పరాయి పాలనలోనే ఉన్నాం

– ఉద్యోగాలు మనవే.. మార్కులు వేసేది ఆంధ్రావాళ్లు
– ఇక్కడి నీళ్లు ఆంధ్రాకు పోతున్నాయి
– రాష్ట్ర అస్తిత్వమే ప్రశ్నాకర్థంలో పడింది
– తెలంగాణ అస్తిత్వ వేదిక చైర్మన్ వీరమళ్ల ప్రకాష్

వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2 : స్వయం పాలన పోయి పరాయి పాలన వచ్చిందని, రాష్ట్రం మనదే అయినా పాలన మాత్రం అంధ్రా కనుసన్నల్లోనే జరుగుతోందని తెలంగాణ అస్తిత్వ వేదిక చైర్మన్ వీరమళ్ల ప్రకాష్ అన్నారు. ఆర్గనైజేషన్ ఫర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ చైర్మన్, ‘కుడా’ మాజీ చైర్మన్ సుందర్ రాజ్‌యాదవ్ ఆధ్వర్యంలో వేదిక రాష్ట్రస్థాయి సమావేశాన్ని హనుమకొండ హంటర్ రోడ్డులోని మాస్టర్ జీ డిగ్రీ, పీజీ కాలేజీ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వేదిక చైర్మన్ ప్రకాష్, విశిష్ట అతిథిగా తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కారం రవీందర్‌రెడ్డి, అతిథిగా సమన్వయకర్త శ్రీధర్ దేశ్‌పాండేలు పాల్గొన్నారు. తొలుత మహాత్మా గాంధీ, ప్రొఫెసర్ జయశంకర్, నల్ల నరసింహులు చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజా కళాకారుడు, ఉపాధ్యాయ సాహితీవేత్త, జీవిత సాఫల్య పురస్కార గ్రహీత వల్లంపట్ల నాగేశ్వరరావును ఘనంగా సన్మానించారు. అనంతరం తెలంగాణ అస్తిత్వ పరిరక్షణపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రకాష్‌రావు మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పాలన మనదే అయినా వెనకుండి నడిపిస్తున్నది చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు. ఇదివరకు పాలనాపరంగా నిర్ణయం తీసుకోవాలంటే సెక్రటేరియట్‌లోనే జరిగిపోయేవని, కానీ ఇప్పుడు దిల్లీ నుంచో అమరావతి నుంచో అనుమతి తీసుకోవాల్సి వస్తోందని తెలిపారు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో జల దోపిడీ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గద్వాల పక్కనున్న జూరాల ప్రాజెక్టు నీళ్లను తెలంగాణ ప్రాంతానికి ఇవ్వాల్సిందిపోయి పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీలోని రిజర్వాయర్లు నింపారన్నారు. కోస్తా, రాయలసీమ ప్రాజెక్టులు నింపడానికి మహబూబూబ్ నగర్ నుంచి నీళ్లు తీసుకెళ్తుంటే పాలమూరు బిడ్డ, సీఎం రేవంత్ రెడ్డి ఒక్కమాటా మాట్లాడలేదేమని ప్రశ్నించారు. కృష్ణా నీళ్లు నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు రాకుండా కుప్పం వరకు ఎలా వెళ్లాయో చెప్పాలన్నారు. కేసీఆర్ హయాంలోనూ కష్టాలుండేవని, కానీ ఆ కష్టాలకంటే ఆయన ఇచ్చిన సౌకర్యాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. కేసీఆర్ ఆత్మహత్యలు ఆపడంతోపాటు ఇంటింటికీ నీళ్లు, రైతులు, పరిశ్రమలకు కరెంట్ ఇచ్చాడని, ఎన్‌కౌంటర్లు ఆపాడని చెప్పారు. రేవంత్ రెడ్డి అపరిపక్వత, అనుభవ లేమి, చంద్రబాబు ఆదేశాలను అనుసరించడం వల్ల తెలంగాణకు న్యాయం చేయలేకపోతున్నాడన్నారు. తెలంగాణకు నీళ్లు అందక మళ్లీ ఆత్మహత్యలు మొదలయ్యాయని చెప్పారు.

మేడిగడ్డను పేల్చేశారని చెబితే ఎవరూ నమ్మలేదు

కాళ్వేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డను బాంబులతో పేల్చేశారని తాను చెబితే ఎవరూ నమ్మలేదని ప్రకాష్ అన్నారు. 2024 జనవరిలో పెద్దపల్లి సమీపంలోని హుస్సేన్‌మియా వాగుపై చెక్‌డ్యాంలు పేల్చేస్తున్న కాంగ్రెస్ నాయకులను రైతులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించారని, ఇంతవరకు దానిపై ఎలాంటి చర్యలు లేవని ఆరోపించారు. 2026లో మానేరుపై రెండు బ్యారేజ్‌లు పేల్చేశారని, సంబంధిత ఈఈ కూడా వాటిని పేల్చేశారని చెప్పినట్లు గుర్తు చేశారు. కానీ అక్కడి ఎమ్మెల్యేలు, మంత్రులు కేసీఆర్ నాసిరకంగా కట్టడం వల్లే కూలిపోతున్నాయని చెబుతున్నారని, వరదలే లేనప్పుడు బ్యారేజీలు ఎలా కూలుతాయని ప్రశ్నించారు. మేడిగడ్డ వ్యవహారాన్ని పుణెలోని సీడబ్ల్యూవోపీఆరఎస్ అనే సంస్థకు ప్రభుత్వం అప్పగించిందని, ఆ సంస్థ కూడా నాలుగు పిల్లర్లు మాత్రమే దెబ్బతిన్నాయని చెప్పిందన్నారు. ఎన్‌డీఎసఏ, ఎన్జీఆరఐ, విజిలెన్స్, ఇతర కమిటీలు మేడిగడ్డను పరిశీలించినా పిల్లర్లు ఎందుకు కుంగాయనేది ఏ ఒక్క రిపోర్టులో రాయలేదని, వరంగల్ నిట్, బాంబే ఐఐటీ ఇంజినీర్లు సర్వే చేసినా ఇంతవరకు కారణాలు తేల్చలేదని చెప్పారు. మేడిగడ్డలో నాలుగు పిల్లర్లను కట్టకుండా కాంగ్రెస్ పాలకులు కథలు చెబుతున్నారని మండిపడ్డారు.

ఎయిర్ పోర్టుకు జయశంకర్ పేరు పెట్టాలి

వరంగల్ ఎయిర్‌పోర్టుకు జయశంకర్ సార్ పేరు పెట్టాలని ప్రకాష్ డిమాండ్ చేశారు. పోరాటం చేసే వ్యక్తులకు తమ వేదిక గురువులా ఉంటుందంటూ తెలంగాణ అస్తిత్వ పోరాటానికి ఓరుగల్లు నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. రామప్ప ఆలయాన్ని కాపాడుకునేందుకు అస్తిత్వ వేదిక ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.

గద్దర్, జయశంకర్ విగ్రహాలు ఆంధ్రాలో పెట్టనిస్తరా?

ప్రత్యేక రాష్ట్రం వచ్చినా అన్ని రంగాల అభివృద్ధి జరగలేదని సుందర్‌రాజ్ యాదవ్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఆంధ్రా పాలకులు, నేతల విగ్రహాలు పుట్టుకొస్తున్నాయని, అమరావతి నుండి ఆదేశాలు వస్తే వాళ్ల విగ్రహాలు పెడుతున్నారని ఆరోపించారు. మరి తెలంగాణ గద్దర్, జయశంకర్ సార్ విగ్రహాలు ఆంధ్రాలో పెట్టనిస్తరా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే గద్దర్, జయశంకర్ సార్ విగ్రహాన్ని విజయవాడలో పెట్టించాలని డిమాండ్ చేశారు. మన వనరులను మనమే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన స్పూర్తితో అస్తిత్వ వేదిక పనిచేస్తుందని, వరంగల్ నుండే అస్తిత్వ పోరాటం మొదలవుతుందని స్పష్టం చేశారు.

తెలంగాణ వనరులు దోపిడీ

తెలంగాణ వనరులు దోపిడీకి గురవుతున్నాయని శ్రీధర్ దేశ్ పాండే అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం ఉద్యమకారుల ఆలోచనతో రూపుదిద్దుకుందని, కానీ ఆ విగ్రహాంతోపాటు తెలంగాణ గేయం వాణిని మార్చేశారన్నారు. తెలంగాణ రానివ్వనని ప్రమాణం చేసిన రోశయ్య విగ్రహాలు రాష్ట్రంలో పెట్టారని, రైతాంగానికి గోదావరి నీళ్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ వచ్చిందే తప్ప వనరుల దోపిడీ పెరిగిపోయిందన్నారు. మేడిగడ్డ గేట్లు మరమ్మతులు చేయకుండా కావాలనే నీళ్లను వృథాగా వదులుతున్నారని విమర్శించారు. పాలకులు మారినా తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతోందని, పోరాడి తెచ్చుకున్న తెలంగాణను తాము ఇచ్చిన తెలంగాణ అని చెప్పుకుంటున్నారని టీఎన్జీవోస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ పోరాట చరిత్రను మార్చే కుట్ర జరుగుతోందని, తమ ఆస్తులను కాపాడుకునే పనుల్లో పాలకులు ఉన్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ అస్తిత్వ వేదిక పోరాటానికి సిద్ధమవుతోందని, వరంగల్ నుండే పోరాటం మొదలవుతుందని తేల్చిచెప్పారు. కార్యక్రమంలో వేదిక రాష్ట్ర కన్వీనర్ పిట్టల రవీందర్, ఓబీసీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ గడ్డం భాస్కర్, సీనియర్ జర్నలిస్ట్ బుచ్చన్న, రాష్ట్ర గెజిటెడ్ ఉద్యోగుల అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర సలహాదారు గంగాపురం వేణుమాధవ్, డాక్టర్ప్ జేఏసీ నాయకుడు నాగేంద్రబాబు, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనగాని యాదగిరి గౌడ్, గుల్లపల్లి చిరంజీవి, వద్దిరాజు గణేష్, తాడిశెట్టి క్రాంతి, కొక్కొండ విజయబాబు, రాచకొండ ప్రవీణ్, డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *