– ‘భారత్ సమ్మిట్ -2026’ ముగింపు వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14 : అంతర్జాతీయ అంశాలపై పరిశోధన, విధానపరమైన చర్చలు, ప్రపంచ సమస్యలకు పరిష్కార మార్గాల అన్వేషణకు ఒక శక్తిమంతమైన గ్లోబల్ థింక్ ట్యాంక్‌గా ‘అవర్ వరల్డ్ ఇన్స్టిట్యూట్’ను తీర్చిదిద్దుతామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనలకు కార్యరూపం ఇచ్చేందుకు భారత్ సమ్మిట్ వేదికగా ఈ సంస్థను ప్రారంభించామన్నారు.హెచ్ఐసీసీలో శనివారం నిర్వహించిన ‘భారత్ సమ్మిట్–2026’ ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ సమ్మిట్ లో భాగంగా హెచ్ఐసీసీలో 12 అంతర్జాతీయ ప్యానెల్స్, హైటెక్స్ లో 8 ‘తెలంగాణ రైజింగ్’ సెషన్లతో పలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించామన్నారు. ఏఐ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సమానత్వం, వాతావరణ మార్పులు, శాంతి, మీడియా భవిష్యత్తు, ప్రజాస్వామ్య వ్యవస్థల పనితీరు తదితర అంశాలపై నిర్వహించిన చర్చల్లో వివిధ దేశాల ప్రతినిధులు, మేధావులు పాల్గొన్నారన్నారు. ఆలోచనలు వేరుగా ఉన్నా మరింత సమానత్వంతో, ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యమిస్తూ మానవీయ దృక్పథంతో కూడిన రేపటి ప్రపంచాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని అందరూ అభిప్రాయపడ్డారన్నారు. ఈ సమ్మిట్ తెలంగాణకు గౌరవంతోపాటు బాధ్యతను కూడా తీసుకొచ్చిందని ఆయన అన్నారు. ప్రపంచంతో అనుసంధానమవుతూనే సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండొచ్చని, అభివృద్ధి, సంక్షేమం, ప్రజల ఆత్మ గౌరవం కలిసే ముందుకు సాగొచ్చని తెలంగాణ నిరూపిస్తోందన్నారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0’కు హాజరు కావాలని దేశ, విదేశీ ప్రతినిధులను ఆహ్వానించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు


