– నెహ్రూ భావజాల ప్రచారానికి ప్రభుత్వ మద్దతు
– మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టిన ఘనత నెహ్రూదే
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆశయాలు, దార్శనికత, శాస్త్రీయ దృక్పథం నవభారత నిర్మాణానికి బలమైన పునాదులని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. నెహ్రూ ప్రవచించిన ప్రజాస్వామ్య విలువలు, లౌకికవాదం, శాస్త్రీయ ఆలోచనా విధానం నేటి సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సౌత్ ఇండియా నెహ్రూ సెంటర్ ద్వారా నెహ్రూవియన్ భావజాలాన్ని తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. శనివారం రవీంద్రభారతిలో నిర్వహించిన సౌత్ ఇండియా నెహ్రూ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నెహ్రూ సెంటర్ ఏర్పాటుకు కృషి చేసిన మాజీ ఎంపీ, సెంటర్ ఇన్చార్జి సందీప్ దీక్షిత్‌ను ప్రత్యేకంగా అభినందించారు. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా నెహ్రూ చేసిన చారిత్రాత్మక ప్రసంగాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. భారతదేశానికి, దేశ ప్రజలకు, అంతకంటే విస్తృతమైన మానవాళి ఆశయాలకు సేవ చేయాలని ఆయన ఇచ్చిన పిలుపు నేటికీ ఎంతో ప్రాసంగికమని అన్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఐఐటీలు, ఐఐఎంలు వంటి ఉన్నత విద్యా సంస్థల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చారని గుర్తుచేశారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వంటి సంస్థల ద్వారా పరిశోధనలకు ప్రోత్సాహం కల్పించారని తెలిపారు.దేశ భవిష్యత్తులో శాస్త్ర సాంకేతిక రంగాల ప్రాధాన్యతను గుర్తించి పరిశోధనా సంస్థలు, అంతరిక్ష పరిశోధనలకు అవసరమైన వ్యవస్థలను అభివృద్ధి చేశారని అన్నారు. పారిశ్రామిక రంగం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా మిశ్రమ ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వ రంగ సంస్థల స్థాపనకు ప్రాధాన్యతనిచ్చారని వివరించారు. భిలాయ్, రూర్కెలా, దుర్గాపూర్ ఉక్కు కర్మాగారాలు, హెచ్ఎంటీ, బీహెచ్ఈఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ వంటి సంస్థలు దేశ పారిశ్రామికాభివృద్ధికి బలమైన పునాదులుగా నిలిచాయని చెప్పారు. ఆహార కొరత, కరువు సమస్యలను అధిగమించేందుకు నెహ్రూ బహుళార్థ సాధక ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్దపీట వేశారని తెలిపారు. నాగార్జునసాగర్, భాక్రా నంగల్, హీరాకుడ్ వంటి భారీ ప్రాజెక్టులు దేశ వ్యవసాయ రంగానికి కీలకంగా మారాయని పేర్కొన్నారు. నీటిపారుదల సౌకర్యాల విస్తరణ, విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయాభివృద్ధి ద్వారా దేశం ఆహార స్వావలంబన దిశగా ముందుకు సాగేందుకు ఈ ప్రాజెక్టులు దోహదపడ్డాయని చెప్పారు. నేటి భారతదేశం ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయడమే కాకు ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవడంలో నాటి దూరదృష్టితో కూడిన ప్రణాళికల పాత్ర ఎంతో ఉందన్నారు.
పిల్లల భవిష్యత్తే దేశ భవిష్యత్తు
పిల్లలపై ప్రత్యేక ప్రేమాభిమానాలు కలిగిన నెహ్రూ వారి విద్య, వికాసం, ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం ఆలోచించేవారని అన్నారు. అందుకే ఆయన జన్మదినమైన నవంబర్ 14ను బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణంతో పాటు, 65కు పైగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని, అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ విద్యాసంస్థల్లో డైట్ ఛార్జీలను 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలను 25 శాతం పెంచామని వివరించారు.సంక్షేమ శాఖల మంత్రులు, సంబంధిత అధికారులు విద్యాసంస్థల నిర్వహణ, విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. దేశ చరిత్రలో నెహ్రూ వంటి మహనీయుల పాత్రను విస్మరించడం, వారి సేవలను తక్కువ చేసి చూపించే ప్రయత్నాలు చేయడం దేశానికి నష్టం కలిగిస్తుందని అన్నారు.చరిత్రను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించకుండా వాస్తవాలను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.హైదరాబాద్‌లో ప్రారంభమైన సౌత్ ఇండియా నెహ్రూ సెంటర్ తెలంగాణకే పరిమితం కాకుండా కర్ణాటక, కేరళ, తమిళనాడు, గోవా, అండమాన్ తదితర ప్రాంతాలకు నెహ్రూవియన్ భావజాలాన్ని విస్తరించేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ లక్ష్య సాధనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సందీప్ దీక్షిత్‌కు హామీ ఇచ్చారు. నెహ్రూ ఆశయాలు, ప్రజాస్వామ్య విలువలు, శాస్త్రీయ దృక్పథాన్ని యువతలోకి తీసుకెళ్లేందుకు ఈ కేంద్రం కీలక వేదికగా నిలవాలని ఆకాంక్షించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





