– దూర ప్రాంతాలకు, పండుగలకు నూతన రైళ్లు ఏర్పాటు చేయాలి
– రైల్వే జీఎంకు డాక్టర్ లక్ష్మణ్ వినతి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17: రాష్ట్ర ప్రజలు, భక్తులు, నిత్య ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే కనెక్టివిటీని మరింత మెరుగుపరచాలని కోరుతూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ బోర్డు మెంబర్ డాక్టర్ కె.లక్ష్మణ్ బీజేపీ బృందంతో కలిసి సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్‌ను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ఉపాధి, విద్య, వ్యాపారం, ఆధ్యాత్మిక యాత్రల కోసం రైల్వే సేవలపై ఆధారపడే హైదరాబాద్ సహా పరిసర జిల్లాల ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని దూరప్రాంతాలకు నూతన రైళ్ల ఏర్పాటు, సబర్బన్ సేవల పెంపు, మౌలిక సదుపాయాల కల్పనతోపాటు రానున్న సంక్రాంతి పండుగ, శబరిమల యాత్ర రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపాలని విజ్ఞప్తి చేశారు. రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న లక్షలాదిమంది ప్రజలు తమ కుటుంబాలతో పండుగ జరుపుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని స్వస్థలాలకు వెళ్తుంటారన్నారు. ప్రయాణికుల రద్దీ కారణంగా ఇప్పటికే ఖమ్మం, విజయవాడ, విశాఖ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి సహా పలు ప్రధాన ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో ఆన్లైన్ రిజర్వేషన్లు ‘రిగ్రెట్ చూపిస్తున్నాయని, దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన జీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా హైదరాబాద్ నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాలకు అదనపు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో అదనపు సర్వీసులు నడిపి ప్రస్తుత రైళ్లలో రద్దీని నివారించాలని కోరారు. శబరిమల యాత్రా సీజన్ ప్రారంభమైనందున అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం కేరళకు కూడా ప్రత్యేక రైళ్లు నడపాలని విజ్ఞప్తి చేశారు.
7 కీలక రైల్వే ప్రతిపాదనలపై వినతి
ఉత్తర భారతంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్లే భక్తుల రద్దీని తగ్గించేందుకు సికింద్రాబాద్ నుండి అయోధ్యకు నేరుగా రైలు సర్వీసును (వారణాసి, ప్రయాగ్‌రాజ్ మీదుగా అనుసంధానంతో) ప్రారంభించాలని డాక్టర్ లక్ష్మణ్ కోరారు. బీహార్, యూపీ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్ – దానాపూర్ మధ్య అదనపు రైలును, సికింద్రాబాద్ – గోరఖ్‌పూర్ మధ్య రోజూ నడిచే ప్రత్యేక రైలును ఏర్పాటు చేయాలని సూచించారు. అయ్యప్ప భక్తులు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్/చర్లపల్లి/కాచిగూడ నుండి తిరువనంతపురం (త్రివేండ్రం సెంట్రల్) వరకు అదనపు రెగ్యులర్ సర్వీసును ప్రవేశపెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఎంఎంటీఎస్ ఫ్రీక్వెన్సీ పెంచాలి
హైదరాబాద్ నగర ప్రయాణికుల రవాణా కష్టాలను తీర్చేందుకు పాత బస్తీలోని ఫలక్‌నుమా నుండి లింగంపల్లి మధ్య రోజంతా ఎంఎంటీఎస్ రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచాలని, ముఖ్యంగా ఉదయం, సాయంత్రం రద్దీ వేళలతోపాటు నాన్-పీక్ అవర్స్‌లోనూ తక్కువ విరామంతో రైళ్లు నడపాలని లక్ష్మణ్ కోరారు. ఫలక్‌నుమా, యాకుత్‌పురా, దబీర్‌పురా, మలక్‌పేట ప్రాంతాల ప్రజలు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుని దూరప్రాంత రైళ్లు అందుకోవడానికి వీలుగా సమయాలు రూపొందించాలని సూచించారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు లాస్ట్-మైల్ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు సికింద్రాబాద్, లింగంపల్లి, ఫలక్‌నుమా, కాచిగూడ స్టేషన్ల నుండి అదనపు ఎంఎంటీఎస్ రైళ్లు నడపడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని అప్రోచ్ రోడ్ల అభివృద్ధి, ఆర్టీసీ బస్సులు, ఆటో, ట్యాక్సీ సదుపాయాలను కల్పించాలని ఆయన కోరారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న రామన్నపేట పట్టణం, పరిసర గ్రామాల ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారుల ప్రయాణ ఇబ్బందులను తొలగించేందుకు రామన్నపేట స్టేషన్లో నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ కు హాల్ట్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
జీఎం సానుకూల స్పందన
అనంతరం సంబంధిత అధికారులతో చర్చించిన జీఎం.. డాక్టర్ లక్ష్మణ్ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించారు. శబరిమలకు 27 స్పెషల్ ట్రైన్లను నడుపుతామని, అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా ఏపీకి 40 స్పెషల్ ట్రైన్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మిగిలిన నూతన రైళ్లు, హాల్టింగ్ ఇతర ప్రతిపాదనలను రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




