ప్రాణాలు తీస్తున్న మాన్యువల్ స్కావెంజింగ్!

నగరీకరణ శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరంలో, ఆధునిక గేటెడ్ కమ్యూనిటీల నీడన ఆటవిక సమాజానికి ప్రతీకలైన విషాద ఘటనలు ఇంకా పునరావృతమవుతూనే ఉండటం నాగరిక సమాజానికి సిగ్గుచేటు. నవంబర్ 24న బాచుపల్లిలోని దినేష్ ఆరిక్ అపార్ట్‌మెంట్లలో సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేసేందుకు లోపలికి దిగిన 24–25 సంవత్సరాల  వయస్సున్న ముగ్గురు యువ కార్మికులు విషవాయువుల కారణంగా ఊపిరాడక ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన షణ్ముఖరావు, సురేష్, పవన్ అనే ముగ్గురు యువకులు పొట్టకూటి కోసం నగరానికి వలస వొచ్చి,కనీస రక్షణ కవచాలు లేకుండా మృత్యుకూపంలోకి దిగి విగతజీవులుగా మారడం వ్యవస్థాగత వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనం. ఒకరిని కాపాడే ప్రయత్నంలో మరొకరు ట్యాంకులోకి దిగి ముగ్గురూ ప్రాణాలు వదలడం అత్యంత హృదయవిదారకం. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్ఆర్సీ) సుమోటోగా స్పందించి నివేదిక కోరడం, పోలీసులు సంబంధిత ప్రైవేటు ఏజెన్సీ యజమానిపై నేరపూరిత నరహత్య కింద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే హడావిడి చేయడం కాకుండా, మూలాలను సరిదిద్దాల్సిన అవసరం ఉంది.
దేశంలో ‘మాన్యువల్ స్కావెంజింగ్ నిషేధం, పునరావాస చట్టం-2013’ అమల్లోకి వొచ్చి దశాబ్ద కాలం దాటినా, క్షేత్రస్థాయిలో దాని అమలు కాగితాలకే పరిమితమైంది. ఈ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం, కనీస భద్రతా పరికరాలు, రక్షణ కవచాలు లేకుండా మనుషులను సెప్టిక్ ట్యాంకులు, మురుగు కాలువలలోకి దించడం నాన్-బెయిలబుల్ నేరం. నిబంధనలను ఉల్లంఘించి కార్మికులను ఈ పనులకు నియమిస్తే, మొదటిసారి నేరానికి రెండేళ్ల జైలు శిక్ష లేదా రూ. 2 లక్షల వరకు జరిమానా, రెండోసారి నేరానికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 5 లక్షల జరిమానా విధించే కఠిన నిబంధనలు చట్టంలో ఉన్నాయి. అంతేకాకుండా, ఈ వృత్తిలో ఉన్నవారిని గుర్తించి తక్షణ ఆర్థిక సాయం, నైపుణ్య శిక్షణ, రాయితీ రుణాలు అందించి గౌరవప్రదమైన పునరావాసం కల్పించాలని చట్టం స్పష్టం గా ఉన్నది. అయినప్పటికీ, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాల్లో గుట్టుచప్పుడు కాకుండా కార్మికులను ట్యాంకుల్లోకి దించుతున్నారు. ట్యాంకులలో పేరుకుపోయే మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి విషవాయువులు క్షణాల్లో ప్రాణాలు తీస్తాయని తెలిసినా, కనీసం గ్యాస్ డిటెక్టర్లు, ఆక్సిజన్ మాస్కులు, సేఫ్టీ బెల్టులు వంటివి సమకూర్చకపోవడం కాంట్రాక్టర్ల కర్కశత్వానికి పరాకాష్ఠ.
మరోవైపు, పొట్టకూటి కోసం నగరాలకు వలస వొచ్చే 
అమాయక కార్మికుల నిస్సహాయతను, పేదరికాన్ని ఆసరాగా తీసుకొని ఇటువంటి అమానవీయ పనులను అప్పగించడం అత్యంత హేయమైన చర్య. ఆకలి తీర్చుకోవడానికి ఏ పని చేయడానికైనా సిద్ధపడే కార్మికుల అవసరాన్ని కొందరు కాంట్రాక్టర్లు, యజమానులు తమ లాభాల కోసం వాడుకుంటున్నారు. కనీస అవగాహన లేని కార్మికులకు ప్రాణహాని గురించి వివరించాల్సింది పోయి, వారిని మృత్యుముఖంలోకి నెట్టడం మానవత్వానికే మచ్చ. ఇటువంటి అమానవీయ పనులకు ఎవరినీ నియమించకూడదనే స్పృహ సమాజంలో రావాలి. కేవలం చట్టాలతోనే కాకుండా, సామాన్య ప్రజల్లో, ముఖ్యంగా అపార్ట్‌మెంట్ నివాసితుల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. తమ ఇళ్లలోని మురుగునీటి ట్యాంకులను మనుషులతో శుభ్రం చేయించడం చట్టవిరుద్ధమని, అది ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకునే ప్రమాదకరమైన పని అని ప్రతి పౌరుడూ గుర్తించాలి. పేదరికం ఏ మనిషినీ మృత్యుకూపంలోకి దింపకూడదు; అందుకు సమాజం, ప్రభుత్వం సంయుక్తంగా బాధ్యత వహించాలి.
నేడు మురుగునీటి ట్యాంకులను శుభ్రం చేసేందుకు అత్యాధునిక యంత్రాలు, వాక్యూమ్ ట్యాంకర్లు, రోబోటిక్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఖర్చు తగ్గించుకోవాలనే దురాశతో ప్రైవేటు ఏజెన్సీలు, కాంట్రాక్టర్లు యంత్రాలను కాదని పేద కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కేవలం కాంట్రాక్టర్లనే కాకుండా, పనులను అప్పగించే అపార్ట్‌మెంట్ యాజమాన్య సంఘాలను (ఆర్డబ్ల్యుఏ) కూడా ఈ మరణాలకు బాధ్యులను చేయాలి. తమ ప్రాంగణంలో చట్టవిరుద్ధంగా కార్మికులను ట్యాంకులోకి దించుతున్నప్పుడు నిలువరించాల్సిన బాధ్యత నివాస సంఘాలపై ఉంది. అనుమతి లేని ఏజెన్సీలతో పనులు చేయించుకునే యాజమాన్యాలపైనా కఠిన చర్యలు తీసుకోవాలి. మున్సిపాలిటీలు, పంచాయతీలు తమ పరిధిలో మాన్యువల్ స్కావెంజింగ్ జరగకుండా చూడాలి.
మురుగునీటి శుభ్రతకు తప్పనిసరిగా ఆధునిక యంత్రాలను అందుబాటులో ఉంచడం, ప్రైవేటు ఏజెన్సీలను నియంత్రించడం స్థానిక అధికారుల విధి.
మున్సిపల్ యంత్రాంగం, పోలీసు శాఖ సంయుక్తంగా నగరంలోని ప్రైవేటు సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ ఏజెన్సీలన్నింటినీ రిజిస్టర్ చేసి, వాటిపై నిరంతర నిఘా ఉంచాలి. యంత్రాల ద్వారా మాత్రమే శుభ్రపరిచేలా నిబంధనలను కఠినతరం చేయాలి. అలాగే, బాచుపల్లి ఘటనలో మరణించిన ముగ్గురు యువకుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే రూ.30 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసాతో పాటు, సంబంధిత కాంట్రాక్టర్, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారి ఆస్తులను జప్తు చేసి పరిహారం వసూలు చేయాలి. సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందిన ఈ కాలంలోనూ, తోటి మనిషి మలమూత్రాల ట్యాంకుల్లో ఊపిరాడక చనిపోవడం మన నాగరికతకే మాయని మచ్చ. ఇకనైనా యంత్రాంగం మొద్దునిద్ర వీడి, మరో కార్మికుడి ప్రాణం గాలిలో కలవకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *