ధైర్యం, దైవం కలగలసిన ప్రాంతం సిరిసిల్ల

– సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చిన కేసీఆర్ పాలన
 – కోట్లాది రూపాయల సొమ్ము చేసుకున్న కేసీఆర్ ‌కుటుంబ సభ్యులు
– పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఉరి సిల్లగా మారింది
– రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించండి
– సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి

సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో దైవ చింతన, నిజాం రజాకార్లపై చేసిన విరోచిత పోరాటానికి వారసులుగా సిరిసిల్ల ప్రాంత ప్రజలు ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సిరిసిల్లలో బుధవారం జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల అంటే సిరులకు నిలయం.. కానీ పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఉరి సిల్లగా మారిందని ఆరోపించారు. మనిషి నాగరికతకు మొదటి అడుగు వస్త్రం. వస్త్ర పరిశ్రమకు అసలైన చిరునామా సిరిసిల్ల అని, వేలాది కుటుంబాలు వస్త్ర పరిశ్రమను నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయని అన్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చీరలు, అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేయగల నైపుణ్యం ఇక్కడి చేనేత కార్మికుల సొంతమని పేర్కొన్నారు. సిరిసిల్ల ఉరిసిల్లగా మారితే 2009లో చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్లు కేకే మహేందర్ రెడ్డి తయారు చేసుకున్న స్థితిలో కేటీఆర్ చేరి 171 ఓట్లతో చావు తప్పి గెలిచారని ఎద్దేవా చేశారు. సిరిసిల్ల ప్రజలు ఓట్లు వేస్తే అక్రమంగా వేల కోట్లు సంపాదించుకుని ప్రపంచంలోనే ధనిక కుటుంబంగా కేసీఆర్ కుటుంబం ఆవిర్భవించిందని విమర్శించారు. 2009 నుంచి 2023 వరకు అరడజనుసార్లు జరిగిన ఎన్నికలలో కేటీఆర్ గెలిచినప్పటికీ చేనేత కార్మికుల ఆత్మహత్యలను ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు. కార్మికుల గల్ఫ్ వలసలు ఎందుకు ఆగలేదో ప్రజలు ఆలోచించాలన్నారు. గల్ఫ్ వెళ్లిన కార్మికులు అక్కడ ప్రమాదవశాత్తు మరణిస్తే కనీసం శవాలను తెచ్చుకునే పరిస్థితి కూడా లేదని, బీఆర్ఎస్ పాలనలో గల్ఫ్ కార్మికుల కుటుంబాల కోసం ఒక క్షణమైనా ఆలోచన చేయలేదని విమర్శించారు. గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక పాలసీ చేయాలని స్థానిక నాయకులు కోరితే ప్రమాదవశాత్తు విదేశాలలో ఇక్కడి కార్మికులు మరణిస్తే శవాన్ని తేవడంతోపాటు సంబంధిత కుటుంబానికి రూ.5 లక్షల సహాయం అందించే పథకాన్ని ప్రజా ప్రభుత్వం తెచ్చిందన్నారు. 2004, 2006, 2008లలో కరీంనగర్ జిల్లా ప్రజలు కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించారని, అయినా 2009లో పాలమÖరుకు వలస వచ్చారని, ప్రజలను మోసం చేసిన కల్వకుంట్ల కుటుంబం రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపంచారు. గోదావరి జలాలను అడ్డం పెట్టుకుని రవీందర్ రావు, సంతోష్ రావు, తారక రామారావు మానేరు ఇసుకను దోచుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వీటికి సజీవ సాక్ష్యం నేరెళ్ల బాధితులుగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమారి(జగ్జీవన్ రామ్ బిడ్డ)ను ఇక్కడికి తీసుకొస్తే పోలీసులతో నిర్బంధించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మిడ్ మానేరు డ్యాం ముంపులో కొంప పోయిందని కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇండ్ల స్థలాలు పొందలేదా అంటూ నిలదీశారు. సిరిసిల్ల ప్రజల ఓట్లు కేటీఆర్‌కు పచ్చ నోట్లుగా మారాయన్నారు. వేములవాడ శివయ్య, భద్రాచలం రామయ్యను మోసం చేసినవాడు కేసీఆర్ ఒక్కడు మాత్రమే అని సీఎం విరుచుపడ్డారు.

నేతన్నల కోసం రూ.1741 కోట్లు ఖర్చు చేశాం

వెయ్యి రోజుల ప్రజా పాలనలో రూ.1741 కోట్లు నేత కార్మికుల కోసం ఖర్చు చేశామని ముఖ్యమంత్రి చెప్పారు. వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాకు రూ.1700 కోట్లు నిధులు మంజూరు చేశామని, నూలు డిపో వేములవాడలో ఏర్పాటు చేశామని, వేములవాడ ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని, ఎమ్మార్వో కార్యాలయం. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, మహిళా పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

పద్మశాలి బిడ్డను శాసనమండలికి పంపించాలి

సిరిసిల్లలో మార్పు రాబోతున్నదని, ప్రజల కళ్లలో ఆనందం కనిపిస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. రాబోయే శాసనమండలి ఎన్నికలలో ఒక పద్మశాలి బిడ్డను శాసనమండలకి పంపించాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలలో సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మానేరు నది మీద కట్టిన చెక్‌డ్యాంలు కొట్టుకుపోయి కేసీఆర్ ఇంట్లో నోట్ల కట్టలుగా తేలాయన్నారు. కాళేశ్వరం ప్యాకేజీ 9,10, 11,12 పూర్తి చేయకుండా పెండింగ్ పెట్టడం వల్ల ఇక్కడ రైతులకు గోదావరి నీళ్లు చేరలేదని విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే హరీష్ రావు, కేటీఆర్, ఎర్రబెలి దయాకర్ రావు మంత్రులు అయ్యారని, అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క మంత్రులు అయ్యారని గ్రహించాలని కోరారు.

కుటుంబ పాలన కావాలో .. ప్రజా పాలన కావాలో ఆలోచించుకోవాలి

కుటుంబ పాలన కావాలో ప్రజా పాలన కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. గత పాలకులు ఎవరికైనా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించారా అంటూ పదేళ్లు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించేందుకు సరిపోలేదా అని ప్రశ్నించారు. గత పాలకులు కనీసం పేదలకు రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఆడపిల్లలకు ఇచ్చే బతుకమ్మ చీరలో కమీషన్ కొట్టేశారని సీఎం ఆరోపించారు. బతుకమ్మ చీరలకు రూ.350 కోట్ల బకాయిలు ప్రజా ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. గత పాలకులు ఇచ్చిన బతుకమ్మ చీరలు ఆడపిల్లలు ఎప్పుడూ కట్టుకోలేదన్నారు. ఈ పండుగకు చిలక పచ్చ చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదని చెప్పారు. రేషన్ కార్డులపై రేషన్ షాపుల ద్వారా నేడు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు. రైతు భరోసా కింద రూ.36,000 కోట్లు, రుణ మాఫీ కింద రూ.20,614 కోట్లు రైతులకు చెల్లించామని, 75 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నామని, రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించామని, నేటి పాలనలో శ్రీకాంతచారి తల్లిని మహిళా కమిషన్ సభ్యురాలిగా, చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యురాలిని మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించామని వివరించారు. సభలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్శర్‌రావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు ప్రసంగించారు. ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు సుదర్శన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు, ప్రభుత్వ సలహాదారు సర్కర వేణుగోపాల్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, మదన్మోహన్ రావు, లక్ష్మీకాంతరావు, డాక్టర్ సంజయ్, శ్రీ గణేష్, నాగరాజు, కుంభం అనిల్ రెడ్డి, నవీన్ యాదవ్, సంపత్ కుమార్, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, డీసీసీ¾ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, పార్టీ సీనియర్ నాయకులు Âకేకే మహేందర్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

రూ.340 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు 

సిరిసిల్లలో మొత్తం రూ.340 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సిరిసిల్లలో నేతన్న బజార్‌కు, సిరిసిల్లతోపాటు వేములవాడలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. సిరిసిల్ల, కోనరావుపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా రూ.99.40 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. సిరిసిల్ల, వేములవాడలో రెండు ఆర్డీవో కార్యాలయాలు, తంగళ్లపల్లి, వీర్నపల్లి, వేములవాడ రూరల్, రుద్రంగిలో నాలుగు తహసీల్దార్ కార్యాలయాలు, వేములవాడలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రుద్రంగిలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములు, అనుబంధ యూనిట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దూరులో నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవన్ ప్రారంభించారు. వేములవాడలో మహిళా పోలీస్ స్టేషన్, వేములవాడ, సిరిసిల్లలో రెండు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు శంకుస్థాపన చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *