– హామీలు, డిక్లరేషన్ల అమలు పై రాహుల్ సమాధానం చెప్పాలి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆడుతున్న రాజకీయ నాటకాలను, గిగ్ వర్కర్లపై ఆయన ఒలకబోస్తున్న దొంగ ప్రేమను బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభు్యడు డాక్టర్ కె.లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ‘గిగ్ ప్లాట్‌ఫారమ్ వర్కర్లు’ అనే పదాన్ని చట్టబద్ధంగా నిర్వచించి వారికి సామాజిక భద్రత కల్పించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వమేనని తెలిపారు. 2020లో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ’ ద్వారానే గిగ్ వర్కర్లకు జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య, ప్రసూతి ప్రయోజనాలు, భవిష్య నిధి వంటి హక్కులు దక్కాయన్నారు. అంతేకాక ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాదిమంది అసంఘటిత, గిగ్ కార్మికులను నమోదు చేసి ప్రతి ఒక్కరికీ రూ.2 లక్షల ప్రమాద బీమా కల్పించడంతోపాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా వారి ఇంటికి చేరుస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానిదేనన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో చట్టం చేసి అమలు చేస్తున్న అంశాలను నేడు తెలంగాణలో తామేదో కొత్తగా కనిపెట్టినట్లు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలు ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గిగ్ వర్కర్లకు రూ. 5 లక్షల ప్రమాద బీమా హామీ ఇచ్చి ప్రమాదాల్లో చనిపోయిన డెలివరీ బాయ్స్ కుటుంబాలకు కనీసం పరిహారం కూడా ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ కొత్త హామీలతో మభ్యపెట్టాలని చూస్తోందని విమర్శించారు. గిగ్ వర్కర్ల సభలో రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై చేసిన నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఒకవైపు వేదికపై అంబానీ, అదానీల పేర్లు ఎత్తుతూ విమర్శలు చేసే రాహుల్ గాంధీ.. మరోవైపు ఇదే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దావోస్ వేదికగా అదానీ గ్రూప్‌తో రూ.12,400 కోట్లకు ఒప్పందాలు కుదుర్చుకోవడంపై ఎందుకు నోరు మెదపడం లేదో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఇక హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ‘భారత్ సమ్మిట్’ అసలు భారత్ సమ్మిట్టే కాదు.. అది ముమ్మాటికీ దేశ వ్యతిరేక శక్తులను ఏకం చేసి నడుపుతున్న ‘యాంటీ-భారత్ సమ్మిట్’ అని వ్యాఖ్యానించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





