అన్ని బడుల ను ఆర్మూర్ లా మార్చండి..

“ఊర్లలో ఉన్న బడులన్నిటినీ మూసేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి బెంగలూరు హిందూ పత్రిక సమావేశంలో మాట్లాడటం తెలంగాణ ఆకాంక్షను కాలరాయడం లాంటిది. తెలంగాణ ఆవిర్భావానంతరం మొదటి దశాబ్ద కాలంలో 37000 ఉన్న ప్రభుత్వ పాఠశాలలు 29 వేలకు తగ్గితే ఈ రాష్ట్ర ప్రభుత్వం లో మరో రెండు వేలు మూతపడి 27 వేలకు చేరుకున్నాయి. ఇప్పుడు ఆ పాఠశాల స్థితిగతులను బాగుపరచవలసిన ప్రభుత్వం వాటిని మూసేసి, నాలుగు వేల పాఠశాలలను మాత్రమే కొనసాగిస్తామని ప్రకటించడం తెలంగాణ విద్యా రంగానికి బలిపీఠంలా మారింది..”

(ప్రభాకర్ కస్తూరి @,మరో గ్రంథాలయ ఉద్యమo.: 9440970454 )

ఆర్మూర్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ సర్వ హంగులతో స్వయాన ముఖ్యమంత్రి  ప్రారంభించడం నిజంగానే తెలంగాణ విద్యా రంగానికి ఓ మైలురాయి లాంటిది. ఆ పాఠశాలను ప్రారంభిస్తూ ఆయ‌న చేసిన ప్రసంగం నిజంగానే ప్రాధాన్యతను సంతరించుకున్నది. ప్రభుత్వ విద్యార్దులకు ప్రత్యేక కిట్ ను అందిస్తున్నం దుకు, ఉదయం బ్రేక్ ఫాస్ట్, సాయంత్రం స్నాక్స్, ఉచిత పుస్తకాలు, మంచి యూనిఫార్మ్, షూస్ ప్లేగ్రౌండ్, అన్ని సౌకర్యాలతో కూడిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ప్రారంభించినందుకు శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలపాల్సిందే. కానీ, నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించినట్టు, నాలుగు రోజుల క్రితం బెంగళూరులో హిందూ పత్రిక సంభాషణలో తెలంగాణలోని 27 వేల పాఠశాలలో కేవలం 4000 మాత్రమే ఉంటాయని పరోక్షంగా మరో 23 వేల పాఠశాలలని మూసివేయడానికి తీసుకున్న నిర్ణయం విద్యార్థుల‌ను  ఆందోళన గురి చేస్తున్నది. ఈ విషయంలో ఒక్క మాట మాట్లాడకుండా, ఈ పాఠశాలలన్నిటిని ఆర్మూర్ పబ్లిక్ స్కూల్ వలె మారుస్తా రేమోనన్నా ఆశ తొణికిస‌లాడింది.

తెలిసో తెలియకో గత ప్రభుత్వం కులాల పేర పెట్టిన రెసిడెన్షియల్ పాఠశాలల్ని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 200 కోట్లతో నెలకొల్పుతున్నామనీ ప్రకటించడం, తెలంగాణ లోని ఊరుబడులకు ఉరి పెట్టే చర్యలా  కనిపిస్తున్నది. ఆర్మూర్ లాంటి టిపిఎస్ పబ్లిక్ స్కూల్ లను, కొద్దిమంది విద్యార్థుల కోసం, సకల సౌలభ్యాలతో ఏర్పాటుచేసి, మిగిలిన లక్షలాదిమంది విద్యార్థులకు, కనీస వసతులు వనరులు లేకుండా ఒకరో ఇద్దరో పాఠశాల టీచర్లతో, ఐదో తరగతి వరకు 5 టీచర్లు ఐదు తరగతి గదులు లేని బహుళ బోధన తో మిగతా పాఠశాల వ్యవస్థ అవస్థలో కూరుకు పోతున్నది. ఊర్లలో ఉన్న బడులన్నిటినీ మూసేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి బెంగలూరు హిందూ పత్రిక సమావేశంలో మాట్లాడటం తెలంగాణ ఆకాంక్షను కాలరాయడం లాంటిది. తెలంగాణ ఆవిర్భావా నంతరం మొదటి దశాబ్ద కాలంలో 37000 ఉన్న ప్రభుత్వ పాఠశాలలు 29 వేలకు తగ్గితే ఈ రాష్ట్ర ప్రభుత్వం లో మరో రెండు వేలు మూతపడి 27 వేలకు చేరుకున్నాయి. ఇప్పుడు ఆ పాఠశాల స్థితిగతులను బాగుపరచవలసిన ప్రభుత్వం వాటిని మూసేసి, నాలుగు వేల పాఠశాలలను మాత్రమే కొనసాగిస్తామని ప్రకటించడం తెలంగాణ విద్యా రంగానికి బలిపీఠంలా మారింది.గత ప్రభుత్వం మూసివేసిన పాఠశాలను తెరిపిస్తామని విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం అందుకు భిన్నంగా ఇప్పుడు ఊహకు అందని ఇంటి గ్రేటెడ్ స్కూల్స్ కొక్క దానికి 200 కోట్లు కేటాయిస్తూ‘మెగా’బడుల్ని తెరుస్తామని, 23 వేల ఊరుబడులకు ఉరి పెట్టడం దారుణం.

ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని వెనుకకు తీసుకొని ఉన్న బడులను బాగు చేయడం, 200 కోట్లను ఒక్కో మండలానికి కేటాయిస్తే ఉన్న బడులన్నీ ఉన్నదీకరించబడతాయి. ఊరికి చేరువలో ఉన్న బడులను ఏకం చేస్తూ విద్యార్థుల ఉపాధ్యాయుల సంఖ్యను పెంచి ఉన్నత ఫలితాలను రాబట్టవచ్చు. కానీ అందుకు భిన్నంగా మొత్తంగా తెలంగాణ విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెట్టే ఈ పరిస్థితి రానున్న రోజుల్లో భవిష్యత్ తరాలకు బలి పీఠంగా మారనున్నది. 75 ఏళ్లుగా ఒలంపిక్ ఆటల్లో బంగారు పతకాన్ని సాధించలేని దేశంలో తెలంగాణ పిల్లలు ఆర్మూర్ ఆట స్థలంలో ఆడుతూ తెస్తారని ఆశించడం మంచిదే, కానీ తెలంగాణలోని వేలాది పాఠశాలల్లో ఆడుకోవడానికి కనీసం ఆటస్థలం లేక, ఉన్న ఆడుకోవడానికి ఓ బాలు, క్యారం చెస్, లైబ్రరీ సైన్స్ ల్యాబ్స్ లేక, సృజనాత్మకత శాస్త్రీయ దృక్పథం కొరపడి, అమావాస్య రోజు మంగళవారం నాడు బడి తెరుచుకున్న పిల్లలు రాణి తల్లిదండ్రులు పంపని అశాస్త్రీయ విద్యా విధానం కొనసాగుతున్న‌ది.

బిల్డింగులు భవంతులతో రూపం మారవచ్చునేమో కానీ విద్యారంగ సారంలో రావాల్సిన మార్పుల సంగతి మర్చిపోవడం ఇవాళ తెలంగాణ విద్యారంగం ఎదుర్కొంటు న్న అతిపెద్ద సమస్య. పదో తరగతి ఫలితాల్లో 98 శాతం సాధించిన పిల్లలకే కనీస సామర్ధ్యాలు లేవని, చాలా సర్వేలు చెబుతున్నా, కనీస సామర్ధ్యాలు సాధించలేని పాఠశాల విద్యారంగ‌ అధోగతి గురించి ఆలోచించకుండా, ‘ఏ ఐ’పేరిట స్కిల్ యూనివర్సిటీల స్థాపనతో కొద్దిమంది మెరుగైన పిల్లల భవిష్యత్తు కోసం తెలంగాణ విద్యారంగం చూపు విస్తరించడం ప్రమాదకరం. ఒకప్పుడు గ్రామీణ పాఠశాలల్లో చదువుకున్న తను ముఖ్యమంత్రిగా ఎదిగిన తీరును వేదిక మీద పంచుకుంటున్నప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వాళ్ళ హృదయం ఉప్పొంగిపోయింది. కానీ ఇప్పుడు అదే పాఠశాలల్లో ఎవరి పిల్లలు చదవలేని దుస్థితిలోకి ప్రభుత్వ పాఠశాలలు వెళ్లిపోవడానికి కారణాలను ఆలోచించ కపోవడం విషాదకరం. అందుకు టీచర్లకు జీతాలు ఎక్కువయ్యాయనో, పనిచేయడం లేదనో అపవాదును అంటగడుతూ, పిల్లల సంఖ్య తగ్గడానికి చుట్టూ వేలుస్తున్న ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణను అనుకూల విధానాలను ఆపలేకపోవడం వల్ల ఇవ్వాల గ్రామీణ ప్రాంతాల్లో బడులు బలిపీఠం ఎక్కబోతున్నవి.

ఇప్పటికే చాలా గ్రామాల్లో గ్రామ సర్పంచులు మా ఊర్లోకి ప్రైవేటు బస్సులు రావద్దని మా ఊరు బడిని, కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఊరుబడులో పిల్లలను చేర్చిన తల్లిదండ్రులకు ఇంటి పన్ను నీళ్ల పన్ను రద్దు చేస్తామని, ప్రభుత్వ పథకాల్లో ప్రాముఖ్యతను ఇస్తామని ప్రకటించడం ఆలోచించవలసిన అంశం. ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలను ఉన్నతీకరించాలని, 9000 గ్రామాలకు సంబంధించిన సర్పంచులు గ్రామ కమిటీ తీర్మానాలుగా మా బడులు మూసెయ్యొద్దు ,అని ప్రభుత్వానికి తెలియజేయాలి. పాఠశాల పూర్వ విద్యార్థు లు ,విద్యావంతులు,గ్రామ పెద్దలు తమ ఊరి బడిని కోల్పోవడం అంటే తమ సంస్కృతిక వికాస కేంద్రాన్ని పాతర వేయడం లాంటిదే. కనుక, ఆయా గ్రామాల పాఠశాలను కాపాడుకోవడం బలోపేతం చేయడానికి ఒక ఉద్యమంగా సాగాల్సిన సందర్భం. ఇవాళ తెలంగాణలో హింసకు, హత్యలకు, స్త్రీలపై అత్యాచారాలకు కారణమైన మద్యం దుకాణాలను మూసివేయాలి కానీ, గ్రామ వికాసానికి భవిష్యత్ తరానికి దోహదపడే ఊరుబళ్లను మూసివేయడం అంటే, తెలంగాణను స్మశాన వాటిక గా మార్చడం లాంటిది.

ప్రభుత్వం వెంటనే చర్యను ఉపసంహరించుకొని ప్రభుత్వ పాఠశాలలని బలోపేతం చేయాలి. బడ్జెట్ లో నిధులు పెంచి, ఒకే పాఠశాలకు,రెండు వందల కోట్లు ఖర్చు చేసే బదులు,మండలం లోని అన్నీ బడులను,అవే నిధులతో మెరుగు పరచడానికి ప్రభుత్వం పూనుకోవాలి.ఊళ్లోకి ప్రైవేట్ బస్సులు వచ్చి ప్రైవేట్ బడులకు పిల్లల్ని తరలించుకు పోకుండా,సకల సౌకర్యాలతో ఊరు బల్లను బాగు చేసుకోవడం,బడి బాటలో ఇంటింటికి తిరిగి మెరుగైన విద్యను అందిస్తామని చెపుతున్న టీచర్లు,సామాజిక బాధ్యతగా పిల్లల్లో విద్యా విలువలు పెంపొందించాలి. పూర్వ విద్యార్థుల సహకారం తో ఊరుబడిన బాగు చేసు కోవాలి.ఓ గంట ముందు,తర్వాత సెమీ రెసిడెన్షియల్ స్కూల్ గా విద్యార్ధుల్లో, క్రీడలు, గ్రంథాలయ, సాంస్కృ తిక అంశాల్లో మెరుగైన విద్యను అందించాలి. ఇందు కోసం విద్యార్థి సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలపడం ద్వారా ప్రభుత్వ బడుల మూసి వేతన అడ్డుకోవాలి.అందరికీ సమాన విద్య , ఉచితంగా అందే వరకు పోరాడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *