– సెర్ప్, పీవీఎన్‌ఆర్‌టీయూ మధ్య ఎంవోయూ
– ఆదాయ వనరులు పెంచడమే లక్ష్యం : మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారత, పశుసంవర్ధక ఆధారిత జీవనోపాధుల విస్తరణకు మరో కీలక అడుగు పడింది. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్), పి.వి.నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (పీవీఎన్‌ఆర్‌టీవీయూ) అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. బి.ఆర్.కె.ఆర్ భవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఈ ఒప్పందంపై రెండు సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. గ్రామీణ స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలకు పాల ఉత్పత్తి, గొర్రెలు, మేకల పెంపకం, బ్యాక్‌యార్డ్ పౌల్ట్రీ వంటి రంగాల్లో సాంకేతిక మార్గదర్శకత్వం, శిక్షణ అందించడం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం.ఈ సందర్భంగా సెర్ప్ సీఈవో దివ్వ దేవరాజన్ మాట్లాడుతూ గ్రామీణ పేద కుటుంబాలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. నైపుణ్య ఆధారిత ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడం ద్వారా మహిళల ఆర్థిక స్థితిని బలోపేతం చేయనున్నట్లు చెప్పారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు వెటర్నరీ యూనివర్సిటీతో ఒప్పందాలు చేసుకున్నట్లు పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాలు, గ్రామ సంఘాలు, సమాఖ్యలను మరింత బలోపేతం చేసి గ్రామీణ మహిళల్లో స్వావలంబన, సామూహిక భాగస్వామ్యాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేద కుటుంబాలకు బ్యాంకు లింకేజీలు, రివాల్వింగ్ ఫండ్లు, సబ్సిడీల ద్వారా ఆర్థిక సౌకర్యాలు అందించనున్నట్లు వెల్లడించారు. కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (సీఐఎఫ్), రుణాల ద్వారా పొట్టేళ్ల యూనిట్లు, గొర్రె, మేక పిల్లల నర్సరీలు, బ్యాక్‌యార్డ్ పౌల్ట్రీ మదర్ యూనిట్లు, పక్షుల యూనిట్ల ఏర్పాటు వంటి కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. అవగాహన ఒప్పందం ప్రకారం పీవీఎన్‌ఆర్‌టీయూ, సెర్ప్ లబ్ధిదారులకు సాంకేతిక నైపుణ్యాలు, సామర్థ్యాభివృద్ధి శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం అందించనుంది. పశు పోషణ, ఆరోగ్య సంరక్షణ అంశాల్లో శాస్త్రీయ మార్గదర్శకత్వం అందించనుంది. పీవీఎనఆర్‌టీయూ రిజిస్ట్రార్ డాక్టర్ ఎ.శరత్‌చంద్ర మాట్లాడుతూ పాల ఉత్పత్తి, గొర్రెలు, మేకల పెంపకం, బ్యాక్‌యార్డ్ పౌల్ట్రీ రంగాల్లో సెర్ప్ మహిళలకు విశ్వవిద్యాలయం పూర్తిస్థాయి సాంకేతిక సహకారం అందిస్తుందని తెలిపారు. పాల ఉత్పత్తి, పశువుల ఉత్పాదకతను ప్రభావితం చేస్తున్న ప్రధాన సమస్యల్లో పోషకాహార లోపం, ఖనిజాల కొరత ఒకటని పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి పశువుల ఉత్పాదకత, పునరుత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరిచే ప్రత్యేక మినరల్ మిశ్రమాన్ని విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిందని, దాన్ని సెర్ప్‌కు అనుబంధంగా ఉన్న రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. మాంసం, గుడ్ల ఉత్పత్తికి అనుకూలంగా బ్యాక్‌యార్డ్ పౌల్ట్రీ జాతిని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఈ జాతికి చెందిన పిల్లలను సెర్ప్ ద్వారా గ్రామీణ కుటుంబాలకు పంపిణీ చేసి జీవనోపాధి, పోషక భద్రతను మెరుగుపరచనున్నట్లు తెలిపారు.
సాంప్రదాయేతర రంగాల్లో ఆదాయ వనరులు పెంచడమే లక్ష్యం : మంత్రి సీతక్క
‘గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు పశుసంవర్ధక రంగం బలమైన ఆధారం.. స్వయం సహాయక సంఘాల మహిళలు సంప్రదాయ ఉపాధికి పరిమితం కాకుండా శాస్త్రీయ పద్ధతుల్లో ఆదాయ వనరులు పెంచుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.. సెర్ప్, పీవీఎన్‌ఆర్‌టీయూ భాగస్వామ్యం ద్వారా గ్రామీణ మహిళలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్య శిక్షణ, మార్కెట్ అవగాహన అందుతుంది.. ఇది మహిళల ఆదాయాన్ని పెంచడంతోపాటు గ్రామీణ కుటుంబాల పోషక భద్రతను కూడా బలోపేతం చేస్తుంది’.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




