పోలీసు దర్పానికి న్యాయపరమైన కళ్లెం!

జీడిమెట్ల భూ వివాదంలో న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించినందుకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఎం. రమేశ్, మేడ్చల్ డీసీపీ ఎన్. కోటిరెడ్డిలకు తెలంగాణ హైకోర్టు రెండు వారాల సాధారణ జైలుశిక్ష విధించడం తో పాటు ఒక్కొక్కరికి రూ.2వేలు జరిమానా విధించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక కీలక మలుపు. చట్టాన్ని పరిరక్షించాల్సిన ఉన్నత స్థాయి పోలీసు అధికారులే కోర్టు ధిక్కరణకు పాల్పడి జైలు శిక్షకు గురికావడం వ్యవస్థలో పేరుకుపోయిన అధికార దుర్వినియోగానికి అద్దం పడుతుంది . ఈ ఘటన పోలీసు అధికారాల పరిమితులు, పౌర హక్కుల రక్షణపై తీవ్రమైన చర్చకు దారితీస్తుంది . భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కుల పరిరక్షణే పోలీసుల ప్రధాన కర్తవ్యం. శాంతిభద్రతల నిర్వహణ, నేరాల నియంత్రణ మాత్రమే వారి పరిధి. కానీ, చట్టం తమకు కల్పించిన అధికారాలను కొందరు అధికారులు అపరిమితమైనవిగా భావిస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన పరిమితులను అతిక్రమించి, తామే న్యాయమూర్తులుగా వ్యవహరించే ధోరణి ప్రమాదకరం. ఆస్తి హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించకుండా ఏకపక్షంగా వ్యవహరించడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం.

ప్రధానంగా భూ వివాదాల్లో పోలీసుల జోక్యం వెనుక భారీ అవినీతి, ఆర్థిక ప్రయోజనాల కోణం దాగి ఉందన్నది బహిరంగ రహస్యం. సివిల్ తగాదాలను పరిష్కరించే అధికారం కేవలం సివిల్ కోర్టులకు మాత్రమే ఉన్నప్పటికీ, కోట్లాది రూపాయల విలువైన భూముల విషయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తుల నుంచి భారీగా ముడుపులు తీసుకుని పోలీసులు ‘సెటిల్‌మెంట్’ కేంద్రాలుగా మారుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. “హైకోర్టులో దాఖలవుతున్న పిటిషన్లలో మెజారిటీ భాగం సివిల్ వివాదాల్లో పోలీసుల అనవసర జోక్యానికి సంబంధించినవే” అని గతంలోనే తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేయడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) గణాంకాలను పరిశీలిస్తే, 2025 సంవత్సరంలో తెలంగాణలో నమోదైన 199 అవినీతి కేసుల్లో 273 మంది అధికారులు అరెస్టు కాగా, రెవెన్యూ తర్వాత అత్యధికంగా పట్టుబడుతున్న వారిలో పోలీసు శాఖ సిబ్బందే ఉండటం గమనార్హం. పోలీసు స్టేషన్లను రికవరీ ఏజెంట్లుగా, భూకబ్జాదారులకు అడ్డాలుగా మార్చడం వల్ల పోలీస్ యూనిఫామ్ ప్రతిష్ఠ మంటగలుస్తోంది.

హైదరాబాద్, సైబరాబాద్ వంటి ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశాన్ని తాకడంతో, కోట్లాది రూపాయల విలువైన ఆస్తుల వివాదాల్లో పోలీసులకు భారీగా ముడుపులు అందుతున్నాయి. సెటిల్‌మెంట్ చేస్తే వొచ్చే ఆర్థిక లబ్ధి ముందు సస్పెన్షన్ భయం చిన్నదిగా కనిపిస్తుంది . సివిల్ కోర్టు పరిధిలోని భూ, ఆర్థిక తగాదాలను పోలీసులు నేరుగా స్వీకరించకూడదు. అయితే, కక్షిదారులతో కుమ్మక్కై ఆ వివాదానికి ‘దౌర్జన్యం’ ‘అక్రమ ప్రవేశం’ లేదా ‘మోసం’ వంటి క్రిమినల్ సెక్షన్లను జోడించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్నారు. “క్రిమినల్ కోణం ఉంది కాబట్టే విచారిస్తున్నాం” అనే సాంకేతిక సాకుతో డీజీపీ ఆదేశాలను, కోర్టు నిబంధనలను సులభంగా తప్పించుకుంటున్నారు.  వీటికి తోడు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతల అండదండలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. ఉన్నత స్థానాల్లో కొనసాగాలంటే రాజకీయ నేతల మాట వినక తప్పదనే ధోరణి కొందరు అధికారులను నిబంధనలు ఉల్లంఘించేలా చేస్తున్నది .

సివిల్ కోర్టుల్లో కేసులు ఏళ్ల తరబడి సాగుతుండటంతో, బాధితులు లేదా బలవంతులు తక్షణ పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. పోలీసుల  బెదిరింపులతో అవతలి పార్టీని భయపెట్టి త్వరగా సెటిల్‌మెంట్ చేసుకోవొచ్చనే భావన ప్రజల్లోనూ, దలారుల్లోనూ బలంగా ఉంది. ఫిర్యాదులు వొచ్చినప్పుడు కింది స్థాయి సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నప్పటికీ, కొద్ది నెలల తర్వాత వారు తిరిగి విధుల్లోకి రావడం, పోస్టింగ్‌లు పొందడం సాధారణమైపోయింది. ఉన్నతాధికారుల స్థాయిలో పర్యవేక్షణ కొరవడటం, ఫిర్యాదులపై విచారణను తిరిగి పోలీసు శాఖే నిర్వహించడం వల్ల కఠినమైన భయం లేకుండా పోతున్నది..సంక్షిప్తంగా  చెప్పాలంటే, చట్టంలోని లొసుగులను (క్రిమినల్ సెక్షన్ల జోడింపు) వాడుకుంటూ, రాజకీయ అండతో, భారీ ఆర్థిక లాభాల కోసం క్షేత్రస్థాయిలో కొందరు పోలీసులు అక్రమాలకు పాల్పడుతున్నారు.

పోలీసుల అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలంటే తక్షణమే ఒక స్వతంత్ర ‘పోలీసు ఫిర్యాదుల పరిష్కార ప్రాధికార సంస్థ’ ఏర్పాటు అత్యవసరం. ప్రస్తుతం పోలీసులపై వొచ్చే ఆరోపణలను తిరిగి పోలీసు అధికారులే విచారించే విధానం వల్ల బాధితులకు న్యాయం జరగడం లేదు. సుప్రీంకోర్టు ప్రకాశ్ సింగ్ కేసులో ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి, పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు, స్వతంత్ర నిపుణులతో కూడిన కమిటీలను జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఏర్పాటు చేయాలి. అప్పుడే అధికారుల్లో జవాబుదారీతనం పెరుగుతుంది.ఇదే సమయంలో న్యాయస్థానాల ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కోర్టు తీర్పులను అధికారులు ఉల్లంఘిస్తుంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించకూడదు. ఉన్నతాధికారులే కోర్టు ధిక్కరణకు పాల్పడితే, కింది స్థాయి సిబ్బందికి ఏం సందేశం వెళ్తుందో పాలకులు ఆలోచించాలి. జీడిమెట్ల కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం ఒక హెచ్చరికగా తీసుకోవాలి. సివిల్ వివాదాల్లో తలదూర్చే పోలీసులపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడేలా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలి. చట్టం ముందు ఎవరూ అతీతులు కారని, అధికార దర్పం న్యాయం ముందు తలవంచక తప్పదని హైకోర్టు తీర్పు మరోసారి నిరూపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *