– తూప్రాన్‌లో అమూల్ డెయిరీ ప్లాంట్ ప్రారంభోత్సవం
– సబర్ డెయిరీ ప్రాజెక్టుకు భూమి పూజ
– కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2 : కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 4వ తేదీన రాష్ట్రంలో పర్యటించనున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్‌లోని ఊర్జీ ఇండస్ట్రియల్ పార్కులో ఆరోజు ఉదయం 10 గంటలకు నిర్వహించే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. సబర్ డెయిరీ ప్రాజెక్టు భూమి పూజతోపాటు అమూల్ సంస్థ రాష్ట్రంలో అత్యంత ఆధునికంగా ఏర్పాటు చేసిన మొట్టమొదటి డెయిరీ ప్లాంట్‌ను ఆయన చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో పాడిపరిశ్రమ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతోపాటు, వాల్యూ క్రియేషన్ పెంచి పాడి రైతులకు ఆర్థికంగా చేయూతనందించడమే ఈ ప్లాంట్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పాలు 5 లక్షల లీటర్లు (5 ఎలఎల్పీడీ), పెరుగు 200 మెట్రిక్ టన్నులు (200 ఎంటీపీడీ), మజ్జిగ అండ్ లస్సీ చెరో 30 కిలో లీటర్లు (30 కేఎల్‌పీడీ), పనీరు 10 మెట్రిక్ టన్నులు (10 ఎంటీపీడీ), ఐస్ క్రీమ్: 50 కిలో లీటర్లు (దీన్ని భవిష్యత్తులో లక్ష లీటర్ల వరకు విస్తరించే అవకాశం ఉంది), స్వీట్స్ అండ్ బేకరీ ఉత్పత్తులు రోజుకు 3 నుంచి 5 మెట్రిక్ టన్నులు, నెయ్యి 5 మెట్రిక్ టన్నులు ఈ ప్లాంటులో ఉత్పత్తి జరుగుతాయన్నారు.
శ్వేత విప్లవం 2.0 గ్రామీణ వికాసానికి బాటలు
కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన శ్వేత విప్లవం 2.0 ద్వారా 2028-29 నాటికి డెయిరీ కో ఆపరేటివ్స్ ద్వారా పాల సేకరణను 50% పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. 2029 నాటికి దేశవ్యాప్తంగా 75,000 కొత్త పాడి సహకార సంఘాలను (ఎన్డీసీఎస్) ఏర్పాటు చేయనుండగా ఇందులో భాగస్వామ్యంగా తెలంగాణలో 1,525 కొత్త సహకార సంఘాలను నిర్దేశించినట్లు స్పష్టం చేశారు.
తెలంగాణకు ఎన్సీడీఎస్కు భారీ మద్దతు
గత 12 ఏళ్లలో నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్సీడీసీ) ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి రూ.1.16 లక్షల కోట్ల సహాయం అందించినట్లు తెలిపారు. ధాన్యం(వరి) సేకరణకు 2025-26 సీజన్‌కు రూ.37,000 కోట్లు, 2026-27 రబీ సీజన్ కోసం రూ.22,700 కోట్ల రుణాన్ని మంజూరు చేసినట్లు చెప్పారు. సహకార చట్టాల విస్తరణ పార్లమెంటులో ఇటీవలే ఎన్సీడీసీ బిల్లు ఆమోదం పొందడంతో రిజిస్టర్డ్ కోఆపరేటివ్స్తోపాటు సహకార రంగంలో పనిచేసే అన్ని సంస్థలకూ నిధుల లభ్యత ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న 60వేల పైచిలుకు సహకార సంఘాల్లో 70% గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండగా వాటిలో కోటిమందికి పైగా సభ్యులు ఉన్నారని, కేంద్ర ప్రభుత్వ చర్యలు రాష్ట్రంలోని రైతులకు, పాడి రైతులకు ఎంతో లబ్ది చేకూరుస్తాయని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





