కోర్టు తలుపులు మూసింది కానీ..తేల్చేది ప్రజాకోర్టులోనే.!?

“కోర్టు తీర్పు ఒక అధ్యాయానికి ముగింపు పలికింది అంతే. ఇక రాజకీయంగా మిగిలింది ప్రజాకోర్టుఅన్నది ప్రధాన పార్టీలు మర్చిపోవద్దు. అక్కడ కాంగ్రెస్ ముందున్నది కేవలం ఒక ఉపఎన్నికను ఎదుర్కోవడం కాదు,తమ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందని, రాజ్యాంగ సంస్థలను గౌరవిస్తోందని, ప్రజల తీర్పును తలవంచి స్వీకరిస్తోందని నిరూపించుకునే అవకాశం దక్కింది.రాజకీయాల్లో తాత్కాలిక సంఖ్యాబలం కంటే ప్రజల విశ్వాసమే శాశ్వత బలం..”
రామ కిష్టయ్య సంగన భట్ల
సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్…మొబైల్:944059549

తెలంగాణ రాజకీయాల్లో పార్టీ మార్పుల వ్యవహారం మరోసారి రాజ్యాంగం గడప దాటింది. ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడం రాజకీయ పిరాయింపులపై కీలక న్యాయ సందేశంగా మారింది. 2023లో బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచిన నాగేందర్ 2024లో కాంగ్రెస్‌లో చేరి, కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ వ్యవహారంపై వచ్చిన అనర్హత పిటిషన్లలో హైకోర్టు ఆయనను 2024 ఏప్రిల్ 23 నుంచి అనర్హుడిగా ప్రకటించగా, సెప్టెంబర్ 24, 2026న సుప్రీంకోర్టు ఆ నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి కారణం లేదని స్పష్టం చేసింది.

ఇది కేవలం దానం నాగేందర్ వ్యక్తిగత రాజకీయ వ్యవహారం కాదు. ప్రజలు ఒక పార్టీ గుర్తుపై ఇచ్చిన వోటును మరో పార్టీ రాజకీయ ప్రయోజనానికి ఉపయోగించుకోవచ్చా? అనే మౌలిక ప్రజాస్వామ్య ప్రశ్న. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(2) రాష్ట్ర శాసనసభ సభ్యుడు పదో షెడ్యూల్ కింద అనర్హుడైతే సభ్యత్వానికి అనర్హత వర్తిస్తుందని చెబుతోంది. పదో షెడ్యూల్‌లోని పారా 2(1)(a) ప్రకారం ఒక రాజకీయ పార్టీకి చెందిన సభ్యుడు స్వచ్ఛందంగా ఆ పార్టీ సభ్యత్వాన్ని వదిలిపెడితే అనర్హతకు గురవుతాడు.అంటే ఇది కాంగ్రెస్ రూపొందించిన నియమం కాదు. ఇది బీఆర్‌ఎస్ రూపొందించిన నియమం కాదు.ఇది ఏ ముఖ్యమంత్రి వ్యక్తిగత నిర్ణయం కూడా కాదు.ఇది భారత రాజ్యాంగం నిర్దేశించిన వ్యవస్థ.అందువల్ల దానం నాగేందర్ వ్యవహారంలో కోర్టు తీర్పును కేవలం కాంగ్రెస్‌కు వ్యతిరేకమైన తీర్పుగా చూడటం రాజ్యాంగపరమైన వాస్తవాన్ని కుదించడం అవుతుంది.

 ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై రాజకీయ విమర్శలు రావడం సహజం. ఎందుకంటే నాగేందర్ కాంగ్రెస్‌లో చేరిన సమయంలో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, తరువాత ముఖ్యమంత్రిగా ఉన్నారు.అయితే ఇక్కడ ఒక కీలకమైన తేడాను గుర్తించాలి.పార్టీలో చేరడం ఒక రాజకీయ నిర్ణయం.అనర్హత నిర్ణయించడం ఒక రాజ్యాంగ ప్రక్రియ.ఆ నిర్ణయాన్ని సమీక్షించడం న్యాయ ప్రక్రియ.ఈ మూడు వ్యవస్థలను ఒకటిగా చూడకూడదు. స్పీకర్ నిర్ణయం తర్వాత హైకోర్టు జోక్యం చేసుకుంది. ఆ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చివరకు సుప్రీంకోర్టు కూడా హైకోర్టు నిర్ణయంలో జోక్యం చేసుకోలేదు.

అంటే చివరి మాటను రాజకీయ అధికారం కాకుండా రాజ్యాంగ వ్యవస్థే చెప్పింది.ఇదే అంశం రేవంత్‌రెడ్డికి రాజకీయంగా ఒక రక్షణ వాదనను కూడా ఇస్తుంది.“ ముఖ్యమంత్రి కాదు… రాజ్యాంగమే తుది నిర్ణయాధికారి ”రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని సమర్థించే ప్రధాన వాదన ఇదే కావచ్చు. ఒకవేళ ప్రభుత్వం కోర్టు తీర్పును గౌరవించి, ఖాలీ అయిన స్థానానికి రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం ఉపఎన్నికకు వెళ్లి, ప్రజల తీర్పును స్వీకరిస్తే, అది ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల గౌరవంగా పరిగణించవచ్చు. అంతేకాదు, దానం నాగేందర్‌పై అనర్హత నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది కాదు. తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది, దానిపై సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోలేదు. అందువల్ల రేవంత్‌పై మొత్తం న్యాయపరమైన బాధ్యతను మోపడం వాస్తవ పరిస్థితిని పూర్తిగా ప్రతిబింబించదు.

 1985లో రాజ్యాంగంలోని 52వ సవరణ ద్వారా పదో షెడ్యూల్ వచ్చింది. దాని ఉద్దేశ్యం రాజకీయ పిరాయింపులను నియంత్రించడం.కానీ దశాబ్దాలుగా భారత రాజకీయాల్లో పార్టీ మార్పులు కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే ప్రతి రాజకీయ పార్టీకి ఒకే ప్రశ్న వర్తించాలి “మీ పార్టీకి ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఒక న్యాయం… మీ పార్టీ నుంచి ఎమ్మెల్యే వెళ్లినప్పుడు మరో న్యాయమా?” ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలే ప్రజల్లో రాజకీయ వ్యవస్థపై అనుమానాలను పెంచుతాయి.కాబట్టి దానం నాగేందర్ కేసు కాంగ్రెస్‌కు మాత్రమే కాదు, తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలకు ఒక రాజ్యాంగ పాఠం. ఇదేఅదనుగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఒక స్పష్టమైన రాజకీయ,రాజ్యాంగ వైఖరిని ప్రకటించాల్సిన అవసరం ఉంది.ఇప్పటికే కోర్టు ఒక ఎమ్మెల్యే సభ్యత్వంపై నిర్ణయం ఇచ్చింది.

ఇక ప్రభుత్వం చేయాల్సింది కోర్టు తీర్పును గౌరవించడం, ఎన్నికల ప్రక్రియకు సహకరించడం, ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వారిని గౌరవించడం. తప్ప “అధికారం కోసం రాజ్యాంగాన్ని వంచించలేదు.రాజ్యాంగం చెప్పిన మార్గంలోనే ప్రభుత్వం నడిచింది.” అదే ఆయనకు రాజకీయంగా రక్షణ కల్పించే బలమైన వాదన. ప్రజాకోర్టే అసలు కోర్టు అనే మరో విషయం మరువకూడదు.కోర్టు సభ్యత్వంపై తీర్పు చెప్పగలదు.కానీ ఎమ్మెల్యేగా ఎవరు ఉండాలో తుది రాజకీయ నిర్ణయం ప్రజల వోటుదే .  నాగేందర్ అనర్హతతో ఖైరతాబాద్ స్థానం ఖాలీ అయిన నేపథ్యంలో తదుపరి ఎన్నిక ప్రజలకు కొత్త అవకాశం ఇస్తుంది. ఆ ఎన్నికను ఎవరి వ్యక్తిగత గెలుపు, ఓటమిగా కాకుండా, ప్రజల తీర్పును గౌరవించే ప్రజాస్వామ్య ప్రక్రియగా చూడాలి.

 దానం నాగేందర్ వ్యవహారం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బందికరమైన ప్రశ్నలను లేవనెత్తినా, అదే సమయంలో ఒక అవకాశాన్ని కూడా ఇస్తోంది. “ఇకపై పిరాయింపుల విషయంలో రాజ్యాంగాన్ని గౌరవించే ప్రమాణం పాటిస్తాం” అని ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని తీసుకుంటే, ఈ పరిణామాన్ని రాజకీయ నష్టంగా కాకుండా ప్రజాస్వామ్య పాఠంగా మలచవచ్చు.రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం తాత్కాలిక సంఖ్యాబలాన్ని పెంచవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో దీర్ఘకాలిక విశ్వాసాన్ని నిలబెట్టేది మాత్రం ప్రజల వోటుకు ఇచ్చే గౌరవం. దానం నాగేందర్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఒక విషయాన్ని స్పష్టం చేసింది,పదో షెడ్యూల్, ఆర్టికల్ 191(2) కింద వచ్చే అనర్హతను రాజకీయ సౌలభ్యం పేరుతో పక్కన పెట్టలేం.కానీ ఈ కథ ఇక్కడితో ముగియదు, ఈ ప్రశ్నలకు ప్రభుత్వం ఇచ్చే ఆచరణాత్మక సమాధానమే రేవంత్‌రెడ్డి రాజకీయ పరువును నిర్ణయిస్తుంది.

కోర్టు తీర్పు ఒక అధ్యాయానికి ముగింపు పలికింది అంతే. ఇక రాజకీయంగా మిగిలింది ప్రజాకోర్టు అన్నది ప్రధాన పార్టీలు మర్చిపోవద్దు. అక్కడ కాంగ్రెస్ ముందున్నది కేవలం ఒక ఉపఎన్నికను ఎదుర్కోవడం కాదు,తమ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందని, రాజ్యాంగ సంస్థలను గౌరవిస్తోందని, ప్రజల తీర్పును తలవంచి స్వీకరిస్తోందని నిరూపించుకునే అవకాశం దక్కింది.రాజకీయాల్లో తాత్కాలిక సంఖ్యాబలం కంటే ప్రజల విశ్వాసమే శాశ్వత బలం. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకునే దిశగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తే, ఒక సవాలుగా కాకుండా తన ప్రజాస్వామ్య నిబద్ధతను చాటుకునే అవకాశంతో పాటు ప్రజల తీర్పును గౌరవిస్తూ, రాజ్యాంగాన్ని ముందుపెట్టి, పాలనలో తన పనితీరును ప్రజల ముందుంచే కాంగ్రెస్‌కు తన వాదనను బలంగా వినిపించి విపక్షాలను చావుదెబ్బ కొట్టేందుకు ప్రజాక్షేత్రం అనువైనదిగా భావిస్తున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై వచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకొని, వేటుపడక ముందే  ఇదే  అదనుగా బలంగా ప్రజల్లో ఉన్న ఒక్కరిద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి, ప్రజాక్షేత్రానికి పోయి తేల్చుకునేందుకు సిద్ధమైనట్టు గుసగుసలు వినపడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *