రుణభార అభివృద్ధి నమూనా: దొందూ దొందే!

తెలంగాణ రాష్ట్రం దేశీ విదేశీ రుణాల విషవలయంలో చిక్కుకుని అప్పుల కుప్పగా మారిపోతున్నదని, ఇవాళ్టి “అభివృద్ధి అవసరాల” పేరుతో భవిష్యత్ తరాల జీవితాలను తాకట్టు పెట్టి, రాజకీయ నాయకుల, అధికారుల బొక్కసాలు నింపుకునే పాలక అవినీతి వ్యూహాలు కొనసాగుతున్నాయని గత పదకొండు సంవత్సరాలుగా వేరువేరు వేదికల మీద రాస్తూ, మాట్లాడుతూ ఉన్నాను. ఆ మాటకొస్తే ఇది తెలంగాణ రాష్ట్రపు కొత్త జాడ్యం కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రపంచ బ్యాంకు రుణాలకూ, తద్వారా ప్రపంచ బ్యాంకు నిర్దేశించిన పాలనా విధానాల షరతులకూ లొంగిపోయి ప్రభుత్వం నడిపిన చంద్రబాబు నాయుడు ప్రారంభించిన జాడ్యం. ఆ పాలనా కాలంలో ‘అమ్మకానికి ఆంధ్రప్రదేశ్’ అని రాయడం ప్రారంభించినప్పటి నుంచీ, ఇరవై ఏడేళ్లుగా ఈ రుణభార అభివృద్ధి నమూనా గురించి రాస్తూనే, మాట్లాడుతూనే ఉన్నాను. చంద్రబాబు విధానాల దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమయిన ఈ విమర్శ తెలంగాణలో చంద్రబాబు రాజకీయ శిష్యులైన చంద్రశేఖర రావు విషయంలోనూ, రేవంత్ రెడ్డి విషయంలోనూ అదే విధంగా కొనసాగవలసి రావడం, ఇంగ్లిష్ నుడికారంలో చెప్పాలంటే కవితా న్యాయం.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అనే పేరుతో ప్రపంచ బ్యాంకు 1995-96ల్లో ఇవ్వడం మొదలుపెట్టిన అప్పులు, ఆ అప్పులతో పాటు పెట్టిన షరతులు రాష్ట్ర పాలనను అస్తవ్యస్తం చేశాయి. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వై ఎస్ రాజశేఖర రెడ్డి, కె రోశయ్య, ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలు కూడా అదే అప్పుల పద్ధతిని కొనసాగించాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో వ్యక్తమైన ప్రజా ఆకాంక్షలలో ఈ అప్పుల పట్ల, షరతుల పట్ల వ్యతిరేకత కూడా ప్రధానమైనదే. కాని తెలంగాణ రాష్ట్ర మొదటి ప్రభుత్వం అదే అప్పుల, షరతుల పాలన ఎటువంటి మార్పులు లేకుండా కొనసాగించింది. చంద్రబాబు నాయుడి దగ్గరే రాజకీయాలు నేర్చుకున్న,  మంత్రివర్గంలో పని చేసిన, అవే ప్రపంచీకరణ విధానాలను తన మనసులో నింపుకున్న కె చంద్రశేఖర రావు ప్రభుత్వం ఆ రుణభార అభివృద్ధి నమూనానే అమలు చేసింది. ఆ ప్రభుత్వమే రెండు దఫాలు పది సంవత్సరాలు సాగగా నా విమర్శ కూడా సమాంతరంగా సాగింది.

రాష్ట్ర విభజన నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వపు మొత్తం రుణభారం ఒక లక్షా 66 వేల కోట్ల రూపాయలు ఉండింది. అందులో 18 వేల కోట్ల రూపాయల అప్పు మీద వివాదాలు ఉన్నప్పటికీ, రు. 1,48,060 కోట్ల అప్పును రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించగా ఆ వివాదరహితమైన అప్పునే రెండు రాష్ట్ర ప్రభుత్వాలకూ పంపిణీ చేశారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ వాటాగా రు. 86,348 కోట్లు, తెలంగాణ వాటాగా రు. 61,711 కోట్లు అప్పు నిర్ధారించారు. అలా 2014 జూన్ 2న రాష్ట్రం ఏర్పడిననాటికి తెలంగాణ రు. రు. 72,658 కోట్లు (వివాదాస్పద అప్పులో వాటా కూడా కలిపి) రుణభారంతో తన ప్రయాణం ప్రారంభించింది. కె చంద్రశేఖర రావు ప్రభుత్వం దిగిపోయిన 2023 డిసెంబర్ 3 నాటికి, తొమ్మిదిన్నర సంవత్సరాలలో, ఆ అప్పు రు. 6,71,757 కోట్ల రూపాయలకు చేరింది. అంటే సగటున సంవత్సరానికి అరవై వేల కోట్ల రూపాయల కన్నా ఎక్కువ అప్పు చేశారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో వ్యక్తమైన ప్రజా ఆకాంక్షలలో ఈ అప్పుల పట్ల, షరతుల పట్ల వ్యతిరేకత కూడా ప్రధానమైనదే. కాని తెలంగాణ రాష్ట్ర మొదటి ప్రభుత్వం అదే అప్పుల, షరతుల పాలన ఎటువంటి మార్పులు లేకుండా కొనసాగించింది. చంద్రబాబు నాయుడి దగ్గరే రాజకీయాలు నేర్చుకున్న, మంత్రివర్గంలో పని చేసిన, అవే ప్రపంచీకరణ విధానాలను తన మనసులో నింపుకున్న కె చంద్రశేఖర రావు ప్రభుత్వం ఆ రుణభార అభివృద్ధి నమూనానే అమలు చేసింది. ఆ ప్రభుత్వమే రెండు దఫాలు పది సంవత్సరాలు సాగగా నా విమర్శ కూడా సమాంతరంగా సాగింది.

తాము చేసిన అప్పు అంత ఎక్కువ కాదని, వాస్తవంగా నాలుగు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేశామని, అది కేంద్ర ప్రభుత్వ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెటరీ మేనేజిమెంట్ (ఎఫ్ ఆర్ బి ఎం) చట్టానికి లోబడినదే గనుక సమస్య లేదని అప్పటి పాలక పార్టీ వాదించింది. అయితే, ఆ వాదనలో కొంత మాటల గారడీ ఉంది. మొత్తం అప్పులలో కొన్ని రకాల అప్పులు, ప్రభుత్వ హామీలు మినహాయించి, ఎఫ్ ఆర్ బి ఎం పరిమితికి లోబడే అంకెలను తయారు చేశారు. ప్రభుత్వమే చెల్లించడానికి బాధ్యత పడిన కార్పొరేషన్ల, సంస్థల, ప్రత్యేక పథకాల రుణాల హామీలను మొత్తం రుణభారం నుంచి పక్కన పెట్టారు.

ఆ విపరీతమైన అప్పు వల్ల రాష్ట్ర ప్రభుత్వం అసలు వాయిదాల కింద, వడ్డీల కింద చెల్లించవలసిన మొత్తం 2014-15లో రు. 6,954 కోట్లు ఉన్నదల్లా 2023-24 నాటికి రు. 32,939 కోట్లకు చేరింది. ఇక్కడ కూడా మరొక గారడీ చేసి, రుణ చెల్లింపుల అంకెను బడ్జెట్ లో ఇలా చూపి, బడ్జెటేతరంగా మరొక రు. 21,039   కోట్లు చెల్లించారు. అంటే రాష్ట్ర ఖజానా నుంచి అప్పుల తిరిగి చెల్లింపుకు తరలిపోయినది 2023-24లో రు. 53,978 కోట్లు. అంటే అప్పుల తిరిగి చెల్లింపు కింద తెలంగాణ బిడ్డలలో ప్రతి ఒక్కరూ తెలంగాణ ఏర్పడే నాటికి రు. 1,738 చెల్లిస్తున్నదల్లా, పది సంవత్సరాల తర్వాత చూస్తే, రు. 13,494 కు పెరిగింది. తెలంగాణ సాధించిన ఫలితం తెలంగాణలో శిశువులతో సహా ప్రతి ఒక్కరి తల మీద పడిన ఈ భారం.

తెలంగాణ/ భారత రాష్ట్ర సమితి తన రెండు దఫాల పాలనలో సాగించిన అక్రమాలకు, అవినీతికి, ప్రజా వ్యతిరేక పాలనకు ముగింపు పలకడానికే 2023 నవంబర్ ఎన్నికలలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారు. పెరిగిన రుణభారం సమస్య కూడా ఎన్నికల ప్రచారంలో అక్కడక్కడ వినబడింది. అయితే గడిచిన పద్నాలుగు నెలల్లో కూడా రుణభార అభివృద్ధి నమూనాలో ఎటువంటి మార్పూ లేదు సరిగదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తప్పుడు అభివృద్ధి నమూనానే మరింత తీవ్రంగా అమలు జరుపుతున్నది. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన పాత పాలకుల మీద తీవ్రమైన విమర్శలు గుప్పించి అధికారానికి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ పద్నాలుగు నెలల్లో సగటున గత ప్రభుత్వం కన్నా ఎక్కువ రుణాలు తెచ్చింది. ప్రపంచ బ్యాంకు అప్పులను కొనసాగిస్తున్నది.

చంద్రశేఖర్ రావు లాగానే, రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు దగ్గరే రాజకీయాలు, ప్రపంచీకరణ భావజాలం, ప్రజావ్యతిరేక పాలనా పాఠాలు నేర్చుకున్నందువల్ల ఇందులో అసహజమూ ఆశ్చర్యకరమూ ఏమీ లేదు. గత ప్రభుత్వం పెంచిన రుణభారం గురించీ, ఏటేటా చెల్లించవలసి వచ్చిన విపరీతమైన నిధుల గురించి పైన చెప్పిన అంకెలలో అత్యధిక భాగం కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కగానే 2023 డిసెంబర్ చివరివారంలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో ఉటంకించిన  అంకెలే. ఆ రుణభార పాలన మీద శ్వేతపత్రంలో విమర్శ ఉందంటే ఆ రకమైన పాలనను కొనసాగించబోమని హామీ ఇచ్చినట్టే. కాని మిగిలిన అన్ని హామీల లాగే ఈ అప్పుల వ్యతిరేకత హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కింది.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే ఒక లక్షా ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిందని, ఈ పద్ధతి కొనసాగితే ఐదు సంవత్సరాలలో ఆరు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తారని, తాము పది సంవత్సరాలలో నాలుగు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేశామని గత ప్రభుత్వాలలో ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన హరీష్ రావు అన్నారు. తాము చేసిన అప్పు గురించి ఆయన చెప్పిన మాట నిజం కాదు గాని, మొత్తానికి దొందూ దొందే అనే వాస్తవం బైట పడుతున్నది.

తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరిలో 2024-25 బడ్జెట్ లో వేసిన అంచనా ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరంలో రు. 59,625 కోట్ల రుణాలు తీసుకోనున్నట్టు ప్రతిపాదించారు. ఇంకో రెండు నెలల్లో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ లో ఈ అంకెను ఎంతగా పెంచుతారో, సవరిస్తారో, లేదా గత ప్రభుత్వం చేసినట్టే ఈ అంకెను మాయ ఖాతాల కింద కప్పెట్టి, తాము తీసుకున్న అప్పు ఎక్కువ కాదనీ, అది ఎఫ్ ఆర్ బి ఎం పరిమితులకు లోబడినదేననీ చెపుతారో తెలియదు. ఇప్పుడు తాజాగా బైటపడుతున్న అంకెల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వానికి చేకూరుతున్న సొంత ఆదాయం నెలకు రు. 13 వేల కోట్లకు అటూ ఇటూగా ఉందని, కాని ఖర్చు సగటున నెలకు ఇరవై వేల కోట్ల దాకా ఉందనీ తెలుస్తున్నది.

ఇప్పటికిప్పుడే చూస్తే, రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన పనులు చేసిన ఎందరో కాంట్రాక్టర్లకు రావలసిన బకాయిలు కొన్ని వందల కోట్లో, వేల కోట్లో పేరుకుపోయి ఉన్నాయి. ప్రభుత్వం చెల్లించవలసిన అనేక బకాయిల పద్దులు వందల కోట్ల రూపాయలు అలాగే మూలుగుతున్నాయి. ఈ నెలలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనున్న రైతు భరోసా పథకానికి 70 లక్షల మంది రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున దాదాపు తొమ్మిది వేల కోట్లు, పది లక్షల మంది భూమిలేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద దాదాపు వెయ్యి కోట్లు కావాలని, ఈ రెండు పథకాలకే ఈ నెలాఖరుకల్లా పది వేల కోట్ల రూపాయలు కావాలని తెలుస్తున్నది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి గనుక, గ్రామీణ ప్రాంతాలలో కొత్త పనులు చేపట్టాలంటే పాత పనుల బిల్లులు చెల్లించాలి. అందుకోసం వెయ్యి కోట్ల రూపాయలైనా అవసరమని తెలుస్తున్నది. అదే విధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇరవై వేల కోట్ల రూపాయలు, కొత్త, పాత రేషన్ కార్డులకు సన్న బియ్యం పథకం అమలు చేస్తే ఆ పథకానికి పది వేల కోట్ల రూపాయలు… ఇలా మొత్తంగా నడుస్తున్న ఆర్థిక సంవత్సరం ముగిసే లోగానే, అంటే రానున్న మూడు నెలల కంటే తక్కువ కాలంలోనే ఉద్యోగుల జీత భత్యాలు, ప్రభుత్వ నిర్వహణ ఖర్చులు కాక,  ప్రభుత్వానికి దాదాపు యాబై వేల కోట్ల రూపాయలు కావాలి. ఎంత గోళ్లూడగొట్టి వసూలు చేసినా రావాల్సిన ఖాతాలు ముప్పై వేల కోట్లు మించక పోవచ్చు.

మొత్తంగా నడుస్తున్న ఆర్థిక సంవత్సరం ముగిసే లోగానే, అంటే రానున్న మూడు నెలల కంటే తక్కువ కాలంలోనే ఉద్యోగుల జీత భత్యాలు, ప్రభుత్వ నిర్వహణ ఖర్చులు కాక,  ప్రభుత్వానికి దాదాపు యాబై వేల కోట్ల రూపాయలు కావాలి. ఎంత గోళ్లూడగొట్టి వసూలు చేసినా రావాల్సిన ఖాతాలు ముప్పై వేల కోట్లు మించక పోవచ్చు. 

రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నికర ఆదాయ వనరులు కేంద్ర ప్రభుత్వ పన్నులలో వాటా, రాష్ట్ర పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం, సహాయ గ్రాంట్లు అనే నాలుగు పద్దులు మాత్రమే. ఇవి ఎట్లాగూ వ్యయం కన్నా దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయల లోటుతో ఉన్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వ రుణాలు, బహిరంగ మార్కెట్ రుణాలు, రాష్ట్ర ప్రభుత్వ హామీపై రుణాలు వంటి ఆదాయ వనరుల కోసం దేబిరించడమో, రాష్ట్ర వారసత్వ సంపదను అమ్ముకొని తినడమో చేయాలి.

ఇదంతా ప్రభుత్వాలు నడుపుతున్న వారి, ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తున్నవారి స్వంత సమస్య కాదు. అప్పు తెచ్చి, అందులో ఎక్కువ భాగం ముడుపులు మింగి వారు తప్పుకొని పోతారు. లేదా తరతరాలుగా కొనసాగుతూ వస్తున్న మన వారసత్వ సంపద అయిన భూములనూ, భూగర్భ ఖనిజాలనూ అమ్ముకుని, అందులోనూ ముడుపులు మింగి భవిష్యత్ తరాలకు వారసత్వ సంపద లేకుండా చేస్తారు.  మన పేరు మీద తెస్తున్న ఆ అప్పు అసలు వాయిదాలు, వడ్డీలు తడిసి మోపెడు చెల్లించవలసింది మనమూ, మన పిల్లలూ, వాళ్ల పిల్లలూ, భవిష్యత్ తరాలు. ఇటు సహజ సంపదా తరిగిపోయి, అటు అప్పుల భారమూ పెరిగిపోయి చివికి పోయేది మనం. పెరిగిపోతున్నది వాళ్లు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *