యాదాద్రి ఆలయ ధర్మకర్తల బోర్డు ఏర్పాటు హర్షణీయం

వేములవాడకు కూడా ట్రస్ట్ ‌బోర్డు ఉండాలి
బోర్డులో గిరిజన సభ్యుడిని నియమించాలి
యాదాద్రిలో ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజ్‌ ‌నిర్మించాలి
ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్‌ ‌రావు సూచనలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 1  యాదాద్రి దేవాలయానికి  ధర్మకర్తల బోర్డు కోసం బిల్లును ప్రవేశపెట్టడాన్ని  అభినందిస్తున్నానని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. అయితే ఈ బిల్లులో కొన్ని సూచనలు చేయాలన్నారు.అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ..  తెలంగాణ ఇలవేల్పు అయిన యాదాద్రి లక్ష్మీనరసింహ దేవాలయాన్ని  మాజీ సీఎం  కేసీఆర్‌   అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్మించారు. ఈ దేశంలో కొందరు రాజకీయాల కోసం దేవుడిని ఉపయోగించుకుంటారు. కెసిఆర్‌ ఈ ‌దేవాలయ నిర్మాణాన్ని ఎక్కడా కూడా రాజకీయం కోసమో ప్రచారం కోసమో వాడుకోలేదు. బాధ్యతతో, భక్తితో నిర్మించారు. దాదాపు రూ.2000 కోట్లతో యాదాద్రి దేవాలయాన్ని నిర్మించారు. వెయ్యి సంవత్సరాల కోసం ఆలోచించి దేవాలయాన్ని అభివృద్ధి చేశారు రోజుకు 50 వేల మంది భక్తులు ఇప్పుడు వొస్తున్నారు. భవిష్యత్తులో రోజుకు లక్ష మంది భక్తులు వొచ్చే అవకాశం ఉంటుంది. యాదాద్రిలో ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజ్‌ ‌ని నిర్మిస్తే అక్కడికొచ్చే భక్తుల ఆరోగ్య సౌకర్యానికి కూడా ఉపయోగపడుతుందని మేము భావించాం. ఎయిమ్స్ ‌మెడికల్‌ ‌కాలేజ్‌ ‌బీబీనగర్‌ ‌వద్ద ఉంటుంది. యాదాద్రి వద్ద మరో ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజ్‌ ఏర్పాటు చేస్తే వొచ్చే భక్తులకు ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేయాలి. కెసిఆర్‌ ‌నాయకత్వంలో ప్రశాంత్‌ ‌రెడ్డి ఎంతో కష్టపడ్డారు. అక్కడ నిర్మించిన కోనేరులో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను నింపాం. పోచమ్మ సాగర్‌ ‌నుంచి గంధమల్ల కెనాల్‌ ‌ద్వారా కోనేరులోకి గోదావరి జలాలను తీసుకొచ్చిన గొప్ప అనుభూతి కూడా మాకుంది.

దేవాలయ మండలిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉండాలి
యాదాద్రి దేవాలయ మండలిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని కూడా విధిగా పెడితే బాగుంటుందని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు సూచించారు. . మన రాష్ట్ర జనాభాలో 11% జనాభా గిరిజనులు ఉంటారు కాబట్టి గిరిజన సభ్యుణ్ణి కూడా ఈ బోర్డులో పెట్టేట్లు బిల్లును సవరించాలని కోరారు. ధర్మకర్తల బోర్డు అని బిల్లులో ఉంది. తిరుపతిలో ధర్మకర్తల మండలి అని ఉంటుంది. బోర్డు అనే పదం కాకుండా ధర్మకర్తల మండలిగా మార్చాలి. తిరుపతిలో ఈవో, జేఈవో జీతాలు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే ఇస్తారు. దేవుడు సొమ్ము నుంచి జీతం తీసుకోవడం అంటే దేవుడి సొమ్ము జీతంగా తీసుకుంటున్నామని ఎంతో భక్తిశ్రద్ధలతో పనిచేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా హుండీ డబ్బులతో ఈవో, చీఫ్‌ అకౌంట్‌ ఆఫీసర్‌ ‌కు జీతం ఇవ్వాలి. జీర్ణ దేవాలయాల పునరుద్ధరణ కోసం దేవాలయానికి వచ్చే డబ్బుల నుంచి ఖర్చు చేయడానికి ఓ ట్రస్ట్ ‌ను ఏర్పాటు చేసే వెసలుబాటు కల్పించాలి. 100 కోట్లకు పైగా ఆదాయం ఉన్న దేవాలయాలకు ట్రస్ట్ ‌బోర్డ్ ఏర్పాటు చేసే వెసులుబాటును కల్పించామని బిల్లులో చెప్పారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడకు రూ.127 కోట్లకుపైగా ఆదాయం వస్తున్నది. అదేవిధంగా వేములవాడకు కూడా ట్రస్ట్ ‌బోర్డు ఏర్పాటు చేయాలి. యాదాద్రి దేవాలయం ఇంత అద్భుతంగా అభివృద్ధి జరిగిందంటే అది కేసీఆర్‌ ‌కృషికి నిదర్శనం. దేవాలయానికి పూర్వ వైభవం తెచ్చి పురోగమనం వైపు తీసుకొని వెళ్ళాము.

దురదృష్టం ఏమిటంటే 15 నెలల కాంగ్రెస్‌ ‌పాలనలో దేవాలయాల అభివృద్ధి పూర్తిగా తిరోగమనం పట్టింది. ఆర్థిక శాఖ నుంచి దేవాదాయ శాఖకు నిధులు విడుదల కావడం లేదు. దేవాలయాల నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి కోసం వాడుకున్న చరిత్ర రాష్ట్రంలో ఉంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులను దేవాలయాలకు ఇచ్చిన చరిత్ర లేదు. కానీ మొట్టమొదటిసారి కేసీఆర్‌ ‌రాష్ట్ర ప్రభుత్వ నిధులతో దేవాలయాల నిర్మాణం చేపట్టారు. దేవుడు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటే రాష్ట్ర ప్రజలు బాగుంటారని నమ్మి దేవాలయాల అభివృద్ధి చేపట్టారు. సిద్దిపేట నియోజకవర్గం నుంచి నా డబ్బులతో కూడా కలుపుకొని రెండు కిలోల బంగారాన్ని భక్తులతో కలసి వెళ్లి దేవాలయానికి సమర్పించాం. కెసిఆర్‌ ఒక కేజీ 116 గ్రాములు ఇచ్చారు. మా సొంత డబ్బులను కూడా దేవాలయానికి ఇచ్చాం. బాసర దేవాలయానికి 50 కోట్లు, భద్రాద్రి రామాలయానికి 50 కోట్లు, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి 50 కోట్లు, వేములవాడ రాజరాజేశ్వర దేవాలయాన్ని 70 కోట్లతో అభివృద్ధి చేశాం. అదేవిధంగా కాలేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాలయానికి 30 కోట్లు, కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి రూ.600 కోట్లతో అభివృద్ధి కోసం ప్రణాళికలు చేసాం.

ఈ రెండిటిని ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం. కామన్‌ ‌గుడ్‌ ‌ఫండ్‌ ‌కింద చాలా దేవాలయాలను రాష్ట్రంలో అభివృద్ధి చేశాం. ప్రతి సంవత్సరం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే దేవాలయాలకు 50 కోట్ల రూపాయలు బడ్జెట్లో నిధులు ఇచ్చాం. 15 నెలల్లో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా దేవాలయాలకు విడుదల చేయలేదు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు జీతాల కోసం పూజార్లు రోడ్డుపై ధర్నా చేశారు. మొట్టమొదటిసారిగా కేసీఆర్‌ ‌చట్టాన్ని సవరించి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ‌కింద జీతాలను ప్రభుత్వం నుండి ఇచ్చాం. దీప దూప నైవేద్యం కోసం కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం దేవాలయాలకు రూ.2000 ఇచ్చేది. కెసిఆర్‌ ‌రూ.10 వేలకు పెంచారు. కాంగ్రెస్‌ ‌పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 12 వేల రూపాయలు దేవాలయ దీప దీప నైవేద్యాలకు ఇస్తామని హామీ ఇచ్చారు.

రూ.12000 దేవుడెరుగు కానీ రెండు నెలలుగా ఉన్న పదివేలను కూడా ఇవ్వడం లేదు. సమ్మక్క సారక్క దేవాలయానికి 100 కోట్లు నిర్వహణకు ఇచ్చాం. పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం 100 కోట్లు కేసీఆర్‌ ‌ప్రభుత్వం కేటాయించేది. బ్రాహ్మణ సంక్షేమ నిధిని 100 కోట్లతో ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత బ్రాహ్మణ పరిషత్‌ ఉన్నదా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాదులో 10 కోట్ల రూపాయలతోని బ్రాహ్మణ సదన్‌ ‌ను నిర్మించాం. రాష్ట్రంలో సూర్యాపేట, మధిర, ఖమ్మం నియోజకవర్గాల్లో బ్రాహ్మణ సదన్‌ ‌పనులు ఆగిపోయాయి. వాటిని తిరిగి ప్రారంభించాలి. బ్రాహ్మణ పేద విద్యార్థులు విదేశీ విద్యా పథకం కింద 300 మంది విదేశాల్లో చదువుతున్నారు. 300 మంది విద్యార్థులకు 30 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నయి. వాటిని వెంటనే విడుదల చేయాలని హరీష్‌ ‌రావు డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *