కవనకదనాన్ని సమఉజ్జీగా నిలిపిన ‘విద్యార్థి’

  “విద్యార్థి జీవితమంతా సమరమే. కవితాకదనరంగాలను అయన సమఉజ్జీగా నడిపారనడంలో అతిశయోక్తిలేదు. ఒకపక్కన దేశ రక్షణలో సాహాసోపేత చర్యలుచేస్తూనే మరోపక్క హృదయాలను కదిలించే కవితలల్లడం ఆయనకే చెల్లింది. స్థానిక మొదలు అంతర్జాతీయ సమస్యలను, నేలనుండి ఆకాశం వరకు అనేక సన్నివేశాలను తీసుకుని లోతైన అధ్యయనంతో కవితలను చెక్కడంలో ఆయన నేర్పరి. అందుకే ఆయన్ను అభిమానించేవారు ‘యుద్ద కవి, సైనిక కవిగా, ఖండాంతర కవిగా, విశ్వకవిగా, నిరాడంబర కవిగా, స్తానిక విశ్వమానవుడు, గ్లోబల్‌పోయెట్‌  ‌లాంటి బిరుదులతో ప్రశంసిస్తున్నారు..”   

‘‘విద్యార్థి హై హమ్‌ ‌దోనోభీ /  ఇస్‌ ‌రిస్తోం హమ్‌ ‌భాయిభాయి’’ అన్నాడు ప్రముఖ ఉర్దూకవి ‘షాద్‌’ ‌కాళోజీ రామేశ్వర్‌రావు వేలూరి రాములు గురించి. సన్నిహితులకుతప్ప వేలూరి రాములు పరిచయం చాలామందికి తెలియదు. సాహిత్యలోకానికంతా ఆయన ‘విద్యార్థి’గానే పరిచయం. నలభై అయిదేళ్ళ ఆయన సాహిత్య ప్రస్థానమంతా ‘విద్యార్థి’ కలం పేరునే సాగింది. విద్యార్థి స్వయంగా సైనికుడు. వాయుసేనలో సేవలందించినవాడు. ‘మిస్సైల్స్- ‌రాడార్స్’‌లాంటి ఆయుధాల సాంకేతిక పరిజ్ఞానం  ఉన్నవాడు. అయినా యుద్ధాలపట్ల విరక్తిభావం కలవాడు. అంతమాత్రాన యుద్ధమంటే భయపడేవాడుకాదు. అందుకే ఒకదగ్గర ‘‘చావంటే నాకెందుకు భయం/ అపరిమితమూకాదు.. అరుదైనదీకాదు/ జరామరణ భయాతీతంకాదు/ ఎందరెందరినుండి శాశ్వితంగా సెలవు తీసుకున్నాను/ ఇంద్రధనస్సుని భ్రమించి చేరువగాపోతే/ నన్ను బాణంచేసి సరిహద్దులవైపు/ సందించి వదిలిందీ బాణం’’అని రాసుకున్నారు. మానవతా ప్రపంచంలో శాంతికితప్ప హింసకు, యుద్ధాలకు తావులేదన్న గౌతమబుద్ధుని భావాజాలాన్ని జీర్ణించుకున్న తాత్వికుడిగా కనిపిస్తాడు విద్యార్థి. ‘హింస’కు నిర్వచనమిస్తూ హింసఅంటే కేవలం రక్తపాతాన్ని సృష్టించడమేకాదు. అది అనేక రూపాల్లో ఉంటుంది. మానవజాతి ఆవిర్భావంనుండి సాగుతూనేఉంది. స్వార్థమే అందుకు ప్రధానకారణమని, కు)మతాలు, దేశం, సరిహద్దుల వివాదాలు హింసను ప్రోత్సహించేవేనని, దాన్ని నిషేదించాలన్నదే తన అభిమతంగా చెప్పుకొచ్చినతీరు ఆయన ఉన్నత ఆలోచనలకు అద్దంపడుతున్నది.పేదరికం ఆయన్ను యుద్ధ సైనికుడిగా మార్చిందేగాని, తన ఆలోచనలకు విరుద్ధమైన వృత్తిలో ఇముడలేకపోయాడు. అందుకే ‘గన్‌’ ‌వదిలి ’పెన్‌ ‌గన్‌’‌పట్టి సాహితీవ్యాసాంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్న వ్యక్తి విద్యార్థి.

     విద్యార్థికి చిన్నప్పటినుండే సైన్స్ అన్నా సాహిత్యమన్నా అమితమైన ఆసక్తి. తనచుట్టూ ఉన్న ప్రకృతిసౌందర్యాలను సంపూర్ణంగా ఆస్వాదిస్తూ, తన ఆలోచనలను అక్షరబద్దంచేయడంలో నైపుణ్యాన్ని సాధించారాయన. తనలోని సాహిత్యాభిలాషకు చిన్ననాటిగురువు భట్రాజుసారే కారణమం టారాయన. అవి తాను 2వ తరగతి చదువుతున్నరోజులు. కవులంటే ఎవరని గురువు అడిగిన ప్రశ్న తనలో సాహిత్య జిజ్ఞాసను పెంచడానికి కారణమైంది. ఆనాడు అమాయకంగా కవులంటే తాను కౌలు రైతులుగా భావించడాన్ని గురువు సరిదిద్ది, కవిత్వమంటే ఏమిటో విడమరిచి చెప్పినప్పటినుండి తనలో ఆ అభిలాష పెనవేసుకుందంటారు విద్యార్థి. ఆ అభిలాషే తన 12వ ఏట ఆరవతరగతి చదువుతున్నప్పుడే తనతో కవిత రాయించింది. విచిత్రమేమంటే తాను మిలటరీలో చేరుతానన్న ఆలోచన ఊహమాత్రంగాలేని కాలంలో సైనికులపై కవిత రాయడం. ‘‘హిమాలయపు కొండల్లో/ బార్డర్లు కాసే సైనికుడా / ఓ సైనికుడా… అంటూ సాగిన ఈ కవిత రాయడానికి తనకు తెలుగు భాషనేర్పిన సదాశివరావు, సాంబశివరావు లాంటి తెలుగు పండితులే కారణమంటారాయన.
ఉమ్మడి వరంగల్‌జిల్లా సంగెం మండల పరిధిలోని గవిచర్ల విద్యార్థి స్వగ్రామం. ఇక్కడి పాంచాలరాయ ఆలయం, శివాలయాలు ప్రసిద్ధి చెందినవి. ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్రలో పేర్కొన్న ‘గుండు బ్రహ్మయ్య’ ఆలయంకూడా ఈ గ్రామంలోనిదే. ఇక్కడ ప్రాథమిక విద్య, సంగెం మండల కేంద్రంలో మాధ్యమిక, హైస్కూల్‌ ‌చదువుల అనంతరం హన్మకొండ ఆర్టస్ అం‌డ్‌ ‌సైన్స్ ‌కళాశాలలో పీయుసీ సైన్స్ ‌గ్రూప్‌లో చేరినప్పుడే ‘ఇండియాన్‌ ఎయిర్‌ ‌ఫోర్స్’‌లో చేరే అవకాశం లభించింది. ఆర్థికపరిస్థితి దృష్ట్యా త్వరలో ఉపాధిఅవకాశాలు లభిస్తాయన్న ఉద్దేశ్యంగా ఎయిర్‌ ‌ఫోర్స్ ‌శిక్షణ తీసుకోవడమైంది. దానికి కాస్తా దేశభక్తి కూడా తోడైంది. విద్యార్థి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు లింగాల రాంచంద్రారెడ్డి (హైకోర్టు న్యాయమూర్తి లింగాల నర్సింహరెడ్డి) సోదరుడు శేషారెడ్డి ని మిలటరీలో చేర్పిస్తున్న క్రమంలో విద్యార్థినికూడా చేరమని చెప్పడం, అప్పటికే ఆయన మేనత్త భర్త జయసేన ఆర్మీలోని మరాఠా రెజిమెంటులో పనిచేస్తుండడం కూడా అటువైపు వెళ్ళేందుకు కారణమైంది. 1964 అక్టోబర్‌ 19‌న ఎయిర్‌ఫోర్స్‌లో చేరిన అనంతరం రాడార్‌ ఇం‌జనీరుగా పదిహేను ఏళ్ళపాటు వివిధ ప్రాంతాల్లో, వివిధ స్థాయిలో 1979 అక్టోబర్‌ 31‌వరకు పనిచేశారు. రాకెట్‌ ‌లాంచింగ్‌, ‌సర్ఫేస్‌ ఎయిర్‌ ‌మిస్సైల్‌, ‌ఫైర్‌ ‌కంట్రోల్‌ ‌విభాగాల్లో ప్రావీణ్యంపొందిన విద్యార్థి రెండు యుద్ధాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.
1975లో జరిగిన ఇండియా, పాకిస్తాన్‌ ‌యుద్ధంలోనూ, ఆ తర్వాత తాను షిల్లాంగ్‌లో పనిచేస్తున్నప్పుడు 1971లో జరిగిన బంగ్లాదేశ్‌ ‌లిబరేషన్‌ ‌వార్‌లో రాడార్‌ ఇం‌జనీర్‌గా పాల్గొనడమైంది. బంగ్లాదేశ్‌లో జరిగిన యుద్ధంలో మృత్యుముఖం వరకు వెళ్ళివచ్చిన సంఘటన తనకు ఇప్పటికీ గగుర్పాటును కలిగిస్తుందంటారు విద్యార్థి. ఆ యుద్ధంలో తాను ఉపయోగిస్తున్న రాడార్‌ ‌తప్ప మిగతా ఇండియా రాడార్లన్నిటినీ శత్రు సైన్యాలు ‘జామ్‌’ ‌చేశాయి. తన రాడర్‌ ‌మాత్రమే పనిచేస్తున్న క్రమంలో చాకచక్యంగా తన రాడార్‌తో శత్రు విమానాలను గుర్తించి, ఆ సమాచారాన్ని పై అధికారులకు అందించడం ద్వారా వాటిల్లో కొన్నిటిని కూల్చివేసి, మరికొన్నిటిని తరిమేయగలిగాం. ఆ సంఘటనతో మిలటరీ అధికారులు తనను ప్రశంసలతో నింపేశారని నేటికీ ఆయన గర్వంగా చెప్పుకుంటున్నారు. ఎయిర్‌ ‌ఫోర్స్‌నుండి స్వచ్చంద పదవీవిరమణ చేసిన తర్వాత కొంతకాలం హైదరాబాద్‌లోని ఒక టివీ కంపెనీలో క్వాలిటీ కంట్రోర్‌గా పనిచేశారు. ఎయిర్‌ఫోర్స్‌లో తీసుకున్న శిక్షణ పదవీవిరమణ చేసినతర్వాత ఆయనకెంతో ఉపయోగపడింది. హనుమండలో నాటి రీజినల్‌ ఇం‌జనీరింగ్‌ ‌కాలేజీ, నేటి ‘నీట్‌’‌లో కొత్తగా ప్రవేశపెట్టిన నేషనల్‌ ‌ఫిజికల్‌ ‌లేబరేటరీ వారి రీసెర్చ్ ‌ప్రాజెక్టులో ఎలక్ట్రానిక్‌ అం‌డ్‌ ‌కమ్యూనికేషన్స్ ‌విభాగంవారు సుమారు పద్దెనిమిదేళ్ళపాటు ఆయన సేవలను వినియోగించుకున్నారు.
 ‌విద్యార్థి జీవితమంతా సమరమే. కవితాకదనరంగాలను అయన సమఉజ్జీగా నడిపారనడంలో అతిశయోక్తిలేదు. ఒకపక్కన దేశ రక్షణలో సాహాసోపేత చర్యలుచేస్తూనే మరోపక్క హృదయాలను కదిలించే కవితలల్లడం ఆయనకే చెల్లింది. స్థానిక మొదలు అంతర్జాతీయ సమస్యలను, నేలనుండి ఆకాశం వరకు అనేక సన్నివేశాలను తీసుకుని లోతైన అధ్యయనంతో కవితలను చెక్కడంలో ఆయన నేర్పరి.
అందుకే ఆయన్ను అభిమానించేవారు ‘యుద్ద కవి, సైనిక కవిగా, ఖండాంతర కవిగా, విశ్వకవిగా, నిరాడంబర కవిగా, స్తానిక విశ్వమానవుడు, గ్లోబల్‌పోయెట్‌  ‌లాంటి బిరుదులతో ప్రశంసిస్తున్నారు. విద్యార్థి కవిత్వమంతా భౌతికం. సామాజిక అసమానతలను ప్రశ్నించింది. కుహన రాజకీయాలను నిరసించింది. సార్వ జనీనత, విశ్వ జనీనత ఆయన మార్గం. ఆయన కవితలు మానవీయ విలువలను ప్రబోధిస్తాయి. ప్రపంచశాంతిని కోరుకునేవిగా ఉంటాయి. చెప్పదల్చుకున్నదేదో ఖచ్చితంగా చెబుతాడు. అందుకే కృతఘ్నుడా అన్నకవితలో ‘‘చెప్పులు ముడిచిన చేతుల్ని/ ఎప్పుడైనా కళ్ళకద్దుకున్నావా?/కాళ్ళు పట్టిన వాడి కాళ్ళకు/ఎప్పుడైనా దండం పెట్టావా?/ నీమరుగు దొడ్డి కడిగిన మనిషిముందు/ ముట్టుబట్ట లుతికిన మనిషిముందు/ ఎప్పుడైనా శిరసు వంచి నిలుచున్నావా?/ నీ తిండి పండించిన రైతుకు/బట్టనేసిన సాలీడుకి /ఇల్లుకట్టిన సుతారికి / ప్రాణానికి ప్రాణం అడ్డంపెట్టి /నీ బండి నడిపిన డ్రైవర్‌కు / పెట్టెమోసిన కూలికీ కృతజ్ఞతతో ఎప్పుడైనా చేతులెత్తి నమస్కరించావా;’’ అంటూ ప్రశ్నించారు. తన అనుభావలనేగాని మరేమీ అశించి కవితలు రాయడంలేదంటూ ‘‘సూర్యుడు తేజస్సు పంచుతూ ఒక నమస్కారాన్నితప్ప మరేమీ ఆపేక్షించడు. ఇంద్రుని ఆధీనంలో పంచభూతాలు మానవాళికి ఇవ్వడమేతప్ప తీసుకోవడం తెలియదు…. కవికూడా తనకు తెలిసినదానిని, తన అనుభవంలోకి వచ్చినదానిని ప్రపంచానికి తెలియజెప్పడమేకాని మరేమీ ఆశించడు’’ అని వ్రాసుకున్నారు. మిలటరీలో పనిచేసినప్పటికీ విద్యార్థి చాలా సున్నితమైన మనష్కుడు. ఎవరినీ నొప్పించని వ్యక్తి, మితభాషి. కాని లక్ష్యసాధనలో ధృడత్వం కలిగిన వ్యక్తి. సాహిత్యానికి ఎంతో సేవచేసిన నిగర్వి. అందుకే ఒక దగ్గర కవిని కాదు.. కవితను చూడమంటాడు. ‘‘కవిత్వాన్ని మాత్రమే చూడండి. కవిపేరు చూడకండి. పేరుచూస్తే ఆపేక్షనిరాపేక్షలు ముసురుకుంటాయి’’ అంటాడు. మరో కవితలో శ్రమజీవులైన కార్మికులను, కర్షకులను పని రాక్షసులుగా వర్ణించిన విద్యార్థి, ఆ జాబితాలో కవులను కూడా చేర్చడం విశేషం.
సైన్యంలో ఉన్నప్పుడు రాసిన ‘అపరిచితులు’ కవిత పలువురి ప్రశంసలనందుకుంది. పఠాన్‌కోటలో పనిచేస్తున్నప్పుడు రన్‌వే ఆగిన విమాన రెక్కల నీడలోకూర్చుని రాసిన ఈ కవిత గుండె తడులను నిండార స్పృశించింది. సహచర్యం-సహజీవనాల అగాధాన్ని ఈ కవితలో కవి విప్పిచెప్పాడు. వివాహబంధంలోని తొలి, మలిదశలతీరును సజీవంగా ఈ కవితలో నిలిపారు. అంతా సవ్వంగానే సాగిపోతున్నది అయినా ఏదో కొరత.. అ కొరతే భార్యభర్తలను ‘అపరిచితులు’ చేస్తున్నదంటారు విద్యార్థి. ఈ కవితద్వారా కాళోజీనేకాదు కవిత్వాభిమాను)ను, మనుషులందరి హృదయాలను సున్నితంగా స్పృశించిన విద్యార్థి విశ్వమానవుడని వరవరరావు లాంటివారు ప్రశంసించారు. కాళోజీ నారాయణరావు మాటల్లో చెప్పాలంటే ‘‘తమ్ముడూ..ఏంచక్కని అనుభూతుల్ని పలుకుల్లో వొలకబోసుకున్నావోయీ…నా అదృష్టంకొద్దీ అవినాదాకా చేరాలనే ఉబలాటంతో బైటపడినాయి’’ అంటూ విద్యార్థి కవితలను తెగ మెచ్చుకున్నారు. విద్యార్థి కవితలలోతు అర్థాలగురించి పెద్ద కాళోజీ (కాళోజీ రామేశ్వర్‌రావు ‘షాద్‌’) ఏమన్నారంటే ‘‘ తూనే సమందర్‌ ‌కీ గహరాయీ/ నాపీ ఖుద్‌హీ లగాకర్‌ ‌డుప్‌కీ/ జోబీ లిఖా వహ చక్‌ ‌కర్‌ ‌లిఖా/ పీ డాలా ఖారా పానీ భీ/ జీవన్‌ ‌కా హర్‌ ‌పహలూ దేఖా/ దోజఖ్‌ ‌దేఖా జన్నత్‌ ‌దేఖీ/ పడ్‌ ‌లిఖ్‌ ‌కర్‌ ‌హమ్‌ ‌నహీ బనే హై/ హమ్‌ ‌తో ఇక్‌ ‌శృత్‌ ‌పండిట్‌ ‌హీ’’అంటూ ఆయన కవితలోని గోప్పదనాన్ని మెచ్చుకున్నారు.
కాళోజీ సోదరుల కుటుంబంతో విద్యార్థి కుటుంబానికి మొదటినుండీ అనుబంధముంది. కాళోజీ అనగానే సహజంగానే గుర్తుకు వచ్చేది రామశాస్రి పేరు. అలాంటి విడదీయరాని అనుంబంధం విద్యార్థిదికూడా. విద్యార్థి స్వగ్రామైన గవిచర్ల కాళోజీ అత్తగారిఊరు కావడం వారిమద్య మరింత సాన్నిహిత్యం ఏర్పడింది. కాళోజీ విద్యార్థిని ఎంతో అభిమానించేవారు. ఆయన కవితలను కాళోజీ సోదరులిద్దరూ ప్రోత్సహించేవారు. ‘మిత్రమండలి’లో చదివి మెరుగులుదిద్దేవారు. ఆ అనుబంధంతోనే ‘కాళోజీ తమ్ములం/‘ప్రజాకీయ’వాదులం/ఖచ్చితంగా ప్రజా కవులం/ జాతిమాది నీతిమాది/అనిరాయడంద్వారా కాళోజీ సోదరులను విద్యార్థి ఎంతగా అభిమానించేవాడో అర్థమవుతున్నది. ఆ అభిమానంతోనే 1987లో ‘అలలు’ పేరున ప్రచురించిన కవిత సంపుటిని కాళోజీ నారాయణరావుకు అంకితమిచ్చారు విద్యార్థి. అలాగే ‘పలకరింత(1996)’- ‘ఘర్మ సముద్రం(2004)’ కవితా సంపుటాలను కాళోజీ రామేశ్వర్‌రావుకు అంకితమిచ్చారాయన.
అదేవిధంగా అమెరికాలోని నయాగర జలపాతందగ్గర కూర్చుని రాసిన కవితా సంపుటి ‘మంచు మైదానం’ను కుటుంబసభ్యులకు అంకితమిచ్చారు. అమెరికాలో డెట్రాయిట్‌లో 2006 అక్టోబర్‌ 16‌న ఆవిష్కరించిన ఈకార్యక్రమంలో ముఖ్యఅతిధిగా ‘ఆటా’ ఇంటర్‌ ‌నేషనల్‌ ‌కో ఆర్డినేటర్‌ ‌ప్రొఫెసర్‌ ‌సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఎక్కువకాలం అమెరికాలో గడపడంవల్ల విద్యార్థికి అక్కడి సాహిత్యకారులతో మంచి సన్నిహిత్య సంబంధాలు ఏర్పడ్డాయి. అక్కడ కూడా పలుచోట్ల ఉపన్యాసాలు, కవితాగానాలు సాగించిన విద్యార్థి అక్కడే ‘ఖండాంతర’ కవితను రాశారు. దానివల్లనేమో సాహితీ బంధువలంతా ఆయన్ను ‘ఖండాంతర కవి’గా పిలవడం ప్రారంభించారు.     కాళోజీ సోదరులు, శ్రీశ్రీ, తిలక్‌తోపాటు ఆయన రచనలపై జిడ్డు కృష్ణమూర్తి ప్రభావంకూడాఉంది. ఒకవిధంగా జిడ్డు కృష్ణమూర్తితో కలిసిన తర్వాతే ఆయనలో చాలా మార్పువచ్చింది. పదహారేళ్ళ వయస్సులోనే జిడ్డు కృష్ణమూర్తి ఆలోచనావిధానానికి ప్రభావితుడైన విద్యార్థి, కృష్ణమూర్తి ఉపన్యాసాలంటే చెవికోసుకునేవారు. తన 24వ ఏట 1970 జనవరిలో కృష్ణమూర్తితో ముఖాముఖి మాట్లాడే అవకాశం విద్యార్థికి లభించింది. ఆయనతో మాట్లాడిన తర్వాత ప్రపంచాన్ని వీక్షించే విధానంలో మార్పురావటమేకాకుండా ఆ మార్పు ఆయన రచనల్లోనూ ప్రస్ఫుటించింది.
విద్యార్థి కవితలు ఏడు సంపుటాలుగా ప్రచురితమైనాయి. అచ్చువేసినవి వేయనివి కలిపి సుమారుగా ఎనిమిది వందలకు పైగానే ఉన్నాయి. ప్రకృతిపై ఆంగ్ల వచనంలోకూడా కొన్ని వ్రాశారు. ఆయన మొట్టమొదటి కవిత ‘రాములు’పేరుతోనే అచ్చయింది. వరవరరావుగారు దాన్ని ఎడిట్‌చేసి ‘లోయలు’ అన్న కవితా సంకలనం చేశారు. ఆయన కవితలను హిందీ, ఉర్దూ, ఆంగ్లభాషలో అనువాదించి గ్రంథస్థం చేయడం విశేషం. ‘అంతర్యాన్‌’ ‌పేరిట హిందీలోకి ప్రోఫెసర్‌ ‌డాక్టర్‌ ‌రంగయ్య అనువదించగా ప్రముఖ హిందీ పండితులు డాక్టర్‌ ‌హన్మంత్‌ ‌మంజుందార్‌ ‌ముందుమాట వ్రాశారు. అలాగే  ‘ఆస్‌మా కా )మ్స్’ (ఆకాశ స్పర్ష) పేర డాక్టర్‌ ‌కుతుబ్‌ ‌సర్షార్‌ ‌సుమారు డెబ్బైకిపైగా  కవిత)ను ఉర్దూలో అనువదించి పుస్తకంగా అచ్చువేశారు. ఆంగ్లలో హరైజన్‌ ‌పేర మరికొన్ని కవితలు అచ్చుఅయ్యాయి.
   ‌విద్యార్థికి తెలంగాణపైన అమితమైన ప్రేమ.1969 తొలిదశ ఉద్యమకాలంలో సైన్యంలో పనిచేస్తుండడంతో ఉద్యమాన్ని సమర్దిస్తూ అనేక కవితలను రాశారు. మలిదశ ఉద్యమంలోకూడా సాహిత్యపరంగా ఉద్యమానికి ఊతమిచ్చారు. ‘తెలంగాణ రచయితల వేదిక’, తెలంగాణ రచయితల సంఘం’ వ్యవస్థాపకుల్లో ఒకరుగా తనవంతు సహకారాన్ని అందించారు. ‘ఎందరి బలిదానమీ విమోచన దినం / ఎవరిని స్మరిద్దాం? ఎవరిని విస్మరిద్దాం’? లాంటి ఘాటైన పదజాలాలతో అనేక కవితలల్లారు. నిజాంకాలంనాటి వెట్టిచాకిరిపై ‘నిన్న నేడు’ అనే కవిత ‘‘కర్కశ గుండియల నిజాం ప్రభువు కాలంనాటి సహజదర్పణంగా బరికాళ్ళతో, గోచీపేగుతో, ఖాలీ డొక్కతో నవాబు బండీముందు పరిగెత్తే వెట్టి చాకలి బతుకును’’ వర్ణించిన తీరు హృదయాన్ని ద్రవింపజేస్తుంది.
విద్యార్థి కవితల గొప్పదనాన్ని విశ్లేషిస్తూ ‘షాయర్‌’ అనే ఉర్దూ మాసపత్రిక మొదటిసారిగా విద్యార్థి ముఖ చిత్రంతో ఒక ప్రత్యేక సంచికను ప్రచురించింది. ఆ పత్రిక ఇతర భాషాకవులను పరిచయం చేయడంకూడా ఇదే మొదటిసారి కావడం విశేషం. పాలపిట్ట మాసపత్రికకూడా ఆయన ముఖచిత్రంతో ప్రత్యేక సంచికను వేసింది. కాగా ప్రముఖ చిత్రదర్శకుడు, నిర్మాత బి. నర్సింగరావు 2012లో ‘అద్దంలో విద్యార్థి’ పేర వరవరరావు, నగ్నముని, కోవెల సుప్రసన్నాచార్యులు, కాళోజీ, సదాశివ, అంపశయ్య నవీన్‌, ఎన్‌. ‌గోపి, సిపి కృష్టారావు లాంటి ప్రముఖుల వ్యాసాలతో 370 పేజీల గ్రంథాన్ని, కె. జితేంద్రబాబు సంపాదకత్వంలో ‘విఆర్‌ ‌విద్యార్థి కవిత్వం’పేర మరో గ్రంథాన్ని ‘జయమిత్ర సాహిత్య వేదిక’గా ప్రచురించారు. మరో ముఖ్యవిషయమేమంటే విద్యార్థి వ్రాసిన కవితలపైన కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి పాశం శ్రీనివాస్‌ ‘‌విఆర్‌ ‌విద్యార్థి-కవిత్వం విశ్లేషణ’పైన పీహెచ్‌డి చేయగా, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థిని ‘విఆర్‌ ‌విద్యార్థి కవిత్వం-సామాజిక వైవిద్యం’ అన్న అంశంపైన పిహెచ్‌డి చేశారు.
విద్యార్థి లోగిలే ఒక సరస్వతీనిలయం. ‘మిత్రమండలి’ కన్వీనర్‌గా తనఇంట అనేక సాహిత్య కార్యక్రమాలను నేటికీ నిర్వహిస్తూనే ఉన్నారు. విచిత్రమేమంటే వారి తండ్రి, తాత కూడా హిందుస్తానీ సంగీతకారులు. ఆయన ధర్మపత్ని రత్నమాల మంచి క్రాఫ్ట్ ‌వర్క్ ‌చేస్తుంది. పెద్ద కుమారుడు అమరేంద్ర ఆంగ్లంలో కవిత్వం రాయడంతోపాటుగా ఫోటోగ్రఫీ, పెయింటింగ్‌లో మంచి నైపుణ్యముంది. రెండవ కుమారుడు శైలేంద్రకు సాహిత్యపట్ల అభిలాష ఉంది. ఆయన భార్యకూడా అంగ్లంలో కవితలు రాస్తుంది. ఇద్దరు మనుమరాండ్రలో ఒకరు క్లాసికల్‌ ‌డ్యాన్స్‌లో, మరొకరికి హిందూస్థాని సంగీతంలో ప్రవేశముంది. మనుమడు పియానో ఉద్దండుడు. అందరూ ప్రస్తుతం అమెరికా వాసులే.
విద్యార్థికి అనేక సాహితీ సంస్థలు, సంఘాలతో అనుబంధముంది. కాళోజీ ఫౌండేషన్‌ ‌వ్యవస్థాపక కార్యదర్శి, ‘మిత్రమండలి’ కన్వీనర్‌గా 13 ఏళ్ళనుండి కొనసాగుతున్నారు. పోతన విజ్ఞాన పీఠంలో ఏడేళ్ళపాటు సాహిత్యకార్యక్రమాలు నిర్వహించారు. ‘సృజనలోకం’ వ్యవస్థాపకుల్లో ఒ••రు. జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక, హైదరాబాద్‌-‌నల్లగొండ కార్యవర్గ సభ్యులు. ప్రపంచ శాంతిపండుగ వ్యవస్థాపకులు. వరంగల్‌ ‌శాంతి సంఘం కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్న విద్యార్థికి అనేక పురస్కారాలు, సన్మానాలు జరగడం సహజమేకదా.. 2026వ సంవత్సరానికిగాను తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 9‌న కాళోజీ జయంతిని పురస్కరించుకుని ప్రతిష్టాత్మకమైన ‘కాళోజీ నారాయణరావు సాహిత్య పురస్కారా’న్ని హైదరాబాద్‌ ‌రవీంద్రభారతి వేదికగా అందించింది. అంతకు క్రితం ఆయన అందుకున్న పురస్కారాల్లో చెప్పుకోతగ్గవి అనేకమున్నాయి.
తెలుగు విశ్వవిద్యాలయంవారి కీర్తి పురస్కారం, వానమామలై వరదాచార్య స్మారక పురస్కారం, వరంగల్‌ ‌సాంస్కృతిక మండలి విశిష్ట పురస్కారం, జాషువా పురస్కారం(వరంగల్‌), ‌దాశరథి-ద్వానా పురస్కారం(హైదరాబాద్‌), ‌సత్తుపల్లివారి సృజన సాహితీ సమాఖ్య జీవన సాఫల్య పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ, న్యూడిల్లీవారిచే ‘కవి సంధ్య’ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభ పురస్కారం, ఆచార్య పేర్వారం జగన్నాథం స్మారక పురస్కారం, ఆరెపల్లి ఏంవిఆర్‌ ‌వారు కాళోజీ నాయరాయణరావు ధిక్కారస్వరం అవార్డులను అందుకున్నారు. ఎనిమిది పదులు దాటిన సందర్భంగా ‘మిత్రమండలి’  ‘కాలపుష్పం’ పేర అశీతిపూర్తి అభినందన సంచికను వెలువరించింది. ప్రొఫెసర్‌ ‌బన్నా అయిలయ్య ప్రధాన సంపాదకులుగా అంపశయ్య నవీన్‌, ‌గన్నమరాజు మనోహరబాబు, పొట్లపల్లి శ్రీనివాసరావు, డాక్టర్‌ ఎన్‌విఎన్‌చారి, నాగిళ్ళ రామశాస్రి, డాక్టర్‌ ‌దహగం సాంబమూర్తి, నెల్లుట్ల రమాదేవిలాంటివారి సలహామండలి సారధ్యంలో వెలువడిన ఈ సంచికను అభిమానులు, స్నేహితులు, సాహితీకారులు,బంధువలందరి సమక్షంలో ఆవిష్కరించారు. ఎనభై ఏండ్లు నిండినా ఆయన పెన్ను పదును తగ్గలేదు. ‘‘గాయపడింది కాలం, చికిత్స చేయండి- శిథిలమయింది ప్రపంచం, శాంతి శిఖరాలపై పున: నిర్మించండి’’ అంటూ యువతను తట్టిలేపుతున్నారు విద్యార్థి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *