పఠనాసక్తిని పెంచడంలో జర్నలిస్టులు, రచయితల పాత్ర కీలకం

– మ‌రిన్ని మంచి ర‌చ‌న‌లు రావాలి: జ్యోత్స్న

హైదరాబాద్ (కొండాపూర్), నవంబర్ 24: యువతలో పుస్తకాలు చదివే అలవాటును తిరిగి పెంపొందించేందుకు రచయితలు, జర్నలిస్టులు మరిన్ని మంచి రచనలు చేయాలని గుంటూరు మాజీ ఎమ్మెల్యే దివంగత కనపర్తి నాగయ్య కుమార్తె, ప్రముఖ సీనియర్ జర్నలిస్టు, విశాలాంధ్ర సంపాదకులుగా విశేష సేవలందించిన దివంగత సి.రాఘవాచారి సతీమణి జ్యోత్స్న ఆకాంక్షించారు. నాణ్యమైన సమాచారాన్ని అందించే పత్రికలు, మ్యాగజైన్లు గ్రంథాలయాలకు చేరడం అభినందనీయమని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ గవర్నింగ్ కౌన్సిల్ మాజీ సభ్యుడు, సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావుతో కలిసి యాత్రలోకం ట్రావెల్ మ్యాగజైన్ సంపాదకుడు టి.అనిల్ కుమార్ ఆమెను మంగ‌ళ‌వారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మ్యాగజైన్ తాజా సంచికను ఆయ‌న జ్యోత్స్నకు అందజేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న సీఆర్ ఫౌండేషన్‌లోని నీలం రాజశేఖరరెడ్డి రీసెర్చ్ సెంటర్ (లైబ్రరీ) ఇన్‌చార్జిగా జ్యోత్స్న బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా యాత్రలోకం మ్యాగజైన్‌ను ఆమెకు పరిచయం చేసిన సంపాదకుడు అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాంతాలు, చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, ప్రకృతి అందాలు, సంస్కృతి, సంప్రదాయాలను తెలుగు పాఠకులకు పరిచయం చేయడమే మ్యాగజైన్ ప్రధాన లక్ష్యమని వివరించారు. అనంతరం అనిల్ కుమార్ మాట్లాడుతూ నీలం రాజశేఖరరెడ్డి రీసెర్చ్ సెంటర్ లైబ్రరీకి ప్రతినెలా యాత్రలోకం ట్రావెల్ మ్యాగజైన్‌ను ఉచితంగా పంప‌నున్నట్లు తెలిపారు. పుస్తకాలు, పత్రికలు పాఠకులకు నిరంతరం అందుబాటులో ఉండటం ద్వారా విజ్ఞానాన్ని, పఠనాసక్తిని పెంపొందించవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రంథాలయాల ద్వారా మంచి పుస్తకాలు, విలువైన సమాచారాన్ని యువతకు చేరువ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. జ్యోత్స్న మాట్లాడుతూ ఒకప్పుడు యువతలో పుస్తక పఠనంపై ఎంతో ఆసక్తి ఉండేదని, అయితే ప్రస్తుత కాలంలో మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ మాధ్యమాల ప్రభావంతో పుస్తక పఠనాసక్తి క్రమంగా తగ్గుతోందని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ఎంతోమంది జర్నలిస్టులు, రచయితలు తమ రచనలు, కథనాల ద్వారా పాఠకుల్లో ఆసక్తిని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారన్నారు. పుస్తక పఠనం వ్యక్తి ఆలోచనా విధానాన్ని విస్తృతం చేయడంతో పాటు సమాజం, చరిత్ర, సంస్కృతి, వివిధ రంగాలపై అవగాహనను పెంచుతుందని పేర్కొన్నారు. అనంతరం చలపతిరావు జ్యోత్స్నతో కలిసి దివంగత రాఘవాచారితో తమకున్న సుదీర్ఘ అనుబంధాన్ని, వృత్తిపరమైన అనుభవాలను, ఆనాటి జర్నలిజం రంగంలోని మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. రాఘవాచారి విలువలు, పాత్రికేయ రంగానికి ఆయన అందించిన సేవలు, సమాజం పట్ల ఆయనకున్న నిబద్ధత వంటి అంశాలను గుర్తు చేసుకున్నారు. పత్రికా రంగంలో విశిష్ట గుర్తింపు పొందిన వ్యక్తుల మధ్య జరిగిన ఈ ఆత్మీయ కలయికలో పాత జ్ఞాపకాలతోపాటు నేటి జర్నలిజం, పుస్తక పఠనం, గ్రంథాలయాల ప్రాధాన్యత వంటి అంశాలు చర్చకు వచ్చాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *