– ‘ఔషధి ఎక్స్‌ప్రెస్’ ప్రారంభంపై మంత్రి కిషన్‌రెడ్డి హర్షం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : ప్రయాణికుల సేవలు, వస్తు రవాణాతోపాటు అత్యాధునిక సేవలు కల్పించడంలో నూతన సాంకేతికతలు, ఆవిష్కరణలతో దూసుకుపోతున్న భారతీయ రైల్వే ఇప్పుడు ఔషధాల రవాణాపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పీఎం గతిశక్తి కార్యక్రమానికి కొనసాగింపుగా ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియా అయిన హైదరాబాద్ నుంచి ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్(జేఎన్‌పీటీ)కు ఔషధాలను సరఫరా చేసేందుకు ఈనెల 2న ఔషధి ఎక్స్‌ప్రెస్ పేరుతో దేశంలోనే తొలి ప్రత్యేక ఫార్మసీ రైలును ప్రారంభించడం పట్ల కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ మొదటి రెగ్యులర్ ‘ఔషధి ఎక్స్‌ప్రెస’ను తెలంగాణకు కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లకు ధన్యవాదములు తెలియజేశారు. ఫార్మా కంపెనీలకు కేంద్రమైన హైదరాబాద్‌లో తయారయ్యే ఫార్మా ఉత్పత్తులను దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించడంతోపాటు అంతర్జాతీయంగా పంపిణీ చేసేందుకు ముంబై సమీపంలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్టు ట్రస్టుకు తరలించడం తప్పనిసరి. అందుకే హైదరాబాద్‌ను, జేఎన్‌పీను అనుసంధానిస్తూ ఈ ప్రత్యేక రీఫర్ రైలు (కోల్డ్ స్టోరేజ్ వసతి గల రైలు)ను ప్రారంభించడం హైదరాబాద్ ఫార్మా కంపెనీలకు ఎంతో మేలు కలగÁగనుంది. దీంతోపాటు దేశవ్యాప్తంగా, వివిధ దేశాలకు సరైన సమయంలో ఔషధాలను చేరవేసేందుకు వీలు కలుగుతుంది. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీ, జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా, పటాన్‌చెరులోని ఫార్మా జోన్, ముచ్చర్లలోని ఫ్యూచర్ సిటీ తదితర ప్రాంతాల్లో ఉత్పత్తయ్యే ఫార్మా ప్రొడక్ట్స్ సరఫరాకు ఈ రైలు చాలా కీలకం కానుంది. దేశవ్యాప్తంగా తక్కువ ఖర్చులో వస్తు రవాణా జరగడంతోపాటు సుస్థిరమైన, పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థను ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం రూ.100 లక్షల కోట్ల వ్యయంతో పీఎం గతిశక్తి కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రత్యేక ‘ఔషధి ఎక్స్‌ప్రెస’ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వరంగ సంస్థ అయిన కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (కాంకర్) ఆధ్వర్యంలో నడుస్తున్న సనత్‌నగర్‌లోని ఇన్ ల్యాండ్ కంటైనర్ డిపో (ఐసీడీ) నుండి ఈ ప్రత్యేక రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ‘ఔషధి ఎక్స్‌ప్రెస్’గా నామకరణం చేసిన ఈ రెఫ్రిజిరేటర్ రైలు ద్వారా లైఫ్ సేవింగ్ మందులతోపాటు అవసరమైన ఇతర సరకులను కూడా రవాణా చేయనున్నారు. హైదరాబాద్ నుంచి జేఎన్‌పీటీ వరకు ప్రయాణిస్తున్న సమయంలో కంటిన్యూయస్ రిఫ్రిజిరేషన్ ఉండేందుకు డీజిల్ పవర్ ప్యాక్‌లతో కూడిన అధునాతన రీఫర్ కంటైనర్లను వినియోగిస్తున్నారు. ఇది మన కోల్డ్-చైన్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడంతోపాటు ఫార్మాసూటికల్స్ సప్లయ్ చైన్ కెపాసిటీని పెంచేందుకు కీలకమైన ముందడుగు కానుంది. ప్రస్తుతానికి వారానికి ఒకసారి నడుస్తున్న ఈ ఎక్స్‌ప్రెస్‌ను డిమాండ్, వాణిజ్య వర్గాల అవసరాలకు అనుగుణంగా వారానికి రెండుసార్లు నడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వినియోగదారుల అవసరాలకు తగ్గట్లుగా ఇన్నొవేషన్ బేస్డ్ సొల్యూషన్స్ తీసుకురావడంలో మోదీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలకు ప్రోత్సాహాన్ని అందిస్తోందని మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో కూడా అనేక పరిశోధనలతోపాటు ప్రయాణికులకు అందించే సౌకర్యాల విషయంలోనూ మోదీ సర్కారు చిత్తశుద్ధితో కృషిచేస్తూనే ఉంటుందన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





