కరెంటు కోతలు.. రైతు కంట కన్నీళ్లు!
వ్యవసాయానికి 12 గంటల విద్యుత్తు అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రైతులు విద్యుత్తు సరఫరాలో అంతరాయాలను నిరసిస్తూ ఆందోళన చేస్తున్నారు..కొన్ని ప్రాంతాల్లో 6-8 గంటలే కరెంటు వస్తోందని రైతులు వాపోతున్నారు..మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తక్కువ వోల్టేజీ, తరచూ విద్యుత్తు నిలిచిపోవడం వల్ల, ట్రాన్స్ ఫార్మార్ లు, బోరు మోటార్లు కాలిపోవడం మూలంగా పంటలు ఎండిపోతున్నాయి. ఇవి కేవలం విద్యుత్తు సరఫరాకు సంబంధించిన సమస్యలు మాత్రమే కావు. పంట భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలు. వరి పొట్ట దశలోనో, కంకి ఏర్పడే కీలక సమయంలోనో నీరు అందకపోతే దిగుబడిపై ప్రభావం పడుతుంది. విద్యుత్తు ఎప్పుడు వస్తుందో తెలియక రైతు రాత్రింబవళ్లు మోటార్ల దగ్గరే పడిగాపులు కాయాల్సి వస్తుంది. తరచూ కరెంటు రావడం, పోవడం, వోల్టేజీలో హెచ్చుతగ్గులు ఏర్పడడం వల్ల మోటార్లు, స్టార్టర్లు దెబ్బతినడం తో మరమ్మతులకు మరో ఖర్చు.. పంటకు మరో నష్టం! కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నాయనే రైతుల ఫిర్యాదులకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? వ్యవసాయానికి నిర్ణయించిన గంటల మేరకు నాణ్యమైన విద్యుత్తు అందుతోందా లేదా అన్నది క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన బాధ్యత అధికారులపై లేదా?
తెలంగాణలో విద్యుత్తు అంశం కేవలం ఒక ప్రభుత్వ పనితీరుకే పరిమితమైనది కాదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విద్యుత్తు కొరత నుంచి బయటపడటం, వ్యవసాయానికి నిరంతర సరఫరా కల్పించడం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రధానంగా ప్రచారం చేసిన అంశాల్లో ఒకటి. కేసీఆర్ పాలనలో 24 గంటల ఉచిత వ్యవసాయ విద్యుత్తు విధానాన్ని అమలు చేశారు. ఇళ్లకు, పరిశ్రమలకు కూడా నిరంతర విద్యుత్తు అందించడాన్ని పాలనా విజయంగా ప్రస్తావించారు. ఆరోజుల్లో విద్యుత్తు కోతలతో ఇబ్బందిపడిన ప్రజలకు ఆ పరిస్థితి నుంచి ఉపశమనం లభించిందన్న అభిప్రాయం బలంగా ఉండేది. ఇన్వర్టర్లు, జనరేటర్లు మూలకు పడ్డాయి… అయినా ఒక ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే: 24 గంటల విద్యుత్తు హామీ ఇచ్చినప్పుడు ప్రజలు ఆశించింది ప్రకటనలు మాత్రమేనా? లేక అవసరమైన సమయంలో అంతరాయం లేని సరఫరానా? విద్యుత్తు డిమాండ్ పెరిగిందని, జలవిద్యుత్తు ఉత్పత్తి తగ్గిందని చెప్పడం సమస్యకు వివరణ కావచ్చు. కానీ రైతుకు పంటను కాపాడుకునే పరిష్కారం కావాలి. ముందస్తు ప్రణాళిక, తగినంత విద్యుత్తు కొనుగోలు, సరఫరా వ్యవస్థ బలోపేతం, ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ.. ఇవన్నీ ప్రభుత్వ బాధ్యతలో భాగమే.
తెలంగాణలో భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం వ్యవసాయానికి నీటి భరోసా కల్పించడం. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ వంటి ప్రాజెక్టులు నిర్మితమయ్యాయి. అయితే, ప్రాజెక్టు ఉండటం ఒకటైతే, అవసరమైన సమయంలో ఆయకట్టుకు నీరు అందించడం మరొకటి. గోదావరి, కృష్ణా జలాలను సమర్థంగా వినియోగించుకోవడం, అందుబాటులో ఉన్న నీటిని ప్రణాళికాబద్ధంగా నిల్వ చేయడం, కాలువల ద్వారా పంపిణీ చేయడం, ఎత్తిపోతల పథకాలకు అవసరమైన విద్యుత్తు అందించడం.. ఇవన్నీ పరస్పరం ముడిపడిన అంశాలు. వర్షపాతం, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, ఎగువ నుంచి వచ్చే ప్రవాహాలు, పంపిణీ సామర్థ్యం వంటి అంశాలను బట్టి సాగునీటి లభ్యత మారుతుంది.
అందుకే ప్రాజెక్టుల పేర్లు చెప్పడమే కాదు.. వాటి ద్వారా ఎంత నీరు అందుబాటులో ఉంది? ఎంత ఆయకట్టుకు సరఫరా చేస్తున్నారు? ఏ ప్రాంతాలకు ఎంత నీరు అందుతోంది? అనే వివరాలను ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాలి. నీటి కొరత ఒకవైపు, విద్యుత్తు కోతలు మరోవైపు ఉంటే బోర్లపై ఆధారపడిన రైతు పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. వర్షం కోసం ఆకాశం వైపు చూడాలా? కరెంటు కోసం సబ్‌స్టేషన్ వైపు చూడాలా? సాగునీటి కోసం ప్రాజెక్టుల వైపు చూడాలా? అన్న సందిగ్ధంలో రైతు మిగిలిపోతే వ్యవసాయానికి భరోసా ఎక్కడ?
రైతు బీమా, రైతు భరోసా.. భరోసా మాటల్లోనే మిగలకూడదు! వ్యవసాయం అంటే కేవలం పంట పండించడం మాత్రమే కాదు. ప్రకృతి వైపరీత్యాలు, ధరల మార్పులు, పెట్టుబడి వ్యయం, కుటుంబ అవసరాలు.. ఇలా అనేక సవాళ్ల మధ్య రైతు జీవనం సాగిస్తాడు. అలాంటి రైతుకు పంట పెట్టుబడి సాయం, జీవిత బీమా, సాగునీరు, విద్యుత్తు అన్నీ కీలకమే. రైతు బీమా విషయంలోనూ ఇప్పుడు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు 14తర్వాత రైతు బీమా ప్రీమియం చెల్లింపులు పునరుద్ధరించకపోవడంతో పలు క్లెయిమ్‌లు పెండింగ్ లోనే ఉన్నాయి..రైతు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా సాయం అందడం కేవలం ఆర్థిక లావాదేవీ కాదు. కుటుంబం ఒక్కసారిగా ఆధారాన్ని కోల్పోయినప్పుడు నిలబడేందుకు ఇచ్చే భరోసా. అటువంటి పథకంలో అంతరాయం ఏర్పడితే ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి? పెండింగ్ క్లెయిమ్‌లను ఎప్పటిలోగా పరిష్కరిస్తారు? అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం ఎలా చేస్తారు? అదేవిధంగా రైతు భరోసా నిధులు సాగు ప్రారంభానికి అవసరమైన సమయంలో అందుతున్నాయా? రైతుకు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే వేళ డబ్బు అందకపోతే, తర్వాత వచ్చిన సాయం వల్ల ఆ తొలి ఇబ్బంది పూర్తిగా తొలగిపోతుందా? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలి.
పరిశ్రమలకు విద్యుత్తు అనేది ఉత్పత్తికి ప్రాణాధారం. ముఖ్యంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పరిమిత పెట్టుబడులతో, తక్కువ లాభాల మార్జిన్‌తో నడుస్తుంటాయి. రైస్ మిల్లులు, పిండి మిల్లులు, వెల్డింగ్ షాపులు, ఫ్యాబ్రికేషన్ యూనిట్లు, ప్లాస్టిక్ తయారీ సంస్థలు, చిన్న తయారీ కేంద్రాలు, కోల్డ్ స్టోరేజీలు, వర్క్‌షాపులు.. ఇలాంటి రంగాలకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడితే నేరుగా ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది. యంత్రం మధ్యలో ఆగితే పని నిలిచిపోతుంది. ఆర్డర్లు ఆలస్యమవుతాయి. కార్మికులకు పని గంటలు తగ్గుతాయి. జనరేటర్లు వినియోగిస్తే డీజిల్ ఖర్చు పెరుగుతుంది. మళ్లీ యంత్రాలను ప్రారంభించడానికి సమయం పడుతుంది. నిరంతర విద్యుత్తు అవసరమయ్యే యూనిట్లలో ఉత్పత్తి నాణ్యత, యంత్రాల నిర్వహణపై కూడా ప్రభావం ఉండవచ్చు.
రైతు పంట పండించాలి. పరిశ్రమ ముడిసరుకును ఉత్పత్తిగా మార్చాలి. వ్యాపారి వస్తువులు అమ్మాలి. కార్మికుడికి పని దొరకాలి. ఈ మొత్తం వ్యవస్థ సజావుగా నడవాలంటే విద్యుత్తు సరఫరా స్థిరంగా ఉండటం అత్యవసరం. కరెంటు బిల్లులు పెరిగితే.. ప్రజలపై అదనపు భారం! విద్యుత్తు చార్జీల పెంపు అంశం కూడా వినియోగదారుల్లో చర్చకు వస్తోంది. కుటుంబ బడ్జెట్లో ఇప్పటికే నిత్యావసరాల ధరలు, పిల్లల చదువులు, వైద్యం, రవాణా ఖర్చులు భారంగా మారినప్పుడు విద్యుత్తు బిల్లుల పెరుగుదల అదనపు భారంగా అనిపిస్తుంది. వ్యాపారాలకు విద్యుత్తు ఖర్చు పెరిగితే ఆ ప్రభావం ఉత్పత్తి వ్యయాల్లోనూ ప్రతిఫలించవచ్చు. అయితే, చార్జీల పెంపు ఎంత మేరకు జరిగింది? ఏ వర్గాలకు వర్తిస్తుంది? విద్యుత్తు నియంత్రణ సంస్థ ఆమోదించిన టారిఫ్ వివరాలు ఏమిటి? అనే అంశాలను ఆధారాలతో పరిశీలించాలి. అదే సమయంలో వినియోగదారుడు చెల్లిస్తున్న ప్రతి రూపాయికి తగిన సేవ అందుతోందా అనే ప్రశ్న కూడా అంతే ముఖ్యం. బిల్లు మాత్రం క్రమం తప్పకుండా రావాలి.. కానీ విద్యుత్తు సరఫరా మాత్రం అంతరాయాలతో కొనసాగితే వినియోగదారుడి అసంతృప్తి పెరగడం సహజం.
ప్రభుత్వాలు మారుతాయి. పార్టీలు మారుతాయి. పాలకుల ప్రకటనలు మారుతాయి. కానీ రైతు అవసరాలు మాత్రం మారవు. విత్తనం వేసిన రైతుకు పంట చేతికొచ్చే వరకు భరోసా కావాలి. పరిశ్రమ నడిపే వ్యక్తికి యంత్రాలు తిరిగేంత విద్యుత్తు కావాలి. కుటుంబానికి అందుబాటు ధరలో అవసరమైన సేవలు కావాలి. కేసీఆర్ పాలనలో విద్యుత్తు సరఫరాను బీఆర్ఎస్ ప్రభుత్వం తన ప్రధాన విజయాల్లో ఒకటిగా ప్రచారం చేసుకుంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరంతర విద్యుత్తు సరఫరాపై తన నిబద్ధతను ప్రకటిస్తోంది. ఈ రెండు ప్రకటనల మధ్య ప్రజలు కోరేది రాజకీయ వాదోపవాదాలు కాదు.. తమ అనుభవంలో కనిపించే ఫలితాలు. విద్యుత్తు డిమాండ్ పెరిగిందని ప్రభుత్వం చెబితే, దానికి తగిన సరఫరా ప్రణాళిక ఏమిటో చెప్పాలి. రైతులు కరెంటు రావడం లేదని చెబితే, వారి ప్రాంతాల్లో వాస్తవంగా ఎన్ని గంటలు సరఫరా అవుతోందో వివరించాలి. రైతు బీమా క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉంటే, పరిష్కారానికి గడువు ప్రకటించాలి. సాగునీటి సమస్య ఉంటే ప్రాజెక్టుల వారీగా నిల్వలు, పంపిణీ వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ప్రజలకు కావాల్సింది మాటల మార్పు కాదు.. బతుకుల్లో మార్పు.
తెలంగాణలో మార్పు వచ్చిందని చెప్పడానికి పాలకులు చూపించే ప్రకటనలు ఒకవైపు ఉంటే, ప్రజలు తమ నిత్యజీవితంలో అనుభవించే పరిస్థితులు మరోవైపు ఉంటాయి. రైతుకు పంటపై నమ్మకం కలగాలి. పరిశ్రమకు ఉత్పత్తిపై భరోసా ఉండాలి. కుటుంబానికి విద్యుత్తు బిల్లు చెల్లించిన తర్వాత సేవ అందుతుందనే విశ్వాసం ఉండాలి. అప్పుడే పాలనపై ప్రజల్లో సంతృప్తి పెరుగుతుంది. రైతు పంట ఎండిపోతుంటే అభివృద్ధి గణాంకాలు అతనికి ఎంతవరకు ఉపయోగపడతాయి? చిన్న పరిశ్రమ యజమాని జనరేటర్ ఖర్చుతో సతమతమవుతుంటే పెట్టుబడుల ప్రకటనలు అతని సమస్యను పరిష్కరిస్తాయా? బీమా కోసం ఎదురుచూస్తున్న రైతు కుటుంబానికి హామీ సరిపోతుందా? కేసీఆర్ పాలనతో పోలికలు రాజకీయంగా కొనసాగవచ్చు.
ప్రజలు కోరేది అధికార మార్పు మాత్రమే కాదు.. తమ బతుకుల్లో మెరుగుదల. ఆ మార్పును హామీలతో కాదు, క్షేత్రస్థాయి ఫలితాలతో నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.





