– రోజూ లక్షకు పైగా కుట్టి పాఠశాలలకు సరఫరా
– రేపు పంపిణీ కానున్న స్టూడెంట్ కిట్లను సిద్ధం చేసిన మహిళలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు కొత్త విద్యా సంవత్సరంలో యూనిఫాంలు సకాలంలో అందేలా సెర్ప్ ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులు అహర్నిశలు కృషి చేస్తున్నారు. మహిళల నైపుణ్యాలను ఉపాధిగా మార్చి, వారి కుటుంబాలకు ఆదాయ వనరులు కల్పించడంతోపాటు విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాంలను అందించే ఉమ్మడి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా 20 వేల మందికిపైగా మహిళా సంఘాల టైలర్లు యూనిఫాంల కుట్టు పనుల్లో పాల్గొంటున్నారు. వీరిలో దాదాపు 15 వేల మందికి ప్రత్యేక శిక్షణ అందించి, ఆధునిక ప్రమాణాలతో యూనిఫాంల తయారీ చేపట్టారు. విద్యార్థుల కొలతలను సేకరించి వాటి ఆధారంగా యూనిఫాంలను కుట్టడం ద్వారా ప్రతి విద్యార్థికి సరైన కొలతల్లో దుస్తులు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా ‘మేకర్ అండ్ చెకర’ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రతీ కేంద్రంలో ప్రత్యేకంగా మహిళా సభ్యులను నాణ్యత పరిశీలకులుగా నియమించి కుట్టిన ప్రతి యూనిఫాంను తనిఖీ చేస్తున్నారు. అలాగే అవసరమైన మార్పులు, చేర్పులు వెంటనే చేయడానికి గ్రామస్థాయిలోనే టైలర్లను అందుబాటులో ఉంచుతున్నారు. మహిళా సంఘాల సభ్యులు రోజూ లక్షకు పైగా యూనిఫాంను కుట్టి సంబంధిత పాఠశాలలు, గురుకులాలకు సరఫరా చేస్తున్నారు. విద్యార్థులందరికీ యూనిఫాంలు అందేలా వేగంగా పనులు కొనసాగిస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభం కానున్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమం కోసం 8, 9, 10వ తరగతి విద్యార్థులకు అందించే ఐదు వేల స్టూడెంట్ కిట్లను కూడా సెర్ప్ మహిళలు విజయవంతంగా సిద్ధం చేశారు. ఈ కిట్లలో భాగంగా యూనిఫాంల తయారీ, ప్యాకింగ్, పంపిణీ ఏర్పాట్లను సమర్థవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక బృందాలు కేవలం పొదుపు, రుణాలకే పరిమితం కాకుండా రాష్ట్ర అభివృద్ధిలో కీలక భాగస్వాములుగా ఎదుగుతున్నాయి.. విద్యార్థుల భవిష్యత్తు కోసం వారు చూపుతున్న అంకితభావం అభినందనీయం.. సెర్ప్ మహిళలకు శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారి ఆర్థిక స్వావలంబనకు బాటలు వేస్తోంది.. ఒకవైపు మహిళలకు ఆదాయం, మరోవైపు విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాంలు అందేలా చేస్తున్న ఈ కార్యక్రమం ఆదర్శప్రాయమైనది అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థులకు అవసరమైన యూనిఫాంల తయారీలో భాగస్వాములైన ప్రతి మహిళా సంఘ సభ్యురాలికి ఆమె ప్రత్యేక అభినందనలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





