సంక్రాంతి తర్వాత అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు
రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ముగ్గురిపై పిడి యాక్ట్
శాసనసభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19 : పిడిఎస్ బియ్యన్ని అక్రమంగా విక్రయిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పటి వరకు చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న దొడ్డు రకం బియ్యాన్ని ప్రజలు వినియోగించుకోకపోవడంతో పక్కదారి పడుతున్న మాట వాస్తవమేనన్నారు. ఆ బియ్యం బ్లాక్ మార్కెటింగ్ ద్వారా పాలిషింగ్ చేసి అక్రమాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ తరహా నేరాలకు పాల్పడిన ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ముగ్గురిపై పిడి యాక్ట్ కింద కేసులు నమోదు అయ్యాయన్నారు. పిడిఎస్ బియ్యం దారి మళ్లినా, ట్రాన్స్ పోర్ట్ చేసినా, రీసైక్లింగ్ కు పాల్పడ్డా ప్రభుత్వం ఉపేక్షించబోదని ఆయన స్పష్టం చేశారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేయాలన్న విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుందన్నారు.
గురువారం రాష్ట్ర శాసనసభలో కునమనేని సాంబశివరావు తదితరులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి స్పందిస్తూ.. చౌక ధరల దుకాణాల ద్వారా ఇతర నిత్యావసర సరుకుల పంపిణీ అంశంపై రాష్ట్ర క్యాబినెట్ ముందు పెట్టి చర్చిస్తామన్నారు. సివిల్ సప్లైస్ మండల స్థాయి గోడౌన్ ల వద్ద ఇకపై వెయింగ్ మిషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 50 కిలోల బియ్యం బస్తాలో తక్కువగా వస్తున్నాయన్న అంశంపై ఆయన మాట్లాడుతూ మొత్తం సరఫరా చైన్ మీద నిఘా పెట్టబోతున్నామన్నారు. అయితే గన్నీ బ్యాగ్ ల వెయిట్ ను మినహాయించుకుని బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. సంక్రాంతి తరువాత రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు అందిస్తామని ఆయన సభకు తెలిపారు అవసరం ఉన్న ప్రాంతాల్లో కొత్తగా చౌక ధరల దుకాణాలను ఏర్పాటు చేస్తామన్నారు తెల్ల రేషన్ కార్డు దారులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రన్స్‌ఫర్ చేసే ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదన్నారు. మండల సివిల్ సప్లైస్ గోడౌన్ ల నుంచి చౌక ధరల దుకాణాలకు అయ్యే ట్రాన్స్ పోర్ట్ వ్యయం డీలర్లకు ఇచ్చే అంశాన్ని పరిశీలనలోకి తీసుకుంటామన్నారు.