పూర్తిస్థాయి సేవలందించేలా తీర్చిదిద్దాలి

– సనత్‌నగర్ ‘టిమ్స్‌’లో ట్రయల్ రన్‌పై మంత్రి దామోదర్ సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలందించేలా సనత్‌నగర్ ‘టిమ్స్‌’ను తీర్చిదిద్దాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ఇందులో జరుగుతున్న వైద్య సేవల ట్రయల్ రన్‌పై మంత్రి సెక్రటేరియట్‌లో సోమవారం సోమవారం సమీక్షించారు. ట్రయల్ రన్‌లో భాగంగా అందిస్తున్న వైద్య సేవల వివరాలను, ఎదురవుతున్న ఇబ్బందులు, లోపాలను అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ఓపీ రిజిస్ట్రేషన్, కన్సల్టేషన్ రూమ్‌లు, వెయిటింగ్ ఏరియా, డయాగ్నస్టిక్స్, రేడియాలజీ డిపార్టుమెంట్, ఇన్‌పేషెంట్ డిపార్టుమెంట్లు, వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూల పనితీరుపై మంత్రి ఆరా తీశారు. ట్రయల్ రన్‌లో భాగంగా 22 డిపార్టుమెంట్లలో ఓపీ సేవలు అందిస్తున్నామని అధికారులు తెలిపారు. ఆపరేషన్ థియేటర్లు శస్త్రచికిత్సలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. రోగ నిర్ధారణ కోసం అత్యాధునిక సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, డిజిటల్ ఎక్స్-రే మిషన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. ట్రయల్ రన్‌లో భాగంగా టెస్టులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ టిమ్స్‌ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కార్డియాక్ కేర్, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌గా తీర్చిదిద్దాలని గతంలోనే అధికారులకు మంత్రి సూచించారు. ఇందుకు అనుగుణంగా అన్ని రకాల గుండె సంబంధిత ఆపరేషన్లు చేసేలా, అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించేలా క్యాథల్యాబ్స్, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ థియేటర్ల ఏర్పాటుపై మంత్రి ఆరా తీశారు. క్యాథల్యాబ్ ఏర్పాటు పనులు పూర్తయ్యాయని, ట్రయల్ రన్‌కు సిద్ధంగా ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. మెడికల్ సర్వీసెస్‌తోపాటు శానిటేషన్, సెక్యూరిటీ వంటి నాన్ మెడికల్ సర్వీసెస్ విభాగాలు కూడా పటిష్టంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. పేషెంట్లు, వారి అటెండెంట్లకు భోజన సదుపాయం కల్పించాలని, అటెండెంట్ల కోసం ధర్మశాలను సైతం సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. సమావేశంలో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, జాయింట్ సెక్రటరీ అయేషా, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, డాక్టర్ సంగీత సత్యనారాయణ, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్, డీఎంఈ నరేంద్ర కుమార్, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *