచిపోయినా కనీస వార్తలు లేవు.

అక్టోబర్ 10-11ల్లో జరిగిన ఒక ప్రత్యేక సమావేశంలో తాగు నీరు, సాగు నీరు, వ్యవసాయం, విద్యుచ్చక్తి విషయాలలో 2027 జూన్ వరకు వర్తించే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయమని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారని వార్తలు వచ్చాయి. రైతులు యాసంగి పంటలు వేయవద్దని, ఉన్న నీటిని తాగు నీటి కోసం, ఇతర అత్యవసరమైన పనులకు మాత్రమే వాడాలని ముఖ్యమంత్రి తీవ్రంగా హెచ్చరించారని అక్టోబర్ 15-16ల్లో వార్తలు వచ్చాయి. గత సంవత్సరం ఇదే సమయానికి 462 టీఎంసీలుగా ఉన్న జలాశయాల నీటి నిలువ, ఇప్పుడు సగానికి పైగా తక్కువగా 200 టీఎంసీలుగా ఉన్నదని వార్తలు వచ్చాయి. పంట నష్టం, విత్తన సబ్సిడీ, ఇతర పంటలకు మారితే ప్రోత్సాహకాలు, నీరు పొదుపు చేసే వ్యవసాయ పద్ధతులు, రబీలో వరిసాగు మానితే నష్టపరిహారం వంటి పద్దుల కింద రు. 1,986 కోట్ల సహాయం ప్రకటించారని అక్టోబర్ 16న వార్తలు వచ్చాయి. అయితే ఈ నిధులు మంజూరు చేశారా, విడుదల చేశారా, ఎంతమంది రైతులకు అందాయి, విధి విధానాలు ఏమిటి వంటి వివరాలేమీ లేవు.

ప్రకటనల ఆడంబరాలను దాటి, నిజంగా రైతాంగ, వ్యవసాయ, గ్రామీణ, సాగు నీటి, తాగు నీటి సంక్షోభాన్ని నివారించడానికి, కనీసం తగ్గించడానికి ప్రభుత్వం మరింత ఎక్కువ చిత్తశుద్ధితో, కేంద్రీకరణతో పని చేయవలసి ఉంది. ఈ సందర్భంలో అడగవలసిన ప్రశ్నలు: ఇప్పుడు సాగులో ఉన్న, నీటి కొరతకు ఎండిపోతున్న పంటలకు రైతులకు నష్టపరిహారం అందుతుందా? ఎప్పటికి? పంట నష్టం జరిగిందా లేదా అనేదానితో సంబంధం లేకుండా రైతులు స్వచ్ఛందంగా పంట మానేస్తే వారికి నష్టపరిహారం అందుతుందా? వ్యవసాయమే సంక్షోభంలో పడినప్పుడు, వ్యవసాయ పనుల మీద ఆధారపడిన భూమి లేని వ్యవసాయ కూలీల బతుకు తెరువు గురించి ప్రభుత్వం ఏమి ఆలోచిస్తున్నది? అదనపు పని దినాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం అలా ఉంచి, రాష్ట్రంలో తన పరిధిలో అదనపు పని దినాలు కల్పించడానికి రాష్ట్రప్రభుత్వం దగ్గర ప్రణాళికలేమన్నా ఉన్నాయా? తాగునీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి చేపట్టనున్న చర్యలు ఏమిటి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *