రోడ్డుపై వాహనం ఆపి విద్యార్థులతో మంత్రి శ్రీధర్‌బాబు సరదా ముచ్చట్లు!
మంథని, ప్రజాతంత్ర, నవంబర్ 26 : ప్రజాప్రతినిధిగా ఎంతటి పదవిలో ఉన్నా ప్రజలతో మమేకం కావడంలోనే నిజమైన నాయకత్వం కనిపిస్తుంది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Minister Duddilla Sridhar Babu ) మంథని ప్రాంతంలో ప్రయాణిస్తున్న సమయంలో పాఠశాల విద్యార్థులను గమనించిన ఆయన తన వాహనాన్ని ఆపి వారి వద్దకు వెళ్లారు.
విద్యార్థులతో కొద్దిసేపు ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చదువు ఎలా సాగుతోంది? పాఠశాలలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి? అంటూ పిల్లలతో సరదాగా మాట్లాడారు. మంత్రి తమ వద్దకు వచ్చి పలకరించడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.
సాధారణంగా అధికారిక కార్యక్రమాలు, సమావేశాలతో బిజీగా ఉండే మంత్రి.. రహదారిపై కనిపించిన విద్యార్థుల కోసం వాహనం ఆపి వారితో మాట్లాడటం స్థానికులను ఆకట్టుకుంది. హోదా, అధికారాలకు అతీతంగా ప్రజలతో అనుబంధాన్ని కొనసాగిస్తూ, చిన్నారుల పట్ల ఆప్యాయత చూపిన ఈ సందర్భం నాయకత్వంలో మానవీయ కోణాన్ని చాటిచెప్పింది.





