- ఎల్‌నినో ప్రభావం ఉన్నా సరఫరాలో అంతరాయం ఉండొద్దు
– రబీలోనూ రైతులు, అన్ని వర్గాల వినియోగదారులకు నిరంతరాయంగా సరఫరా
- విద్యుత్తు ఉన్నతాధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 16 : ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. విద్యుత్ డిమాండ్ చరిత్రాత్మక గరిష్ఠ స్థాయికి చేరుకున్నా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేయడంలో విద్యుత్ సంస్థలు సమర్థంగా పనిచేస్తున్నాయని అభినందించారు. రానున్న రబీ సీజన్‌లోనూ ఇదే పనితీరును కొనసాగిస్తూ రైతులు, గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు నిరంతరాయంగా విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్‌లో ఇంధన శాఖ ఉన్నతాధికారులు, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులతో విద్యుత్ సరఫరా పరిస్థితిపై సోమవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, సరఫరా నిర్వహణ, మౌలిక సదుపాయాల విస్తరణ, రానున్న రబీ సీజన్‌కు విద్యుత్ సంస్థల సన్నద్ధతపై చర్చించారు. అక్టోబర్ 16న రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 20,018 మెగావాట్లకు చేరుకుని చరిత్రాత్మక గరిష్ఠ స్థాయిని నమోదు చేసిందని గుర్తు చేశారు. వరుసగా రెండో రోజు కూడా 20,003 మెగావాట్ల స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదైనప్పటికీ విద్యుత్ సంస్థలు సమర్థంగా సరఫరా చేశాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏటా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోందని, గత ఏడాది నవంబర్ 16న 8,522 మెగావాట్లుగా ఉన్న గరిష్ఠ డిమాండ్ ఈ ఏడాది అదే తేదీన 12,802 మెగావాట్లకు చేరిందని వివరించారు. ఇందులో టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో 8,859 మెగావాట్లు, ఎన్పీడీసీఎల్ పరిధిలో 3,595 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదైందన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా జల విద్యుత్ ఉత్పత్తిలో సుమారు 4,000 మెగావాట్ల కొరత ఏర్పడినప్పటికీ ఖరీఫ్ లో రైతులతోపాటు అన్ని వర్గాల వినియోగదారులకు ఎలాంటి విద్యుత్ ఇబ్బందులు లేకుండా సరఫరా చేయడం అభినందనీయమన్నారు. ఇదేవిధంగా రబీ సీజన్‌లోనూ విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. మరోవైపు పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా సరఫరా, మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నట్లు అధికారులు వివరించారు. దావూద్‌ఖాన్‌గూడ, బడంగ్‌పేట ప్రాంతాల్లో కొత్తగా నిర్మించిన రెండు 33/11 కేవీ సబ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. వీటి ద్వారా సరూర్‌నగర్ సర్కిల్ పరిధిలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడంతోపాటు సరఫరా నాణ్యత, విశ్వసనీయత మెరుగుపడుతుందని వెల్లడించారు. రబీ సీజన్‌లో దీర్ఘకాలిక పొడి వాతావరణం ఉండే అవకాశాలున్నందున విద్యుత్ డిమాండ్‌లో ఆకస్మిక పెరుగుదల సంభవించే పరిస్థితులను ముందుగానే అంచనా వేయాలని డిప్యూటీ సీఎం సూచించారు. డిమాండ్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన విద్యుత్‌ను సమకూర్చుకోవాలని, ఏ ఒక్క వర్గం వినియోగదారుడికీ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి.పాటిల్, డైరెక్టర్లు శివాజీ, చక్రపాణి, నరసింహ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





