ప్ర‌జ‌లు క‌రువుతో అల్లాడుతుంటే స‌మ్మిట్‌లా?

 – దేశ వ్య‌తిరేక శ‌క్తుల‌తో అంట‌కాగ‌డ‌మే మీ ప‌నా?
– రేవంత్‌రెడ్డిపై ఎంపీ ఈట‌ల ధ్వ‌జం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 14 : ప్రజలు, రైతులు కరువు కోరల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతుంటే ఆదుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ‘భారత్ సమ్మిట్’ పేరిట దేశ వ్యతిరేక శక్తులను, ప్రజాస్వామ్యం లేని రాచరిక దేశాల ప్రతినిధులను హైదరాబాద్ కు పిలుచుకొచ్చార‌ని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అల్లర్లు సృష్టించి, ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలదోసి అస్థిరపరిచే కుట్రలు చేసే మనుషులు రాహుల్ గాంధీకి దోస్తులై సమ్మిట్‌లో పాల్గొన్నారని మండిపడ్డారు. బ్రిటిష‌ర్లతో పారాడి సాధించుకున్న భారత ప్రజాస్వామ్యాన్ని రాహుల్ విదేశీయుల ఎదుట‌ అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తూ, ప్రతిపక్ష నేత హోదాలో ఉండి సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్, పార్లమెంటరీ వ్యవస్థలతో పాటు, సియాచిన్ మంచు కొండల్లో మైనస్ డిగ్రీల చలిలో దేశాన్ని కాపాడే సైనికులను కూడా కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. నాడు ప్రధాని పి.వి.నరసింహారావు స్వయంగా అటల్ బిహారీ వాజ్‌పేయిని ఐక్యరాజ్యసమితికి పంపితే భారత ఆత్మగౌరవాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టారని గుర్తు చేశారు. నేడు ప్రధాని మోదీ అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాలకు ఎంపీల కమిటీలను పంపి దేశ ప్రతిష్ఠను పెంచుతుంటే రాహుల్ గాంధీ విదేశాల్లో దేశ పరువు తీస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ఒక్క ఐదేళ్లు కూడా నీతివంతమైన పాలన అందించలేదని ఈటల విమర్శించారు. నెహ్రూ కాలం నాటి ఆర్మీ జీపుల కొనుగోలు అక్రమాల నుంచి రాజీవ్ గాంధీ హయాంలో బోఫోర్స్ కుంభకోణం, మన్మోహన్ సింగ్ పాలనలో 2జీ స్కామ్, కోల్ స్కామ్ వరకు కుంభకోణాలేనని, సొంత కేబినెట్ మంత్రులనే జైళ్లకు పంపిన చరిత్ర కాంగ్రెస్‌దని ఎద్దేవా చేశారు. అంతేకాక నాటి కాంగ్రెస్ ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల వల్ల పాకిస్తాన్ ఉగ్రవాదులు దేశంలో రక్తపాతం సృష్టించారని గుర్తుచేశారు. 2014లో మోదీ ప్రధాని అయ్యాక ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశారని, 12-13 ఏళ్ల పాలనలో ఒక్క స్కామ్ కూడా లేదని, ప్రపంచంలో 14వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను 4వ స్థానానికి చేర్చారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఆర్టికల్ 356 ప్రయోగించి రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర కాంగ్రెస్‌దని గుర్తుచేశారు. మోదీ హయాంలో ఒక్కసారి కూడా ఆర్టికల్ 356 ప్రయోగించలేదన్నారు.

క‌మీష‌న్లు లేనిదే ఏ ప‌నీ జ‌ర‌గ‌డంలేదు

రాష్ట్రంలో30 శాతం కమీషన్ లేనిదే ఏ పనీ జరగడం లేదని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, చిన్న బిల్లులకు 10-15 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారని ఈటల ఆరోపించారు. వరంగల్ రైతు, కామారెడ్డి బీసీ, చేవెళ్ల ఎస్సీ-ఎస్టీ, యువ, మహిళా డిక్లరేషన్లను తుంగలో తొక్కారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో 10 శాతం భూములు వేలం వేసి 90 శాతం భూములపై ఇల్లీగల్ దందా చేస్తూ వేల కోట్ల డబ్బు సంచులను రాహుల్ గాంధీకి మోసుకెళ్తున్నారని, అందుకే ఫీజు రీయింబర్స్‌మెంట్, రుణ మాఫీ, రైతుబంధు, రైతు బీమా, కనీసం 9 గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. జర్మనీ నియంత హిట్లర్ నుంచి ‘హైడ్రా’ పేరు తీసుకున్న రేవంత్ రెడ్డి, నాగార్జున కన్వెన్షన్ కూల్చివేత తర్వాత హైరైజ్ బిల్డింగ్‌లకు అనుమతులిచ్చి బిల్డర్లతో కుమ్మక్కైన లెక్కలు బయటపెడతామన్నారు. రేవంత్ రెడ్డి అరాచకాలతో కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మరో 20 ఏళ్లపాటు మొలకెత్తకుండా సమాధి చేస్తున్నారని ఈటల అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *