“ఆయన సంపాదకత్వంలో రసహృదయ , కథకు శతమానం , శతక సాహిత్యం – సామాజిక నైతిక విలువలు , యువజన విజ్ఞానము (రెండవ ముద్రణ సురవరం ప్రతాపరెడ్డి ) , శతపత్రము (రెండో ముద్రణ – గడియారం రామకృష్ణ శర్మ ఆత్మకథ – కేంద్ర సాహిత్య అకాడెమీ వారి పురస్కారం పొందిన రచన; తెలుగు కథ వెలుగులు , ఓరుగల్లు కళా వైభవము తదితరాలను వెలువరించారు..”
నవంబర్ 20… గిరిజా మనోహర బాబు జన్మదినం
రామ కిష్టయ్య సంగన భట్ల సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్ …9440595494
తెలంగాణకు చెందిన నటులు, కవి, రచయిత, ప్రముఖ ప్రాసంగికులు, ప్రయోక్త, సాహితీ సేవకులు గన్నమరాజు గిరిజా మనోహర బాబు గురించి తెలంగాణలో తెలియని సాహిత్యాభిమానులు ఉండరంటే అతశయోక్తి లేదేమో. 1951 నవంబరు 20 న మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ లో శకుంతలమ్మ, రామేశ్వర్ రావు దంపతులకు ఆయన జన్మించారు. ఆలంపూర్, పాలెంలలో ప్రాథమిక , ఉన్నత విద్యాభ్యాసాలు పూర్తి చేసి, ఉస్మానియా విశ్వ విద్యాలయం , హైదరాబాద్ నుండి ఎం ఏ. తెలుగులో పట్టా పొందాడు. జూనియర్ లెక్చరర్ గా 6 జనవరి 1978 జనవరి 7 న ఉద్యోగంలో చేరి , డిగ్రీ కళాశాల అధ్యాపకులు గా పదోన్నతి పొంది 33 సంవత్సరాల పాటు సత్తుపల్లి, ఖమ్మం, వర్ధన్నపేట, మహబూబాబాద్ , హుజురాబాద్, హనుమకొండ పట్టణాల్లో విధులు నిర్వర్తించారు.
2009 ఆగష్టు 31 న ఉద్యోగ విరమణ పొందారు. హన్మకొండలో 1996లో ప్రారంభింప బడిన “సహృదయ” సాహిత్య సాంస్కృతిక సంస్థకు వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షునిగా గత ఇరవై నాలుగేళ్ళు సేవలందించి ప్రస్తుతం ఆ సంస్థ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పండితులను ఆహ్వానించి “మహాభారత దర్శనం“ పేరిట పద్ధెనిమిది పర్వాల పై పద్ధెనిమిది మంది పండితులతో ప్రసంగాలు ,“భాగవత సుధా స్రవంతి “ పేరిట ద్వాదశ స్కంధాలపై పన్నెండు మంది పండితులతో ప్రసంగాలు,“ రామ కథా పరిమళం“ పేరిట కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ విరచిత రామాయణ కల్పవృక్షంపై పది రోజుల పాటు ప్రసంగాలు, ”ఉపనిషచ్చంద్రిక “ పేరిట దశోపనిషత్తులపై పదిమంది పండితులతో పదిరోజుల ప్రసంగాలు”గీతామృతం” పేర భగవద్గీత లోని పద్ధెనిమిది అధ్యాయాలపై పద్ధెనిమిది మంది విద్వాంసులతో ప్రసంగాలు, “వేద సూక్త కౌముది “ పేరుతో పది రోజులపాటు వేద సూక్తాల పై ప్రముఖులతో ధార్మిక ప్రసంగాలు,”రామాయణం – మానవ ధర్మము“అనే అంశం పై బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు తో ప్రవచనాలు సహృదయ పక్షాన ఏర్పాటుచేసి విజయవంతంగా నిర్వహించారు.
సహృదయ పక్దాన వందల సంఖ్యలో గ్రంథావిష్కరణ సభలు, సాహిత్య సమావేశాలు ,కవిసమ్మేళనాలు, చర్చా గోష్ఠులు నిర్వహించడమే గాక వ్యక్తిగతంగా జాతీయ స్థాయిలో జరిగిన అనేక కళాశాలల సదస్సులలో వివిధ అంశాలపై పత్ర సమర్పణలు చేశారు. వీటిలో కొడాలి సుబ్బారావు – హంపీ క్షేత్రము, కళా పూర్ణోదయము – ఆధునిక రచనా దృక్పథము, తిలక్ రచనలు, పద్యాన్ని ప్రజాపక్షం చేసిన దాశరథి , ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి కావ్యాలు, గోపీనాథ రామాయణం, కాళోజీ ఆత్మకథ,”కాళోజీ’’జీవన గీత’, తెలంగాణ కథ- స్థానికత, వేయిపడగలు – ప్రకృతి, మానవుడు, నవీన్ నవలలు – చారిత్రక దృక్కోణము, కుబ్జా విలాసము, పండరినాథ రామాయణం – వర్ణనలు, అలంకారములు , శ్రీశ్రీ అనంతం- ఒక దృష్టి …. మొదలైన సుమారు 50 అంశాలకు పైగా ఆధునిక ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన వివిధ విషయాలపై సమర్పించిన పత్రాలు ఉన్నాయి.తెలుగు రాష్ట్రాల లోని అనేక పట్టణాలలో ప్రదర్శించిన ”శతక కవుల గోష్ఠి, ప్రతాప రుద్ర సభ, రామసభ, పోతనవిజయం, కృష్ణా పత్రిక దర్బారు, వందే మాతరం, భువన విజయం, ఇంద్ర సభ, పుష్కర సభ, బ్రహ్మసభ, గణపతి విజయం, గోలకొండ విజయం “ వంటి పలు సాహిత్య రూపకాల్లో చారిత్రక కవుల పాత్రధారణ చేశారు.
ఆకాశవాణి, దూరదర్శన్ లోనే కాకుండా ఇతర చానళ్ళలో కూడా వివిధ ధార్మిక అంశాలతో పాటుగా, సాహిత్యోపన్యాసాలు కూడా చేస్తున్నారు. తిరుమల బ్రహ్మొత్సవాలలో, పుష్కరాల సందర్భాలలో శ్రీరామనవమి మొదలైన పలు ఇతర ప్రత్యేక సందర్భలలో జరిగిన ఎన్నో కార్యక్రమాలలో అనేక పర్యాయాలు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆయన పొందిన సత్కారాల్లో సాహితీ విరించి బిరుదు, తో బాటు తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం , దేవరకొండ బాలగంగాధర తిలక్ పురస్కారం, (తణుకు) సంకీర్తన వారి జీవన సాఫల్య పురస్కారం (హైదరాబాదు), తెలుగు భాషా దినోత్సవ పురస్కారం, జాతీయ సాహిత్య పరిషత్ పురస్కారం, స్వరసుధ వారి సత్కారం, కళా వాహిని సత్కారం, స్వర రవళి వారి సత్కారం, శాంతిదూత పురస్కారం, శాతవాహన విశ్వ విద్యాలయం పురస్కారం ప్రధానమైనవి.
ఆయన సంపాదకత్వంలో రసహృదయ , కథకు శతమానం , శతక సాహిత్యం – సామాజిక నైతిక విలువలు , యువజన విజ్ఞానము (రెండవ ముద్రణ సురవరం ప్రతాపరెడ్డి ) , శతపత్రము (రెండో ముద్రణ – గడియారం రామకృష్ణ శర్మ ఆత్మకథ – కేంద్ర సాహిత్య అకాడెమీ వారి పురస్కారం పొందిన రచన; తెలుగు కథ వెలుగులు , ఓరుగల్లు కళా వైభవము తదితరాలను వెలువరించారు. స్వీయ రచనలు :: సాహిత్య సుధ , చయనిక , శతక సమీరం , తెలుగు శతకాలు ( లఘు గ్రంథం ~ నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వెలువరించిన లఘురచన ) , వెలుగుదారి , గన్నమరాజు పీఠికలు తదితర రచనలు చేశారు.
హైదరాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, మహబూబు నగర్ , తిరుపతి, కర్నూలు, వరంగల్, కరీంనగర్, రాజమండ్రి, విశాఖ పట్టణం, బాపట్ల, తాండూరు, వికారాబాద్, సూర్యాపేట, ఎమ్మిగనూరు, ఆదోని, షాద్ నగర్ మొదలైన పలు చోట్లవివిధ సాహిత్య , సాంస్కృతిక , సామాజిక అంశాలను గురించి వందలాది ప్రసంగాలు చేశారు. అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ లోని 23 జిల్లాలలోని పలు ప్రాంతాలలో సాహిత్య, సాంస్కృతిక, సామాజిక అంశాల పై వందలాది ప్రసంగాలు చేస్తూనే ఉన్నారు.