– ఒకే వేదికపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు
– ఊరూ వాడా ఉత్సాహంగా ‘చేయూత’ నూతన పింఛన్ల పంపిణీ
– దాదాపు 3 లక్షల మందికి మంజూరు పత్రాల పంపిణీ పూర్తి
– 4,63,857 మంది కొత్త లబ్ధిదారులకు పింఛన్లు
– 60 శాతం మందికి అందిన మంజూరు పత్రాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 16 : రాష్ట్రవ్యాప్తంగా ‘చేయూత’ నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఊరూ వాడా ఉత్సాహంగా కొనసాగుతోంది. కొత్తగా మంజూరైన 4,63,857 మంది లబ్ధిదారులకు సామాజిక భద్రత కల్పించే ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు దాదాపు మూడు లక్షల మందికి మంజూరు పత్రాల పంపిణీ పూర్తయింది. మొత్తం లబ్ధిదారుల్లో సుమారు 60 శాతం మందికి మంజూరు పత్రాలు అందాయి. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పంపిణీ కార్యక్రమాల్లో అధికార, విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కలిసి పాల్గొంటున్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం అర్హులను గుర్తించడంతో ఎక్కడా అభ్యంతరాలు వ్యక్తం కావడం లేదు. అధికార, విపక్షాలు కలిసి పింఛన్ మంజూరు పత్రాలు అందజేస్తుండటంతో కార్యక్రమాలు సజావుగా కొనసాగుతున్నాయి. ప్రతి ప్రాంతంలో లబ్ధిదారులకు సహాయం అందించేందుకు ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు. సాంకేతిక లేదా ఇతర కారణాలతో ఒకరిద్దరికి పింఛన్లు నిలిచిపోయిన సందర్భాల్లో సమస్యలను అక్కడికక్కడే గుర్తించి అధికారులు వెంటనే పరిష్కరిస్తున్నారు. అవసరమైనచోట ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేసి అర్హతను నిర్ధారించిన అనంతరం పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. 
ములుగులో మంత్రి సీతక్క, హుస్నాబాద్‌లో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలను అందజేశారు. ధర్మపురిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సంగారెడ్డిలో మంత్రి దామోదర్ రాజనర్సింహ, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పరిగిలో ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌లో యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జడ్చర్లలో అనిరుధ్‌రెడ్డి, తుంగతుర్తిలో ఎమ్మెల్యే మందుల సామేలు, జుక్కల్‌లో లక్ష్మీకాంత్‌రావు, ఎల్లారెడ్డిలో మదన్‌మోహన్‌రావు, మక్తల్‌లో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. మేడ్చల్‌లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి పాల్గొనగా ఆలేరులో బీర్ల ఐలయ్య, నర్సాపూర్‌లో మంత్రి వివేక్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు.
పింఛన్ పేదల జీవితాలకు భరోసా : మంత్రి సీతక్క
మంత్రి సీతక్క మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ అందించాలన్నదే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నేత కార్మికులు, గీత కార్మికులు తదితర అర్హులైన వర్గాలకు సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందన్నారు. పింఛన్ అనేది పేదలకు ప్రభుత్వం చేసే సాయం కాదని, వారి జీవితానికి భరోసా అని స్పష్టం చేశారు. ఇప్పటివరకు పింఛన్ అందని అర్హులైన కుటుంబాలను గుర్తించి వారికి కూడా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి చేయూత అందాలి.. ఏ ఒక్క అర్హుడు కూడా సంక్షేమానికి దూరం కాకూడదు అని మంత్రి సీతక్క అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పింఛన్ల మంజూరు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





