రైతులందరికీ మద్దతు ధర అందేలా కేంద్రం చర్యలు చేపట్టాలి

  • అధికారులు సమన్వయంతో పనిచేసి కరువు మండలాల ప్రతిపాదనలు అందించాలి
  •  ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో పంటలకు మద్దతు ధర
  • పంటలన్నింటినీ మద్ధతు ధరకు 100శాతం కేంద్రం కొనుగోలు చేయాలి
  • వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, అక్టోబర్ 1 : రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలను గుర్తించి, రెవెన్యూ అధికారుల సమన్వయంతో మండలం యూనిట్‌గా కరువు మండలాల ప్రతిపాదనలకు ఆ శాఖ సేకరించిన సమాచారాన్ని వారికి అందజేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.  కేంద్ర వ్యవసాయ శాఖ రూపొందించిన కరువు నిర్వహణ మార్గదర్శకాల ప్రకారం కేవలం వర్షపాతం లోటును మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా, వర్షపాతం వ్యత్యాసం, ఎస్పీఐ, పొడి కాలం, విత్తిన విస్తీర్ణం, ఎన్డివీఐ/ఎన్డిడబ్లూఐ, విసిఐ, నేల తేమ, రిజర్వాయర్ నిల్వలు, భూగర్భజల పరిస్థితులు, ప్రవాహ జలాలు, పశుగ్రాసం, తాగునీరు, ఉపాధి, వలసలు తదితర అంశాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని, దీనికి వ్యవసాయశాఖ ద్వారా అందించాల్సిన నివేదికలను వారికి ఇవ్వాలని  మంత్రి ఆదేశించారు.

కరువు తీవ్రతను బహుళ సూచికల ఆధారంగా అంచనా వేసి, అవసరమైన చోట క్షేత్రస్థాయి పరిశీలనతో పంట నష్టాన్ని నిర్ధారించాలన్నారు.  కరువు నిర్వహణ మార్గదర్శకాల ప్రకారం సాధారణ వర్షపాతంతో పోలిస్తే 20 నుంచి 59 శాతం ఉంటే లోటు వర్షపాతంగా, 60 నుంచి 99 శాతం ఉంటే భారీ లోటుగా, వర్షం పూర్తిగా లేకపోతే అత్యంత తీవ్రమైన పరిస్థితిగా పరిగణించాలని, అదే విధంగా, సాగు విస్తీర్ణం సాధారణంతో పోలిస్తే 85 శాతం కంటే తక్కువగా ఉండటం కరువు పరిస్థితికి, 75 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉండటం తీవ్రమైన కరువు పరిస్థితికి సూచికగా పరిగణించాలని మంత్రి తెలిపారు.

మద్దతు ధర ప్రకటించిన పంటను 100 శాతం కొనుగోలు చేయాలి …

మద్ధతు ధర (support price) ప్రకటించడంతో కేంద్రం బాధ్యత అయిపోందని, ఆ మద్ధతు ధర ప్రతి రైతుకు అందేలా చూడటం కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతే అని మంత్రి తుమ్మల అన్నారు. బుధవారం కేంద్ర కేబినెట్ రబీ మార్కెటింగ్ సీజన్ 2027-28కు సంబంధించి కనీస మద్దతు ధరలను పెంచింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పిఎస్ఎస్ లో ఆయా రాష్ట్రాలలో సాగవుతున్న పప్పుధాన్యాలు, నూనెగింజల మొత్తం ఉత్పత్తిలో నాఫెడ్ ద్వారా కేవలం 25 శాతం మాత్రమే సేకరిస్తుందని, అలా కాకుండా ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితులు, వాతావరణ మార్పుల నేపథ్యంలో మద్దతు ధర ప్రకటించిన పంటలన్నింటినీ మద్దతు ధరకు కేంద్ర ప్రభుత్వం 100 శాతం కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మల సూచించారు.  ప్రకటించిన మద్ధతు ధరకు 100 శాతం పంటల సేకరణ జరిగినప్పుడే రైతులకు కలుగుతుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, మార్కెటింగ్ ఎండి రాహుల్ రాజ్ మరియు హార్టికల్చర్ ఎండి యాస్మిన్ బాషా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *