ఎల్బీనగరలో సెల్లార్ తవ్వుతుండగా ఘటన
మృతులంతా బిహార్ వాసులుగా గుర్తింపు
నగరంలోని ఎల్బీనగర్‌లో సెల్లార్ తవ్వకాల్లో ప్రమాదం చోటుచేసుకుంది. సెల్లార్ లోపల పనిచేస్తుండగా పైనుంచి మట్టిదిబ్బలు కుప్పకూలాయి. ఈ క్రమంలో మట్టిదిబ్బల కింద కూరుకుపోయి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మట్టిదిబ్బల కింద నుంచి మూడు మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే రెండు గంటల పాటు శ్రమించిన తర్వాత అతికష్టం మీద మూడు మృతదేహాలను వెలికితీశారు. మృతి చెందిన ముగ్గురు బీహార్‌కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
మృతులు వీరయ్య, వాసు, రాములుగా తెలుస్తోంది. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా కు తరలించగా.. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని స్థానిక హాస్పిటల్‌కి తరలించారు. ఒక్కసారిగా సెల్లార్‌లో మట్టిదిబ్బలు కూలి పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మృతుల్లో ఇద్దరు తండ్రీ, కొడుకులు ఉన్నట్లు గుర్తించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో పనిచేసే ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. అయితే సెల్లార్ తవ్వకాలు జరుపుతున్న సమయంలో జీహెచ్‌ఎంసీ నిబంధనల ప్రకారం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే సెల్లార్ తవ్వే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.