- పదేళ్ల సుదీర్ఘ కల సాకారం చేశాం…
- సమ్మక్క సారక్క స్ఫూర్తితో పనిచేస్తూ జిల్లా అభివృద్ధి కోసం కృషి
- మంత్రులు సీతక్క, కొండా సురేఖ
ములుగు జిల్లా అభివృద్ధి కోసం సమ్మక్క సారలమ్మల స్ఫూర్తితో పనిచేస్తామని, మల్లంపల్లి గ్రామ ప్రజల సుదీర్ఘ 10 సంవత్సరాల పోరాట ఫలితంగానే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటు చేశారని పర్యావరణ, అటవీ, దేవాదాయ ధర్మాదాయ శాఖ కొండా సురేఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. మల్లంపల్లి మండలంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో శుక్రవారం, ఎంపీ బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్, అదనపు కలెక్టర్ మహేందర్‌జి, ఆర్డిఓ వెంకటేష్‌తో కలిసి నూతనంగా ఏర్పాటు చేసిన మల్లంపల్లి మండలంలో తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ పోరాటాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సైతం సుదీర్ఘ పోరాటం అనంతరం తెలంగాణ ప్రజల కల సోనియాగాంధీ నెరవేర్చారన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి కోసం మంత్రి సీతక్క తాను సమ్మక్క సారలమ్మ లాగా పనిచేస్తున్నామని తెలిపారు.
ప్రజలు అమాయకులు కారని గతం ప్రభుత్వంలో నాయకులు మోసపురమైన వాగ్దానం ఇవ్వడంతోనే రాష్ట్ర ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టారని అన్నారు. రానున్న రోజుల్లో ములుగు జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ 10 సంవత్సరాల మల్లంపల్లి ప్రజల సుదీర్ఘ పోరాటాన్ని గుర్తించి ముఖ్యమంత్రి మండలం ఏర్పాటు చేశారని, శాసనసభ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో ఇచ్చిన హామీ అని అన్నారు. మల్లంపల్లి గ్రామాల ప్రజల సమష్టి పోరాట ఫలితంగానే మండల ఏర్పాటు జరిగిందని, రానున్న రోజులలో మల్లంపల్లి మండలంలో శాశ్వత ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
నూతన మండల పరిధిలోని ఉమర్ ఖాన్ భూములకు సంబంధించిన విషయంలో జిల్లా కలెక్టర్ తో చర్చించి అర్హులైన పేదలకు భూమి పట్టాలను చేస్తామన్నారు. మండలంలో మార్కెట్ యాడ్ కోసం ఎంపీ ఫండ్ నుంచి 50 లక్షలు కేటాయించాలని మంత్రి సీతక్క ఎంపి బలరాం నాయక్ ను కోరారు. గ్రామసభలపై కొందరు కావాలనే అలజడి సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచందర్, ఎమ్మార్వో విజయభాస్కర్, పిఎసిఎస్ చైర్మన్ బొక్క సత్తిరెడ్డి, మల్లంపల్లి జాక్ చైర్మెన్ గోల్కొండ రాజు పాల్గొన్నారు.





