– ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు
– సీఎం, మంత్రులకు కామన్ పాస్ కొనుగోలు
– ఆటో చార్జీల పెంపుపై సానుకూల నిర్ణయం : మంత్రి పొన్నం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2 : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. మెట్రో, ఆర్టీసీ సేవలకు కామన్ పాస్ అందుబాటులోకి వచ్చింది. ఈ కామన్ పాస్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిలతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎంతో కలిపి 15మంది మంత్రులకు వన్ డే ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్‌ను ఆయన కొనుగోలు చేశారు. ఈ పాస్ ద్వారా శనివారం ఉదయం 10 గంటలకు బేగంపేట నుంచి భట్టి విక్రమార్క, మంత్రులు మెట్రోలో ప్రయాణం చేస్తారని మంత్రి పొన్నం ప్రకటించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ హైదరాబాద్‌లో వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, దీంతో నగరం దశ దిశ మారుతుందని చెప్పారు. హైదరాబాద్ మహా నగరంలో ప్రస్తుతం రూ.52,000 కోట్ల పనులు జరుగుతున్నాయని, ఫేజ్-2లో రూ.38,000 కోట్ల మెట్రో పనులు చేపడుతున్నామని భట్టి చెప్పారు. 366 కి.మిలతో రీజినల్ రింగ్ రోడ్డును, 21 రేడియల్ రోడ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. మూసీ పునర్నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు. 30వేల ఎకరాల్లో భారత్ ప్యూచర్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. మోస్ట్ లివబుల్ సిటీగా హైదారాబాద్‌ను తీర్చిదిద్దుతున్నామన్నారు. హైదారాబాద్‌లో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులే నడిపేందుకు ప్రయత్నిస్తున్నామని, ఆటోలకు రెట్రో ఫిట్‌మెంట్‌ను తీసుకొచ్చామని చెప్పారు.
ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తాం: మంత్రి పొన్నం
ఆర్టీసీకి ప్రభుత్వం నెలకు రూ.300 కోట్లు విడుదల చేస్తున్నదని అదనంగా రూ.50 కోట్లు కలిపి మొత్తం రూ.350 కోట్లు విడుదల చేస్తూ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మంత్రి పొన్నం కోరారు. ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీపై పెరిగిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందికి పొన్నం అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వరకు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతమైతే ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం తగ్గుతాయని చెప్పారు. ఆర్టీసీ, మెట్రో, ఆటో సేవలను సమన్వయం చేసి ప్రజలకు సులభమైన ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఫస్ట్ మైల్-లాస్ట్ మైల్ కనెక్టివిటీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఆర్టీసీ, మెట్రోతోపాటు ఆటో రంగాన్ని కూడా ప్రజా రవాణా వ్యవస్థలో భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. ఆటో డ్రైవర్ల సమస్యలు, జీవనోపాధి, సంక్షేమాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటుం దన్నారు. దాదాపు 12 ఏళ్లుగా పెరగని ఆటో చార్జీల పెంపునకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ప్రజలపై అదనపు భారం పడకుండా, ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగేలా చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం చెప్పారు. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని, ఆర్టీసీ కార్మికుల సంక్షేమంతోపాటు ఆటో కార్మికుల సంక్షేమానికీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. హైదరాబాద్‌లో ఆర్టీసీ, మెట్రో, ఆటో తదితర రవాణా వ్యవస్థలను టెక్నాలజీతో అనుసంధానం చేస్తామన్నారు. ప్రయాణికులకు సులభమైన, సురక్షితమైన, వేగవంతమైన రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మీ టికెట్ యాప్ ద్వారా ఓపెన్ టికెట్.. డిజిటల్ వీక్లీ బస్ పాస్ – రూ.600లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు లాంఛనంగా ప్రారంభించారు.కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌లు పట్నం మహేందర్ రెడ్డి , అద్దంకి దయాకర్, సీఎస్ సంజయ్ జాజు, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి,హైదరాబాద్ మెట్రో ప్రభుత్వ సలహాదారు ఎన్వీఎస్ రెడ్డి, జీహెచ్ ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
అర్బనైజేషన్‌కు అనుగుణంగా ప్రజా రవాణా సర్వీసులు పెరగాలి : మంత్రి వివేక్
హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లో అర్బనైజేషన్‌కు అనుగుణంగా ప్రజా రవాణా సర్వీసులను మరింత పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి అభిప్రాయపడ్డారు. మంత్రి పొన్నం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్ సర్వీసులు గణనీయంగా మెరుగుపడ్డాయని కొనియాడారు. నగరంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టడం, మైనర్లకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీని మరింత బలోపేతం చేసే అవకాశం ఏర్పడిందన్నారు. మెట్రో రైలు-ఆర్టీసీ బస్సుల మధ్య మెరుగైన కనెక్టివిటీతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలుగుతుందని చెప్పారు. ప్రస్తుతం మెట్రోలో ప్రయాణిస్తున్న వారి సంఖ్యను 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచే దిశగా చర్యలు అవసరమన్నారు. మెట్రో, ఆర్టీసీ సమన్వయంతో పనిచేస్తే హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చునని, మెట్రో స్టేషన్లకు ఆర్టీసీ బస్సుల కనెక్టివిటీ పెంచితే ప్రయాణికులకు చివరి మైలు ప్రయాణం మరింత సులభం అవుతుందని తెలిపారు. ఆటో డ్రైవర్ల సమస్యలు, చార్జీల అంశంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని, ఆటో డ్రైవర్లతో చర్చించి వారికి న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ-మెట్రో సమన్వయంతో తీసుకొచ్చిన ఈ కార్యక్రమం ప్రజా రవాణా రంగంలో మరో ముందడుగు అంటూ ఈ ప్రజా ప్రయోజన కార్యక్రమాన్ని చేపట్టిన మంత్రి పొన్నంకు వివేక్ అభినందనలు తెలిపారు.
అందుబాటులోకి ఆర్టీసీ, మెట్రో కామన్ పాస్ 
‘ఎక్స్’ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌లో ఆర్టీసీ, మెట్రో కామన్ ట్రావెల్ పాస్ శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. అన్ని మెట్రో స్టేషన్లలో ఈ పాస్ జారీ చేస్తారని వెల్లడించారు. ఈ పాస్‌తో ఓఆరఆర్ పరిధిలోని సిటీ బస్సులు, మెట్రోలో ప్రయాణించవచ్చని ‘ఎక్స్‌లో పోస్టు పెట్టారు. బస్సు- మెట్రోకు ఇక రెండో టికెట్ అవసరం లేదని తెలిపారు. 25 లక్షలకుపైగా బస్సు ప్రయాణికులకు ఈ కామన్ పాస్‌తో ప్రయోజనం ఉంటుందని, 4.5 లక్షల మంది మెట్రో ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. మెరుగైన లాస్ట్‌మైల్ కనెక్టివిటీపై తాము ఫోకస్ పెట్టామని, ప్రజా రవాణాను ఏకీకృతం చేసే దిశగా కీలక అడుగు వేశామని తెలిపారు. హైదరాబాద్‌ను ఫాస్టెస్ట్ సిటీస్‌లో ఒకటిగా మార్చడమే ‘క్యూర’ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





