బాల్యం భద్రమేనా?!….

“ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా ఒక్కసారి మనం మన పిల్లల ప్రపంచం లోకి వెళ్దాం… వాళ్లతో పాటు కింద కూర్చుందాం….వాళ్ళ కళ్ళతో ఈ లోకాన్ని చూద్దాం…. అప్పుడు తెలుస్తుంది, మనం వాళ్లకు ఏం పోగొట్టామో… పిల్లల ప్రపంచం ఇంకా సజీవంగా ఉంది , అది మన కోసం ఎదురుచూస్తున్నది , రండి… ఆ ప్రపంచంలోకి వెళ్దాం ….పిల్లలకు తోడు పెద్దలు కలిస్తే అక్కడ మళ్ళీ నవ్వులు పూస్తాయి …మళ్ళీ కలలు మొలుస్తాయి… మళ్ళీ పిల్లలు బతుకుతారు..”

(నవంబర్ 20 న ప్రపంచ బాలల దినోత్సవాన్ని  పురస్కరించుకొని)
డాక్టర్ అశోక్ పరికిపండ్ల,
 బాల్వికాస్ అభియాన్ కన్వీనర్

బాలల హక్కులు, సంక్షేమం, విద్య, ఆరోగ్యం , రక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 20న బాలల దినోత్సవాన్ని జరుపుతారు. కాని

విద్యాలయాలు ఒత్తిడిని వడ్డించే కేంద్రాలుగా మారుతున్న ప్రస్తుత తరుణంలో చందమామ, పేదరాశి పెద్దమ్మ, కాశీ మజిలీ కథలు, అక్బర్ బీర్బల్, అరేబియన్ నైట్స్ ఇలా ఏ పుస్తకం గురించి అడిగినా నేటితరం బాలలు తెల్ల మొఖం వేస్తారు. ఆటలు ఆడితే సమయం వృధా అవుతుందని తల్లిదండ్రులు భావిస్తున్న ప్రస్తుత తరుణంలో పిల్లలకు శారీరిక వ్యాయామం లేకుండా పోతుంది. సెలవు రోజుల్లో కూడా పాఠ్యపుస్తకాలతో కుస్తీపట్టే పరిస్థితి నెలకొంది.
దీంతో బాలలు ఒత్తిడికి గురవుతూ బాల్యంలోని మాధుర్యాన్ని కోల్పోతున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లలు ఆటపాటలకు దూరం అవుతూ, కార్పొరేట్ విద్యాసంస్థల మధ్య పోటీ కారణంగా బాలలు ఒత్తిడికి గురవుతున్నారు. తల్లితండ్రులు కూడా ర్యాంకులు మార్కులకే ప్రాధాన్యం ఇవ్వడంతో ఆటలకు సమయమే ఉండటం లేదు. బాలల వికాసానికి దోహదపడే బాలల సాహిత్యం మాటే వినిపించడం లేదు. నీతి కథలు, బాల సాహిత్య పుస్తకాలు జోలికి వెళ్లే తీరిక లేకుండా యాంత్రిక జీవనంలో జీవనం కొనసాగిస్తున్న బాల్యం, పిల్లలు పూల తోటలోని మొగ్గలాంటివారు, వాళ్లను ప్రేమగా సాకాలి. నేటి బాలలే రేపటి పౌరులు భావిభారత భాగ్యవిధాతలు.
బాలల హక్కులు
జాతీయస్థాయిలో మానవ హక్కులకు ఉన్న ప్రాచుర్యం పిల్లల హక్కుల విషయంలో కనిపించడం లేదు. వారి గురించి చైతన్య పరిచే విషయంలో ప్రయత్నాలు అంతంత మాత్రమే ఉన్నాయి. తల్లిదండ్రులకు పిల్లలపై సర్వహక్కులు ఉన్నాయని భావన నేటికీ కొనసాగుతూ ఉండటమే అందుకు తార్కాణం. అందుకే బాలల హక్కులు పిల్లల సంరక్షణ కోసం ఉద్యమాలు అవసరమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐక్యరాజ్యసమితి 1989లో బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడికను రూపొందించింది.  దీనికి ముందు కూడా పిల్లల హక్కులకు సంబంధించి అంతర్జాతీయ సదస్సులు కార్యక్రమాలు జరిగినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కలేదని చెప్పాలి. 1992లో భారత ప్రభుత్వం బాలల హక్కులకు సంబంధించిన బిల్లుపై సంతకం చేసింది. ప్రతి భారతీయుడికి విద్య ఒక ప్రాథమిక హక్కు, రాజ్యాంగం ప్రకారం మౌలిక స్థాయిలో ఉచిత విద్యను అందించాలి. ప్రాథమిక విద్య అందరికీ నిర్బంధ విద్య, ఉన్నత విద్య అన్నది ప్రతిభ పై ఆధారపడి ఉంటుంది అందుకే పిల్లలందరికీ విద్య తప్పనిసరి.
మౌలిక వసతులు
ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం, నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉంది. మరమ్మతులు చేపట్టాల్సిన శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలు, హాస్టల్లో నాణ్యమైన పౌష్టికాహార లేమి, ఖాలీ గా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, సింగిల్ టీచర్ పాఠశాలల సమస్యల పై పాలకవర్గాలు దృష్టి సారించాలి.
మత్తు పదార్థాలు
పాఠశాల విద్యార్థులపై ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో 15% మంది జీవితంలో ఏదో ఒక సమయంలో మత్తు పదార్థాలు వినియోగించినట్లు ,10 శాతం మంది గత ఏడాది, ఏడు శాతం మంది నెల రోజుల క్రితం తీసుకున్నట్లు నివేదిక వెల్లడించింది. అంతేకాక దేశంలోని ఆరు జిల్లాల్లో 108 పాఠశాలల్లోని విద్యార్థులపై సర్వే చేయగా 21 శాతం మంది మధ్య స్థాయి నుంచి తీవ్ర మత్తు పదార్థాల వినియోగం ముప్పు పరిధిలో ఉన్నట్లు గుర్తించింది. సులభంగా మత్తు పదార్థాలు లభించడం, డిజిటల్ కాంటెంట్ ప్రమాదాన్ని మరింత పెంచుతున్నట్లు పేర్కొంది.డబ్బు సంపాదన పరమావధిగా పెట్టుకున్న పలువురు అక్రమార్కులు వేలాదిమంది విద్యార్థులను పావులుగా ఉపయోగించి గంజాయి విక్రయాల సరఫరాకు అభం శుభం తెలియని విద్యార్థులను ఉపయోగిస్తూ వారి జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నారు.
పాఠశాలలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలు నిషేధించాలని, ప్రత్యేక ఆవరణగా పేర్కొంటూ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ముసాయిదా నివేదికలో స్పష్టం చేసింది. అన్ని స్కూళ్లలో ప్రహరీ క్లబ్లు ఏర్పాటు చేయాలని సూచించింది, మత్తుపదార్థాల బారిన పడినట్లు గుర్తించిన పిల్లలను నిర్బంధించడం, అవమానించడం, భయపెట్టడం లాంటి చర్యలు చేయకూడదని, అక్రమ సరఫరాకు కారణమైన వారిపై వెంటనే కేసులు పెట్టాలని వెల్లడించింది. ఈ కేసుల్లో పిల్లల వ్యక్తిగత గోప్యతకు ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలిగించకూడదని, వైద్య నిపుణుల సలహా మేరకు స్నేహపూర్వక డి అడిక్షన్ కేంద్రాలకు పంపించాలని, మత్తు పదార్థాలతో ప్రభావితమైన పిల్లలను ముందస్తుగా గుర్తించడంతోపాటు చికిత్స, పునరావాసం కోసం ప్రత్యేక కార్యాచరణ ముసాయిదాను ప్రకటించింది.
ఆత్మ లేని హత్యలు
పిల్లలతో కలిసి తల్లిదండ్రుల ఆత్మహత్య అనే విషాద వార్తలు ఈ మధ్య తరచుగా వస్తున్నాయి కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు లేదా తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణమేదైన తల్లిదండ్రులు తీసుకునే తొందరపాటు నిర్ణయాలకు అమాయక బాలలు బలి కాకూడదు. మేము లేకపోతే మా పిల్లల పరిస్థితి ఏమిటి అనే భయంతోనే పిల్లల ప్రాణాలు కూడా తీస్తున్నారు. ఇలాంటి కష్టకాలంలో బాలల ను ప్రభుత్వానికి అప్పగించి వారి ప్రాణాలు నిలబెట్టే చట్టం బాలల న్యాయ సంరక్షణ చట్టం 2015 లోని సెక్షన్ 35 ఆపదలో ఉన్న పిల్లలకు, నిస్సహాయ స్థితిలో ఉన్న తల్లిదండ్రులకు ఒక రక్షణ కవచం. శారీరిక భావోద్వేగ,సామాజిక కారణాలవల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచలేని స్థితిలో ఉంటే సెక్షన్ 35 (1) ప్రకారం ఆ పిల్లలను నేరుగా జిల్లా సంక్షేమ కమిటీ కి అప్పగించవచ్చు. వారి పరిస్థితులను విచారించి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత తల్లిదండ్రులు సమక్షంలో ఒక సరెండర్ డీడ్ రాసుకొని వారినీ చిల్డ్రన్ హోమ్ లో సురక్షితంగా ఉంచి సంరక్షణ కల్పిస్తారు.
ఏం చేద్దాం…
నేటి యాంత్రిక జీవనంలో పద్మ వ్యూహంలో బ్రతుకుతున్న బాల్యానికి, మనపిల్లలకు ఒక ప్రపంచం ఉంటుంది, పిల్లలకంటూ ఒక లోకం ఉంటుంది. ఆ లోకంలో పరీక్షలు ఉండవు, ర్యాంకులు ఉండవు, అక్కడ చిన్న రాయే గుడి, కాగితపడవే ఓడ, గోలీలే బంగారం, స్నేహితుడి భుజమే పెద్ద ఆస్తి కలలు చాలా పెద్దగా ఉంటాయి ఏడ్చిన ఐదు నిమిషాలకే మళ్లీ నవ్వే మాయ ఆ లోకంలోనే ఉంటుంది.
గతంలో ఆ లోకం ఎంత బాగుండేది! వీధి మొత్తం ఆటస్థలం, సాయంత్రం అయితే ఇంటి ముందు కేరింతలు, అమ్మమ్మ ఒడిలో వినే కథలు, వర్షం వస్తే నింగికి వెక్కిరింతలు, ఎండాకాలం వస్తే మామిడి కాయలు వేసవి సెలవులు, పిల్లలు పిల్లల బతికేవారు, పసితనపు దుప్పటిలో వెచ్చగా ఉండేవారు. పెద్దలు పిల్లల పక్షం వహించేవారు, పిల్లలు తప్పు చేస్తే తిట్టేవారు… కానీ భయపెట్టేవారు కాదు. ఓడిపోతే ఓదార్చేవారు, అవమానించేవారు కాదు. వారి కింద పడితే లేపి వీపు తట్టడానికి ఇరుగుంటి పొరుగింటి బాబాయి, పిన్ని ఉండేవారు. మరి ఇప్పుడు పిల్లల్లోకం ఎలా ఉంది ?..చిన్న ప్లాట్ లోకి,…చిన్న స్క్రీన్ లోకి కుంచించుకు పోయింది. ఉదయం ఏడు గంటలకే వీపున పడే బ్యాగు రాత్రి 10 గంటల వరకు వదలదు. ఆటలేదు, నిద్ర లేదు, స్నేహితులు లేరు ఉన్నదల్లా మొబైల్…. ట్యూషన్…. మార్కుల భయం… పిల్లలు నవ్వడం మర్చిపోయారు.
ప్రశ్నలు అడగడం మర్చిపోయారు, ఏడుపును కూడా దాచుకోవడం నేర్చుకున్నారు, పిల్లాడు ఇప్పుడు పిల్లాడు కాదు –చిన్న పెద్దమనిషి, ఈ పిల్లల ప్రపంచాన్ని పాడు చేసింది ఎవరు?.. మనమే, మార్కులు రాకపోతే పిల్లాడు పనికిరాడు అని నమ్మిన తల్లిదండ్రులు ఎవరు?.. మనమే, ఆట స్థలాల అమ్మేసి అపార్ట్మెంట్లు కట్టిన సమాజం మనదే, బడిని జైలులా, పరీక్షను యుద్ధంలా మార్చిన వ్యవస్థ మనదే….పిల్లలు చేతికి ఆట వస్తువు బదులు ఫోన్ ఇచ్చిన వాళ్ళం మనమే… మరి దీనిని బాగు చేయాల్సింది ఎవరు?!..మనమే….. చాలా పెద్ద పనులు అక్కర్లేదు… పిల్లాడు ఆడాలంటే ఆడనివ్వండి, ప్రశ్న అడిగితే విసుక్కోకుండా జవాబు చెప్పండి, మార్కులు తక్కువ వస్తే తిట్టకుండా దగ్గరికి తీసుకోండి, రోజుకు ఒక్క గంట అయినా ఫోన్ లేకుండా వాడితో కలిసి కూర్చోండి, బడిలో ఆటకు ఒక పీరియడ్ ఇవ్వండి, వాడి తప్పును క్షమించి వాడి కలను నమ్మండి. ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా ఒక్కసారి మనం మన పిల్లల ప్రపంచం లోకి వెళ్దాం… వాళ్లతో పాటు కింద కూర్చుందాం….వాళ్ళ కళ్ళతో ఈ లోకాన్ని చూద్దాం…. అప్పుడు తెలుస్తుంది, మనం వాళ్లకు ఏం పోగొట్టామో… పిల్లల ప్రపంచం ఇంకా సజీవంగా ఉంది , అది మన కోసం ఎదురుచూస్తున్నది , రండి… ఆ ప్రపంచంలోకి వెళ్దాం ….పిల్లలకు తోడు పెద్దలు కలిస్తే అక్కడ మళ్ళీ నవ్వులు పూస్తాయి …మళ్ళీ కలలు మొలుస్తాయి… మళ్ళీ పిల్లలు బతుకుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *