– ముగిసిన ప్రస్తుత ఎమ్మెల్సీల పదవీ కాలం
– జనాభా ప్రాతిపదికన సామాజికవర్గాలకు న్యాయం
– రెండింటిలో బీసీలకు ప్రాధాన్యం
– మూడోది ఓసీ లేదా ఎస్సీలకు కేటాయించవచ్చని ప్రచారం
– పోటీలో ఆశావహులెందరో
(మండువ రవీందర్‌రావు)
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పదవీకాలం శనివారంతో పూర్తికావడంతో ఆ కోటాలో ఎమ్మెల్సీల ఎంపిక విషయంలో కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తున్నది. రాష్ట్ర ముఖ్య నేతలు మొదలు దిల్లీ పెద్దలను సంప్రదించి ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేసేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు ప్రారంభించింది. ఒకవిధంగా ఇదిప్పుడు కాంగ్రెస్‌కు కలిసివచ్చిన అవకాశం. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వివిధ సామాజికవర్గాల జనాభాను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేయాలన్నది కాంగ్రెస్ లక్ష్యంగా నిర్ణయించుకుంది. దానికితోడు త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు, సమీపంలో ఉన్న ఖైరతాబాద్ ఉప ఎన్నికను కూడా దృష్టిలోపెట్టుకుని ఎవరైతే పార్టీకి లాభం చేకూర్చగలరన్న విషయాన్ని బేరీజు వేసుకుంటున్నది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ముగ్గురి పదవీకాలం శనివారంతో ముగిసింది. గోరేటి వెంకన్న, బొగ్గారపు దయానంద్, బస్వరాజు సారయ్యలకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో వీడ్కోలు పలికారు, స్పీకర్ గడ్డం ప్రసాద్, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ప్రతిపక్షనేత మధుసూదనాచారి, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు వీరి స్థానాల్లో కొత్తవారిని ఎంపిక చేసే ప్రక్రియను కాంగ్రెస్ చేపట్టింది. ఎవరు అన్న విషయంలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పార్టీలో చర్చ జరుగుతున్నది. పార్టీ అధికారంలోకి రావడానికి తీవ్రంగా కృషి చేసిన పలువురు ఈసారైనా తమకు అవకాశం వస్తుందన్న ఆశతో ఉన్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టి మూడేళ్ళు పూర్తికావస్తున్నది. మిగిలిన రెండేళ్ళ కాలంలో చివరి సంవత్సరమంతా ఎన్నికల సన్నాహానికే సరిపోతుంది. మిగిలేది మద్యలో ఒక సంవత్సరం మాత్రమే. గతంలో పార్టీ ఇచ్చిన హామీల మేరకు వివిధ సామాజిక వర్గాలకు న్యాయం చేయడం ద్వారా రాబేయే ఎన్నికల్లో లాభం పొందాలని కాంగ్రెస్ ఆశిస్తున్నది. అందుకే ఈ మూడు స్థానాల్లో బలమైన సామాజిక వర్గాలకు సంబందించిన బలమైన నాయకులను ఎంపిక చేసుకునేందుకు కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ మొదలు రాష్ట్రంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు బీసీలను ఆకర్షించే ప్రణాళికలు, పథకాల రూపకల్పనలో ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఇటీవల కాలంలో బీసీ నామ జపం చేస్తున్నారు. కానీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ రెండు స్థానాలుకూడా ఆయన రెడ్డి సామాజిక వర్గానికే కేటాయించారు. అది బీసీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. దానినుండి బయటపడేందుకు అన్నట్లుగా గవర్నర్ కోటాలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాలను బీసీలకే కేటాయిస్తానని ముందస్తుగానే మాట ఇచ్చారు. సిరిసిల్ల, రవీంద్ర భారతి సభల్లో బహిరంగంగానే ఈ విషయాన్ని వెల్లడించారు. మూడు స్థానాలు ఖాళీ కాగా పద్మశాలి, ముదిరాజ్, మున్నూరు కాపు సామాజిక వర్గాలకు రెండు స్థానాలను కేటాయిస్తామని కూడా చెప్పారు. రాష్ట్రంలో ఈ మూడు సామాజిక వర్గాల జనాభా ఎక్కువ. రాజకీయంగాకూడా ఈ సామాజిక వర్గాలకు బలమైన నాయకులు ఉన్నారు. ప్రధానంగా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల ఓటర్ల సంఖ్య ఈ సామాజిక వర్గాలకు ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ రెండు స్థానాల విషయంలో ముందస్తుగానే ప్రకటన చేశారు. అయితే ఈ రెండు స్థానాలకు గాను ఆశావహుల సంఖ్యకూడా బాగానే ఉంది. కొండా సురేఖ మంత్రివర్గంనుండి భర్తరఫ్ అయిన తర్వాత ఆ వర్గాలను సంతృప్తి పర్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి పలు పదవుల్లో వారికి ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు. వరంగల్ కాకతీయ డెవలప్‌మెంట్ అథారిటీ(‘కుడా’) చైర్‌పర్సన్ గా గుండు సుధారాణిని నియమించడం అందులో భాగమే. వరంగల్ మున్సిపల్ మేయర్ పదవీ కాలం ముగిసిన సందర్భంలోనే ‘కొండా’ అలజడి సుధారాణికి అవకాశంగా మారింది. కాగా, రాష్ట్ర ఏర్పాటు కోసం తన మంత్రి పదవికి రాజీనామా చేసిన దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తె పవిత్ర వాణికి ఎమ్మెల్సీగా అవకాశమిస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. అలాగే ఈరవత్రి అనిల్ , పున్నా కైలాష్ పేర్లు కూడా వినవస్తున్నాయి. ముదిరాజుల విషయానికొస్తే ఎంకు సన్నిహితుడిగా పేరున్న నీలం మధు పేరు టాప్‌లో ఉన్నట్లు తెలుస్తున్నది. మున్నూరు కాపు సామాజిక వర్గంనుండి ప్రధానంగా సీఎం సన్నిహితుడిగా చెబుతున్న కరీంనగర్ లైబ్రరీ ఛైర్మన్ సత్తు మల్లేశంకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు. వీరితోపాటు ఇతర బీసీ వర్గాలనుంచి కూడా పోటీ వినిపిస్తున్నది. చరణ్‌కౌశిక్ యాదవ్, లోకేశ్‌యాదవ్, చనగాని దయాకర్, నేరెళ్ళ శారద లాంటి అనేక పేర్లు వినవస్తున్నాయి. కాగా, మూడవ ఎమ్మెల్సీ స్థానం విషయంలోనే ఇంకా ముసుగు వీడలేదు. ఇందులో కూడా బీసీలకే ప్రాధాన్యం కల్పిస్తారా? ఎస్సీలకు లేక ఓసీలకు కేటాయిస్తారా అన్న అంశంలో చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఓసీల్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి కేటాయిస్తే హర్కర వేణుగోపాల్‌రావుకు అవకాశముంటుందనుకుంటున్నారు. ఎస్సీలకు కేటాయిస్తే మాజీ ఎంఎల్‌ఏ సంపత్‌కుమార్, దొమ్మాటి సాంబయ్యల పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





