
పండుగల ఆనందం పర్యావరణానికి భారంగా మారకూడదు. సంప్రదాయాలను కాపాడుకుంటూనే ప్రకృతిని పరిరక్షించుకోవడం నేటి తరం బాధ్యత. పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక ఐక్యతకు ప్రతీకలు. అవి మన జీవితాల్లో ఆనందాన్ని, ఆధ్యాత్మికతను, పరస్పర అనుబంధాన్ని పెంచాలి. కానీ పండుగల పేరుతో ప్రకృతిని నాశనం చేస్తూ, ప్రజల జీవితాలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతూ, పర్యావరణాన్ని కలుషితం చేయడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. పండుగల ఆనందం ప్రకృతిని పెంపొందించేదిగా ఉండాలి తప్ప, పర్యావరణాన్ని బ్రష్టుపట్టించేదిగా ఉండకూడదు.నేడు వాతావరణ మార్పుల ప్రభావం ప్రజల జీవితాలపై తీవ్రంగా పడుతోంది.
ఎల్నినో వంటి వాతావరణ పరిణామాల కారణంగా కరవు పరిస్థితులు ఏర్పడి, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూల ధరలు సామాన్యుడికి అందనంత స్థాయికి చేరుతున్నాయి. అనేక ప్రాంతాల్లో బోర్లు ఎండిపోతున్నాయి. ఇళ్లకు సరిపడా నీరు అందడం లేదు. నల్లా నీటి సరఫరా తగ్గడంతో వేలాది కుటుంబాలు ట్యాంకర్ నీటిపై ఆధారపడాల్సి వస్తోంది. ఒక సాధారణ కుటుంబం నెలకు నీటి కోసమే గణనీయమైన మొత్తాన్ని ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నీరు, విద్యుత్, సహజ వనరుల వినియోగంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు, పౌరసంఘాలు, పర్యావరణవేత్తలు, ప్రచార మాధ్యమాలు పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ, ఆ సందేశాలను పెడచెవిన పెట్టడం ఆందోళన కలిగిస్తోంది.పండుగల సందర్భంగా భారీ విగ్రహాల ఏర్పాటు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వంటి పర్యావరణానికి హానికరమైన పదార్థాల వినియోగం, నిమజ్జనానికి తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడం వంటి అంశాలు ప్రతి సంవత్సరం సమస్యలను సృష్టిస్తున్నాయి.

ప్రజల భక్తి, విశ్వాసాలను గౌరవిస్తూనే, వాటి ఆచరణ ప్రకృతికి హాని కలిగించకుండా ఉండే మార్గాలను అనుసరించడం అవసరం. పర్యావరణహితమైన విగ్రహాలు, కృత్రిమ నిమజ్జన కుంటలు, పరిమిత విద్యుత్ వినియోగం వంటి చర్యలను సామాజిక బాధ్యతగా స్వీకరించాలి.ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో మరింత బాధ్యతగా వ్యవహరించాలి. ఒకవైపు విద్యుత్, నీటి పొదుపు గురించి ప్రజలకు సూచనలు చేస్తూ, మరోవైపు పండుగల సందర్భంగా విచ్చలవిడిగా వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడం సరైన విధానం కాదు. ప్రజల విశ్వాసాలకు ప్రభుత్వ సహకారం అవసరమే అయినప్పటికీ, ఆ సహకారం పర్యావరణ పరిరక్షణకు విరుద్ధంగా ఉండకూడదు.మరోవైపు పండుగల అలంకరణ కోసం పచ్చని అరటి చెట్లను, ఇతర మొక్కలను పెద్ద ఎత్తున నరికివేయడం కూడా పునరాలోచించాల్సిన విషయం. జీవితంలో ఒక్క మొక్క కూడా నాటని వారు పండుగల పేరుతో పచ్చని చెట్లను నరికి అలంకరణకు ఉపయోగించడం ఎంతవరకు సమంజసం? ప్రతి పచ్చని చెట్టు మనకు ప్రాణవాయువును అందించే ప్రకృతి సంపద అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఒక రోజు అలంకరణ కోసం సంవత్సరాల పాటు పెరిగిన చెట్టును నరికివేయడం కన్నా, పునర్వినియోగించదగిన అలంకరణ సామగ్రిని ఉపయోగించడం మంచిది.

టపాసుల వినియోగం కూడా మరో పెద్ద సమస్యగా మారుతోంది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి కొన్ని గంటల వినోదం కోసం గాలి, నీటి, శబ్ద కాలుష్యాన్ని పెంచడం విజ్ఞత కాదేమో ఆలోచించాలి. పండుగ మరుసటి ఉదయం వీధులు, కూడళ్లు, ఇంటి పరిసరాలు కాలిపోయిన చిచ్చుబుడ్లు, భూచక్రాలు, రాకెట్ల అవశేషాలు, కాగితాలు, ప్లాస్టిక్ చెత్తతో నిండిపోతున్నాయి. పండుగ ఆనందం ముగిసిన తరువాత సమాజానికి మిగిలేది కాలుష్యం, చెత్త, అదనపు శుభ్రత భారం మాత్రమే అయితే మనం అనుసరిస్తున్న విధానాలను పునఃపరిశీలించాల్సిన సమయం ఆసన్నమైంది.పండుగలను ఆపాలని ఎవరూ చెప్పడం లేదు. పండుగలను మరింత బాధ్యతతో, ప్రకృతి స్నేహపూర్వకంగా జరుపుకోవాలని మాత్రమే కోరుతున్నారు. భక్తి పేరుతో ప్రకృతిని బాధించడం, ఆనందం పేరుతో కాలుష్యాన్ని పెంచడం, సంప్రదాయం పేరుతో సహజ వనరులను వృథా చేయడం మన భవిష్యత్ తరాలకు అన్యాయం చేయడమే.

పచ్చని చెట్లను నరికే ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి—“నేను ప్రకృతికి ఏమి ఇచ్చాను?” అని. పండుగ సందర్భంగా ఒక చెట్టును నరికే బదులు పది మొక్కలు నాటే సంప్రదాయాన్ని ఎందుకు ప్రారంభించకూడదు? అధిక విద్యుత్ వినియోగానికి బదులు పొదుపు దీపాలంకరణను, కాలుష్యకర టపాసులకు బదులు సాంస్కృతిక కార్యక్రమాలను, ప్లాస్టిక్ అలంకరణలకు బదులు పునర్వినియోగ పదార్థాలను ఎందుకు ప్రోత్సహించకూడదు?మన భవిష్యత్తు సురక్షితంగా ఉండాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. నీటిని పొదుపు చేయాలి. విద్యుత్ వినియోగాన్ని నియంత్రించాలి. చెట్లను కాపాడాలి. చెత్తను తగ్గించాలి. పండుగలను పర్యావరణహితంగా మార్చాలి.ప్రకృతిని కాపాడుకుంటేనే పండుగల ఆనందం తరతరాలకు నిలుస్తుంది. లేకపోతే, మనం జరుపుకునే ప్రతి పండుగ వెనుక ప్రకృతికి మరొక గాయం మిగిలిపోతుంది.పండుగలు మనుషుల మధ్య వెలుగులు నింపాలి… ప్రకృతిపై చీకట్లు కమ్మకూడదు.





