నడిపోడు(కథ)

“కేసుపాలయి జైలుకు పోతిరి. తెలంగాణ తెస్తిరి. ఏబీసీడీలు తెచ్చుకుంటిరి. గిన్ని ఉద్దెమాలు జేత్తరి. ఇంకెప్పుడు ? కొడకా! నీ కష్టాల ఆకలి తీరేది” అంటూ నిరాశకు గురైండు సోమయ్య.  “నౌకరు జేశెటోళ్ళకు జీతం యాల్లకు అందకపాయే. సదువుకున్న పొలగాళ్ళకు కొలువులు రాకపాయే. మరి వోట్ల కోసం వచ్చే సదువురాని ఆ బందెల్లి గాళ్ళకు పెద్దపెద్ద మంత్రి పదవులు ఎందుకురా?” అని గౌరమ్మ మండిపడ్డది..”
పక్కింట్లో గంప కింద పుంజు ‘కొక్కోరకో ‘ అని కోడికూత వినిపించగానే మబ్బుల నాలుగు గంటలకు మంచం నుండి సోమయ్య నిద్ర నుండి లేచి కూసున్నడు. నెమ్మదిగా లేచి కొయ్యకు యెలాడ దీశిన తన అంగిలోని బీడి తీసుకొని అగ్గిపుల్ల గీకి బీడీ ముట్టిచ్చిండు. గప్ప గప్ప రెండు బుక్కలు పొగ లోపలికి పీల్చిండు. ఖస్ ఖస్ అని రెండు సార్లు గట్టిగనే దగ్గిండు.
తన భార్య మంచం పక్కనే నేల మీద పడుకుని ఉంది. “ఓ గౌరమ్మ లేవరాదు. తెల్లారింది” అన్నడు సోమయ్య. “సరే గని రైలుబండి ఎక్కి ఇల్లంతా పొగ నింపరాదు.” భార్య కారెడ్డమాడింది.
“ఆ పనే చేస్తున్నా” నవ్వుకుంటా అన్నడు
నీకు నిద్ర పట్టదు. నన్ను పండుకోనియ్యవు.” అంటూ గౌరమ్మ గులిగింది.
“సరె పండుకో…” అనీ కాల కృత్యాలు కోసం ఇంటి వెనకకు పోయిండు. యాపకొమ్మను ఇరిసి నోట్లో పండ్ల పుల్లేసి అటుఇటు రుద్దిండు. తెల్లారెసరికి ముఖం కడిగి ఇంటి ముందు అరుగు మీద కూసున్నడు.
కోమళ్ళ ఊరులోకి చేరుకోవాలంటె ముందుగా రైలు పట్టాలు దాటాలి. ఆ రైలు పట్టాల పక్కనే మాల మాదిగలు, సూదరోళ్ళకు సర్కార్ కట్టిచ్చిన ఇందిరమ్మ
కాలనీ. పొద్దున్నే హైదరాబాద్ కు కాకతీయ ప్యాసింజర్ రైలు పోతున్నది. టైమ్ ఏడు అవుతుంది. మెల్లగా సోమయ్య లేచినిలబడి ఊతకర్ర చేతులకు తీసుకుని రైలు పట్టాలు దాటిండు. అడుగుల అడుగేసుకుంట కోమళ్ళ బస్టాపులో జానిమీయ ఛాయ్ డబ్బకాడికి శేరుకున్నడు. సోమయ్య, జానిమీయ చిన్నప్పటి నుండి మంచి దోస్తులు. ఇద్దరు పెద్దబాల శిక్ష వరకు కోమళ్ళ ఊర్లో వెంకటయ్య శాస్త్రి దగ్గర సదువుకున్నరు. సోమయ్య ఇరవై ఏండ్లకే మేనపిల్ల గౌరమ్మను లగ్గం జేసుకున్నడు. కాలం గిర్రున తిరిగే సరికి నలుగురు పిల్లల తండ్రి అయిండు. మట్టిపనికి పోయే సోమయ్యకు రైల్వేలో గ్యాంగ్ మెన్ కొలువు దొరికింది. నెలకు వెయ్యి రూపాయల జీతం. పెద్ద బిడ్డను శివునిపల్లి ఊరిలో ఓ అయ్య చేతిలో పెట్టిండు. ఏడాది తర్వాత పెద్దోడు కృష్ణ, చిన్నోడు లక్ష్మణ్ పెండ్లి చేసుకొని ఎవ్వరి సంసారాలు వాళ్ళే కలో గంజో తాగి సక్కగనే బతుకు బండి నడుపుకుంటున్నరు. సోమయ్య ముప్పై ఏండ్లు ఉద్యోగం చేసి పదేండ్ల కింద రిటైర్మెంట్ తీసుకొని ఇంటి పట్టున ఉంటున్నడు.
నడిపోడు రామయ్య చిన్నప్పటి నుండి లావటోడనే పేరుకు తగ్గట్టుగానే తిరిగేది. ఎపుడు యూనివర్సిటీలో ఏదో పెద్ద సదువు చదువుతున్న అనుకుంట వరంగల్ లోనే ఉండేటోడు.
జానిమీయా ఇంతలోనే ఛాయ్ తీసుకొని సోమయ్య చేతిలో పెడుతూ “సోమన్న తెలంగాణ పేపర్ల మన రామయ్య పోటో పడ్డది, సూశినవానె” అంటు పేపర్ కూడా చేతికి ఇచ్చిండు. జానీమియా మాటకు
సోమయ్య ముఖం సూర్యుని ఎండపొడకు దగదగ వెలిగిపోతుంది. ” రామయ్యకు పోస్ట్ డాక్టొరల్” వార్తను వాక్యాలు నెమ్మదిగా చదివిండు. కాని పూర్తిగా అర్ధం కాలేదు. మొత్తానికి ఏదో నౌకరి దొరికిందని సోమయ్య తన మనసులో సంబురంగానే ఉన్నడు. చాయ పైసలు ఇచ్చి పేపర్ చేతుల పట్టుకొని మెల్లమెల్లగా నడుసుకుంట ఇంటిబాట పట్టిండు.
“ఉన్నావమ్మా…. ఓ గౌరమ్మ…! నడిపోని పోటువ పేపర్ల వచ్చిందే” అనుకుంట ఇంటిలోపలికి పోయిండు సోమయ్య.
ఇంట్లో పని చేసుకుంటున్న గౌరమ్మ
“గప్పుడు కూడా ఏదో డాక్టర్ అయిండని, పేపర్ల వచ్చెగదా ? ఇప్పుడు మల్లా ఏమని వచ్చిందయ్యా!” అని అడిగింది భార్య.
“ఏమోనే… ఏదో డాక్టర్ పోస్టు వచ్చిందాటనే”
పేపర్ లో వచ్చిన రామయ్య పోటువ భార్యకు చూపెట్టిండు.
పేపర్ల రామయ్య ఫోటో సూడంగనే గౌరమ్మ కనుగుడ్లలో తడి పొర ఊరుతుంది. మరోవైపు పెదవుల మీద సంతోషం తొంగి సూత్తంది. ఉండబట్టలేక మొగనితో
“మరి పొలగానికి ఫోన్ జేసి మట్లాడరాదు” అన్నది.
వెంటనే సోమయ్య, దీగూడులో ఉన్న నొకియా ఫొన్ తీసుకొని రామయ్యకు కలిపిండు. రెండు సార్లు ఫోన్ రింగ్ కావడంతోనే రామయ్య కాల్ ఎత్తిండు.
“రాములు ఎట్లున్నవు బిడ్డా”…
“నాయిన బాగున్నవానే, అవ్వకు పాణం మంచిగ ఉందా”? అని అడిగిండు రాము.
“అందరం మంచిగనే ఉన్నం బిడ్డా! ఇయ్యాల పేపర్ల నీ పోటువ వచ్చింది కదరా! ఏం పోస్టు వచ్చింది బిడ్డా” అని తండ్రి సంతోషంగా అడిగిండు.
“ఎహే…పోస్ట్ ఒచ్చుడు గాదె! రెండో డాక్టరేట్ వచ్చిందే!” రామయ్య అన్నడు.
“మరి ఇంకెప్పుడు నౌకరి ఒత్తది కొడకా” తల్లి అడిగింది.
“అవ్వా…నిన్ననే వరంగల్ లో ఓ ప్రైవేట్ టీచర్ ట్రైనింగ్ కాలేజీల సదువు జెప్పె ఉద్యోగంలో శేరిన్నే” రాము.
“నెలకు జీతం ఎంత కొడుకా” తండ్రి.
“పన్నెండు వేయిలు ఇస్తామంటున్నారు నాయిన” కొడుకు చెప్పిండు.
“నలభై యేండ్లు వచ్చెవరకు పెద్ద పెద్ద సదువులు సదివితివి. నెలకు పన్నెండు వేలకు పిల్లను ఎవడిస్తడురా? సగం ఈడు సదువులకే అయిపాయె బిడ్డా” అని తల్లీ గౌరమ్మ కండ్ల నీళ్ళు తీసుకున్నది.
తల్లి మాటలు విని అటువైపు రామయ్య మౌనంగా ఉండిపోయాడు.
“కేసుపాలయి జైలుకు పోతిరి. తెలంగాణ తెస్తిరి. ఏబీసీడీలు తెచ్చుకుంటిరి. గిన్ని ఉద్దెమాలు జేత్తరి. ఇంకెప్పుడు ? కొడకా! నీ కష్టాల ఆకలి తీరేది” అంటూ నిరాశకు గురైండు సోమయ్య.
“నౌకరు జేశెటోళ్ళకు జీతం యాల్లకు అందకపాయే. సదువుకున్న పొలగాళ్ళకు కొలువులు రాకపాయే. మరి  వోట్ల కోసం వచ్చే సదువురాని ఆ బందెల్లి గాళ్ళకు పెద్దపెద్ద మంత్రి పదవులు ఎందుకురా?” అని గౌరమ్మ మండిపడ్డది.
ఫోన్ లో అటు నుండి రామయ్య ఏదో మాట్లాడుతున్నడు…. ……తల్లికి మాత్రం ఆ మాటలు వినిపించడం లేదు. ఫోన్ కాల్ కట్ అయిపోయింది.
రచయిత : 
-కోడం కుమారస్వామి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *