అన్నివర్గాల ప్రజలను మోసం చేసిన రేవంత్

  • రేవంత్ కేవలం చంద్రబాబు పిల్లి!
  • ఇద్దరి ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి
  • యూరియా లేక రైతుల గోస
  • ఆరుగంటలు కూడా కరెంట్ రావడంలేదు
  • అరిగోస పడుతున్న రైతులు
  • కాళేశ్వరం, ఫార్ములా రేస్ లపై వేసిన కమిషన్లు ఏం తేల్చాయి?
  • బతుకమ్మ చీరెల ఆర్డర్లు బంద్
  • మూడేళ్లయినా ఆరుగ్యారంటీలు అమలు కాలేదు
  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్,ప్రజాతంత్ర, అక్టబోర్ 1:  తెలంగాణలో రైతులు, చేనేత కార్మికులు, యువత, బీసీలు, దళితులు, మైనారిటీలు సహా అన్ని వర్గాల ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు.ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు గురువారం నాడు తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఎల్. రమణ, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు అన్నదాతలు గోస పడుతున్నారని తెలిపారు. ఆరు గంటలు కూడా కరెంట్ రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, రైతుబంధు రావడం లేదని, యూరియా దొరకడం లేదని కంటతడి పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో ఒక్క ఫోన్ చేస్తే యూరియా పొలం వద్దకే వచ్చేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు.

ప్రజలు తమ పక్షాన నిలబడి ఈ ప్రభుత్వంపై పోరాడాలని కోరుతున్నారని చెప్పారు. కేసీఆర్ ఆనాడే చెప్పారు.. మోసపోకండి.. మోసపోతే గోసపడ్తం అని. ఇవాళ అన్నివర్గాల ప్రజలు గోసపడుతున్నరు” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ రైతులను ఇబ్బంది పెట్టిందని, అదే కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి “వెనకటి రోజులు మళ్లీ తెస్తా” అని చెప్పారని, ఇప్పుడు సాగునీరు లేని రోజులు, కరెంట్ రాని రోజులు తిరిగి తెచ్చారని కేటీఆర్ విమర్శించారు. ప్రజలు మోసం చేసేవాళ్లనే నమ్ముతారని రేవంత్ రెడ్డి గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేసిందని అన్నారు. కాళేశ్వరం మీద కమిషన్ వేశారని, విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ వేశారని, ఫార్ములా-ఈ వ్యవహారంపై కేసులు పెట్టారని, బ్యాంకు ఖాతాల వ్యవహారాలపై విచారణ జరిపారని, అయితే వీటి నుంచి ఏమి తేల్చారని ప్రశ్నించారు. ప్రజల మనసు ఖాళీగా ఉంటే కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలు గుర్తుకొస్తాయని, అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం కొత్త అంశాలను తెరపైకి తెస్తోందని ఆరోపించారు.

సిరిసిల్ల పర్యటనలో ముఖ్యమంత్రి చేనేత కార్మికుల సమస్యలపై సమాధానం చెప్పకుండా వెళ్లారని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిరిసిల్లలో పలువురు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు, విద్యార్థుల స్కూల్ యూనిఫాం ఆర్డర్లు నిలిచిపోయాయని, నేతన్న బీమా పరిస్థితి ఏమైందని ప్రశ్నించారు. చనిపోయిన చేనేత కార్మికుల కుటుంబాలకు పరిహారం ప్రకటిస్తారని, నేతన్న బీమాపై ప్రకటన చేస్తారని ఆశించినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.ముఖ్యమంత్రి సిరిసిల్ల పర్యటనను జరిపిన తీరుపై కేటీఆర్ ఫైర్ అయ్యారు.. భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి పర్యటించడం ప్రజల మధ్య పర్యటనలా లేదని విమర్శించారు. “నల్లమల పులి అని చెప్పుకుంటడు.. నాలుగు వేల మంది పోలీసులను పెట్టుకుని పోతాడా? నువ్వు నల్లమల పులివి కాదు.. చంద్రబాబు పిల్లి” అని విమర్శించారు. ముఖ్యమంత్రి చుట్టూ పోలీసులు తప్ప ప్రజలు కనిపించలేదని, బీఆర్‌ఎస్ నాయకులను ముందుగానే అరెస్టు చేసి, దుకాణాలు మూసివేయించారని ఆరోపించారు.ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, సన్నిహితులకు సంబంధించిన వ్యాపారాలు, టెండర్లు, భూముల వ్యవహారాలపై కేటీఆర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డి కంపెనీకి అర్హత లేకపోయినా భారీ విలువైన టెండర్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు.కొండల్ రెడ్డి అర్హతలు, ఏరోస్పేస్ రంగంలో ఆయనకు వచ్చిన అవకాశాలపై కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్నటి వరకు పెద్దగా ఆస్తులు లేని కుటుంబ సభ్యులు వేల కోట్ల పెట్టుబడులు ఎలా పెడుతున్నారని ప్రశ్నించినందుకే ముఖ్యమంత్రికి కోపం వస్తోందని అన్నారు.

తన ఆస్తులపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కేసీఆర్ 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రి, డిప్యూటీ స్పీకర్, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రిగా పనిచేశారని, నాలుగు దశాబ్దాలకు పైగా చట్టసభల్లో ఉన్నారని గుర్తు చేశారు. కేసీఆర్ తనను చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలని చెప్పేవారని, తాను చదువుకుని అమెరికాలో ఆరు సంవత్సరాలు ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బుతో 2006లో హోటల్ వ్యాపారం ప్రారంభించానని చెప్పారు. 2006లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో హోటల్ ప్రారంభించానని, 2009 ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులు, వ్యాపార వివరాలను స్పష్టంగా వెల్లడించానని తెలిపారు. “నేను అఫిడవిట్‌లో చెప్పిన విషయాన్నే మళ్లీ కొలంబస్ కనుగొన్నట్టు చెబుతున్నరు” అని కేటీఆర్ అన్నారు. వ్యాపారం చేసుకోవడం తప్పా అని ప్రశ్నించారు.తన ఆస్తులపై, రేవంత్ రెడ్డి కుటుంబ ఆస్తులపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ సవాల్ చేశారు. “మా తాతల ఆస్తుల నుంచి మీ తాతల ఆస్తుల వరకు విచారణ చేయండి అని సవాలు విసిరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. మూడు నెలల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మూడేళ్లు గడిచినా ఎన్ని హామీలు అమలు చేశారని ప్రశ్నించారు. దళితబంధు కింద రూ.12 లక్షలు ఇస్తామని చెప్పి ఎంతమందికి ఇచ్చారని, బీసీలకు రూ.లక్ష కోట్లు ఇస్తామని చెప్పి ఎంత నిధులు కేటాయించారని నిలదీశారు. బీసీలకు కాంట్రాక్టులు ఇస్తామని చెప్పారని, రాష్ట్రంలో కాంట్రాక్టులు ఎవరికి దక్కుతున్నాయని ప్రశ్నించారు. మైనారిటీలకు రూ.4 వేల కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. ఎస్సీ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్‌ల పరిస్థితి ఏమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కిట్, బతుకమ్మ చీరలు, రైతుబీమా, మిషన్ భగీరథ వంటి పథకాలపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

బీజేపీ హామీలు ఏమయ్యాయి? 

కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా కేటీఆర్ ప్రస్తావించారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. బుల్లెట్ ట్రైన్, ప్రతి ఇంటికి నల్లా, ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు, ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వంటి హామీల పరిస్థితి ఏమిటని నిలదీశారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా తెలంగాణ పాటలు, కేసీఆర్‌కు సంబంధించిన పాటలు ప్రజలు గుర్తు గుర్తు చేసుకుంటున్నారు అని కేటీఆర్ అన్నారు. “అమ్మ విలువ, అన్నం విలువ లేనప్పుడే తెలుస్తది” అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు.రైతులు, చేనేత కార్మికులు, యువత, బీసీలు, దళితులు, మైనారిటీలు సహా అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *