రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో తెలంగాణ నవశకం!

ఒకప్పుడు కేవలం సాఫ్ట్‌వేర్, ఫార్మా రంగాలకే పరిమితమైన తెలంగాణ పారిశ్రామిక ముఖచిత్రం నేడు సరికొత్త శిఖరాలను అధిరోహిస్తున్నది. అత్యాధునిక సాంకేతికత, కచ్చితమైన ఇంజినీరింగ్ నైపుణ్యం కలిగిన డిఫెన్స్ (రక్షణ), ఏరోస్పేస్ రంగాల్లో రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సీఐఐ  సదస్సులో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించిన గణాంకాలు ఈ రంగాల అద్భుత వేగాన్ని స్పష్టం చేస్తున్నాయి. సాంప్రదాయ ఐటీ, ఫార్మా రంగాల వృద్ధిని సైతం అధిగమిస్తూ, డిఫెన్స్, ఏరోస్పేస్ ఎగుమతులు గతంతో పోలిస్తే రెట్టింపు కావడం తెలంగాణ పారిశ్రామిక విధానాల విజయానికి నిదర్శనం.
గణాంకాలను పరిశీలిస్తే, తెలంగాణ పారిశ్రామిక ఎగుమతుల ముఖచిత్రం ఎంత వేగంగా మారుతుందో అర్థమవుతుంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఏరోస్పేస్ ఎగుమతులు ఏకంగా 103 శాతం వృద్ధిని నమోదు చేసి, దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న కేంద్రంగా నిలిచాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలోని తొలి తొమ్మిది నెలల్లోనే దాదాపు ₹30,742 కోట్ల విలువైన విమాన, అంతరిక్ష విడిభాగాలు ఎగుమతి అయ్యాయి. రాష్ట్ర మొత్తం వస్తు ఎగుమతుల్లో ఈ రంగం వాటా సుమారు 30 శాతానికి చేరడం విశేషం. అంతేకాకుండా, రాష్ట్ర ఇంజినీరింగ్ ఎగుమతులు రెండేళ్ల వ్యవధిలో1.8 బిలియన్ డాలర్ల నుండి7.5 బిలియన్ డాలర్లకు (117.9 శాతం వృద్ధి) ఎగబాకి, జాతీయ స్థాయిలో 8వ స్థానం నుండి 4వ స్థానానికి చేరుకున్నాయి.
ఈ అసాధారణ వృద్ధి వెనుక దశాబ్దాల నాటి బలమైన పునాది ఉంది. డీఆర్‌డీఓ, భారత్ డైనమిక్స్, మిథాని, వంటి ప్రభుత్వ రంగ సంస్థల ఉనికి హైదరాబాద్‌కు ‘మిస్సైల్ హబ్’గా పేరు తెచ్చింది. ఈ పరిశోధనా వాతావరణాన్ని అందిపుచ్చుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ప్రత్యేక ఏరోస్పేస్ పార్కులను అభివృద్ధి చేశాయి.
ఫలితంగా బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్, ఎయిర్‌బస్, సాఫ్రాన్, జీఈవంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌ను తమ కీలక తయారీ, నిర్వహణకేంద్రాలుగా మార్చుకున్నాయి. ఆదిబట్లలోని టాటా-బోయింగ్ జాయింట్ వెంచర్ అపాచీ హెలికాప్టర్ విడిభాగాలను ప్రపంచానికి అందిస్తుండగా, 25కు పైగా పెద్ద సంస్థలకు అనుబంధంగా వెయ్యికి పైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు అంతర్జాతీయ సరఫరా గొలుసులో భాగస్వాములయ్యాయి. నిజం చెప్పాలంటే తెలంగాణ రక్షణ, అంతరిక్ష రంగాల వృద్ధిలో కేవలం బహుళజాతి సంస్థలే కాకుండా, దేశీయ స్టార్టప్‌లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. టీ-హబ్ , వీ-హబ్ వంటి ఆవిష్కరణ కేంద్రాల ప్రోత్సాహంతో హైదరాబాద్ నేడు డీప్-టెక్ మరియు స్పేస్-టెక్ స్టార్టప్‌లకు అడ్డాగా మారింది. స్కైరూట్ ఏరోస్పేస్ (ప్రైవేట్ రాకెట్ల తయారీ), ధ్రువ స్పేస్ (శాటిలైట్ టెక్నాలజీ), అనంత్ టెక్నాలజీస్,  డ్రోన్ల తయారీలో మారుత్ డ్రోన్స్ వంటి సంస్థలు ప్రపంచ స్థాయి ఆవిష్కరణలతో సత్తా చాటుతున్నాయి. ఇవి కేవలం విడిభాగాల తయారీకే పరిమితం కాకుండా, స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన ఈ స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలకు మరింత ఊతమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న ‘తెలంగాణ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 2.0’ అత్యంత కీలకం కానుంది.
పాత పాలసీ ప్రధానంగా భారీ తయారీ సంస్థలను ఆకర్షించడంపై దృష్టి పెట్టగా, కొత్త పాలసీ ‘ఆవిష్కరణలు, పరిశోధన , అభివృద్ధి (ఆర్ అండ్ డి)’ పై ప్రధానంగా దృష్టి సారిస్తున్నది. ఈ పాలసీ ద్వారా డ్రోన్ టెక్నాలజీ, ఏఐ ఆధారిత రక్షణ వ్యవస్థలు, స్పేస్-టెక్ స్టార్టప్‌లకు ప్రత్యేక రాయితీలు, టెస్టింగ్ రేంజ్‌లు (పరీక్షా కేంద్రాలు),  సీడ్ ఫండింగ్ అందుబాటులోకి రానున్నాయి. అంతేకాకుండా, విదేశీ సంస్థల సాంకేతిక బదిలీ ద్వారా స్థానిక స్టార్టప్‌లను గ్లోబల్ సప్లై చైన్‌తో అనుసంధానించడం ఈ పాలసీ ప్రధాన లక్ష్యం. ఇది కార్యరూపం దాల్చితే, తెలంగాణ కేవలం తయారీ కేంద్రంగానే కాకుండా, ప్రపంచ రక్షణ ఆవిష్కరణల కేంద్రంగా అవతరిస్తుంది. పూర్తిస్థాయి వ్యవస్థలను నిర్మిస్తున్నాయి. అయితే, ఈ విజయాలతో సంతృప్తి చెందకుండా భవిష్యత్ సవాళ్లకు అనుగుణంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.
 మారుతున్న ప్రపంచ భౌగోళిక పరిస్థితుల్లో దేశీయ రక్షణ తయారీకి (ఆత్మనిర్భర్ భారత్) అపారమైన అవకాశాలు ఉన్నాయి. సాంప్రదాయ విడిభాగాల తయారీతో పాటు డ్రోన్లు (యూఏవీలు) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, అంతరిక్ష ప్రయోగాల వంటి నూతన సాంకేతికతలపై మరింత దృష్టి సారించాలి. . అంతరిక్ష, రక్షణ రంగాల్లో వొస్తున్న ఈ విప్లవాత్మక మార్పులు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు కొత్త రెక్కలు తొడుగుతున్నాయి. బహుళజాతి సంస్థల భారీ పెట్టుబడులు, దేశీయ స్టార్టప్‌ల సరికొత్త ఆవిష్కరణలు, ప్రభుత్వం తీసుకురానున్న ‘పాలసీ 2.0’ విధానాలు ఒకదానికొకటి తోడై రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని తిరుగులేని శక్తిగా మారుస్తున్నాయి.
పరిశ్రమలను కేవలం హైదరాబాద్ చుట్టుపక్కలకే పరిమితం చేయకుండా ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించడం అభినందనీయం. వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెంలలో కొత్త ఎయిర్‌ఫీల్డ్‌లను అభివృద్ధి చేయాలన్న నిర్ణయం ప్రాంతీయ సమతుల్య అభివృద్ధికి దోహదపడుతుంది. ఇదే సమయంలో, ఈ పరిశ్రమలకు అవసరమైన అత్యున్నత నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేసేందుకు విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల మధ్య సమన్వయాన్ని మరింత పెంచాలి. చిన్న తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) సులభతర రుణాలు, పరిశోధనా ప్రోత్సాహకాలు అందిస్తే, రానున్న రోజుల్లో తెలంగాణ ప్రపంచ రక్షణ, అంతరిక్ష రంగాలకు తిరుగులేని కేంద్రంగా అవతరించడం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *