– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13 : భగవద్గీత ఏ ఒక్క మతానికో పరిమితమైన గ్రంథం కాదని, అది భారతీయ జీవన విధానాన్ని ఆవిష్కరించే సమగ్ర జీవన శాస్త్రమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మాదాపూర్‌లోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్‌లో ప్రముఖ వైద్యుడు డాక్టర్ శ్రీనాథన్ రచించిన ‘భగవద్గీత ఇన్ ది లెన్స్ ఆఫ్ న్యూరోసైన్స్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. వేల సంవత్సరాల నాటి మన ఆధ్యాత్మిక జ్ఞాన సంపదను ఆధునిక వైద్య పరిజ్ఞానమైన ‘న్యూరోసైన్స్’తో అనుసంధానిస్తూ డాక్టర్ శ్రీనాథన్ ఈ గ్రంథాన్ని రచించడం అభినందనీయమన్నారు. మనిషికి ఎదురయ్యే ఒత్తిడి, కోపం, భయం, ఆందోళనలను జయించడానికి, ఏకాగ్రతను పెంచుకోవడానికి భగవద్గీతలోని మార్గాలు నేటి యువతకు, విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. వేదాలు, భగవద్గీత ఎప్పటికీ పురాతనమైనవి కావని, లక్ష సంవత్సరాల తర్వాత కూడా అవి మానవాళికి మార్గదర్శనం చేస్తాయని పేర్కొన్నారు. కురుక్షేత్రం కేవలం ఒక యుద్ధభూమి కాదని, ప్రతి మనిషి జీవితంలో ఎదురయ్యే ధర్మసంకటాలకు, అంతర్గత సంఘర్షణలకు అది ప్రతీక అని కిషన్ రెడ్డి అభివర్ణించారు. ఫలితాన్ని ఆశించకుండా ‘కర్మయోగం’ స్ఫూర్తితో పనిచేయడం వల్లే మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వంటి సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వారు దేశంలో అత్యున్నత స్థాయికి ఎదిగారని కొనియాడారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ, వైద్యులు వారించినా వర్చువల్ వేదికగా పుస్తకావిష్కరణలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖులు, సినీ నటుడు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు


