రాష్ట్రానికి కేంద్రం కరువు సాయం అందించాలి
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
నిజామాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 25: ఇంటర్ విద్యను ఏకపక్షంగా స్కూల్ ఎడ్యుకేషన్ లో విలీనం చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల స్పష్టం చేశారు. ఈ అంశంలో కచ్చితంగా విద్యార్థుల తల్లితండ్రులు, స్కూల్ యాజమాన్యాలు, ఇంటర్ కాలేజ్ ల యాజమాన్యాలు, విద్యావేత్తలతో చర్చించాకే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. బుధవారం నిజామామాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇంటర్ విద్య విషయంలో నెలకొన్న అన్ని సందేహాలను ప్రభుత్వం నివృత్తి చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. స్కూల్ ఎడ్యుకేషన్ లో ఇంటర్ విద్యను విలీనం చేస్తే మౌలిక సదుపాయాలు ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు.
ఇంటర్ లో స్కూల్ ఎడ్యుకేషన్ ను కలుపుతారా? స్కూల్ ఎడ్యుకేషన్ ను ఇంటర్ లో కలుపుతారా స్పష్టత ఇవ్వాలన్నారు. ఇప్పటికే ఇంటర్మీడియేట్ విద్య కోసం తల్లితండ్రులు లక్షలు ఖర్చు చేస్తున్నారని.. కొత్తగా 9, 10 తరగతులను కూడా కలిపితే భారీగా ఫీజుల భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యను సమాంతరంగా ప్రోత్సహించకుండా, ఫీజుల నియంత్రణ చేపట్టకుండా స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్ విద్యను కలిపితే చాలా ఇబ్బందులుంటాయన్నారు. ఈ అన్ని అంశాలపై ప్రభుత్వం ముందు స్పష్టత ఇవ్వాలని కోరారు. ఏకపక్షంగా ముందుకు వెళ్తామంటే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు.
కేంద్ర సాయంపై రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఒత్తిడి తేవాలి
రాష్ట్రానికి కేంద్రం కరువు సాయం చేయాలికరువు బారిన పడిన రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్రం సాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం రాష్ట్ర బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. కరువు బారిన పడ్డ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన ఈ సమయంలో కూడా కేంద్రం నుంచి పైసా సాయం అందడం లేదని మండిపడ్డారు.16 వ ఫైనాన్స్ కమిషన్ నిధులు రాకపోవడంతో సర్పంచులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. స్థానిక బీజేపీ ఎంపీ అర్వింద్ కేంద్రంతో కొట్లాడి 16 వ ఫైనాన్స్ కమిషన్ నిధులు వచ్చేలా చేయాలని కోరారు. నిజామాబాద్ జిల్లాలో 18 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించడం సరికాదన్నారు. మిగతా అన్ని మండలాల్లోనూ కరువు పరిస్థితులున్నాయని చెప్పారు. రీ సర్వే చేసి కొత్తగా కరువు మండలాల జాబితా ప్రకటించాలని కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాదయాత్రలు చేస్తుంటే.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సమావేశాలు నిర్వహిస్తోంది.. ఇలా రెండు పార్టీలు ఎవరి డబ్బా వాళ్లే కొట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇకనైనా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు.రైతులను ఎలా ఆదుకుంటారో చెప్పాలికరువు పేరుతో రైతులను పంటలు వేయవద్దని చెబుతున్న ప్రభుత్వం వారిని ఎలా ఆదుకుంటుందో చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. ఆరుతడి పంటలు వేస్తే ఎంత ధరకు కొంటారో స్పష్టత ఇవ్వాలన్నారు. ఇప్పటికే యూరియా విషయంలో రైతులను ఆగం చేస్తున్నారని.. మళ్లీ పంటల విషయంలోనూ వారిని గందరగోళానికి గురిచేయడం సరికాదన్నారు. ఇష్టానుసారంగా కరెంట్ కోతలు పెడుతున్నారని.. ఇలాంటి సమయంలో ప్రభుత్వాన్ని నమ్మి రైతులు పంటలు ఎలా వేస్తారని ప్రశ్నించారు. అగ్రికల్చర్ అధికారులు, స్థానిక నాయకులతో సమన్వయం చేసుకొని పంటల విషయంలో రైతులకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆమె కోరారు.
నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం తెల్లవారు జూమున కంఠేశ్వర్ లోని శ్రీ నీలకంఠేశ్వర స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి కవిత దర్శించుకున్నారు. స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఏటా కార్తీక పౌర్ణమి రోజు స్వామి వారి దర్శనం.. మరుసటి రోజు శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారికి అభిషేకం చేయడం తమ కుటుంబ ఆనవాయితీ అని చెప్పారు. భక్తులకు కొంగు బంగారమైన నీలకంఠేశ్వర ఆలయంలో మరిన్ని అభివృద్ధి పనులు చేయాల్సిన అవసరముందని అర్చకులు తన దృష్టికి తెచ్చారని చెప్పారు. నిజామాబాద్ కోడలిగా ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచడాన్ని బాధ్యతగా తీసుకున్న స్థానిక యువతను ఈ సందర్భంగా కవిత ప్రశంసించారు.





