– ‘స్వచ్ఛతా హి సేవా’లో పాల్గొన్న రామచందర్ రావు
– మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు ఘన నివాళులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2 : పరిశుభ్రత అనేది ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడూ ఇందులో భాగస్వామి కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆ మహనీయుల చిత్రపటాలకు శుక్రవారం పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సికింద్రాబాద్ చిలకలగూడ పరిధిలో నిర్వహించిన స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా చేపట్టిన అతిపెద్ద కార్యక్రమాల్లో ‘స్వచ్ఛ భారత్’ ముఖ్యమైనదని గుర్తు చేశారు. పరిశుభ్రమైన సమాజం ఉండాలన్నది గాంధీజీ జీవితాశయమని, ఆ ఆశయాన్ని నిజం చేస్తూ ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. మన ఇళ్లతోపాటు వీధులు, ఊళ్లను కూడా శుభ్రం గా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలన్నారు. మనమందరం కలిసికట్టుగా చేసే ఈ చిన్న ప్రయత్నాలతోనే మన దేశం మరింత పరిశుభ్రంగా, ఆరోగ్యంగా, అందంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీకి, జై జవాన్ – జై కిసాన్ నినాదంతో దేశాన్ని నడిపించిన మహనీయుడు లాల్ బహదూర్ శాస్త్రికి తన హృదయపూర్వక నివాళులర్పిస్తున్నట్లు రామచందర్‌రావు తెలిపారు.
సీనియర్ సిటిజన్లు సమాజానికి పెద్ద బలం
ఎన్నో ఏళ్లుగా సంపాదించిన తెలివితేటలు, అనుభవం వల్ల సీనియర్ సిటిజన్లు సమాజానికి ఒక గొప్ప బలం, మంచి ఆస్తి అని రామచందర్ రావు అన్నారు. దోమలగూడలోని ఏ.వి. కాలేజీలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన 23వ సీనియర్ సిటిజన్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిటైర్మెంట్ అంటే సమాజం నుంచి తప్పుకోవడం కాదు.. ఏ రంగంలో పనిచేసినా దశాబ్దాలపాటు సంపాదించిన అనుభవానికి రిటైర్మెంట్ ఉండదు.. ఆ అనుభవాన్ని యువతరంతో పంచుకోవాలి., సమాజానికి తిరిగి ఇవ్వాలి అన్నారు. కుటుంబాలకు, సమాజానికి, దేశానికి సీనియర్ సిటిజన్లు ఎప్పుడూ మంచి దారి చూపే మార్గదర్శకులుగా ఉంటారని చెప్పారు. ప్రజలకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అటల్ పెన్షన్ యోజన వంటివాటిని ఆయన గుర్తు చేశారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని విస్తరించడం వల్ల పేద, ధనిక అనే తేడా లేకుండా 70 ఏళ్లు దాటిన ప్రతి సీనియర్ సిటిజన్‌కు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య బీమా అందుతోందని తెలిపారు. ప్రధాని మోదీ ఎప్పుడూ సీనియర్ సిటిజన్ల గౌరవానికి, భద్రతకు పెద్దపీట వేస్తున్నారని, దేశ ప్రగతిలో వాళ్లు కూడా చురుగ్గా పాల్గొనేలా చూస్తున్నారని అన్నారు. మన కుటుంబాలకు పెద్దలు ఎప్పుడూ దారి చూపే శక్తిగా నిలిచారంటూ ఈరోజు మన సంస్కృతి, విలువల కోసమే కాక పరిశుభ్రమైన, పచ్చని భారత నిర్మాణంలో కూడా సమాజానికి మీ మార్గదర్శకత్వం ఎంతో అవసరం అన్నారు. మీ అనుభవం కొత్త తరానికి స్ఫూర్తినిస్తుంది.. అందరం కలిసి ఆరోగ్యవంతమైన, బలమైన దేశాన్ని నిర్మించుకుందాం అని రామచందర్ రావు పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





