– వ్యవసాయం, అనుబంధ రంగాలను అనుసంధానిస్తూ సమగ్ర అభివృద్ధి
– అంతర్జాతీయ మార్కెట్లకు వ్యవసాయ ఉత్పత్తులు
– గ్లోబల్ సమ్మిట్‌లో వ్యవసాయ రంగానికి ఐదు ప్రత్యేక సెషన్లు
– 1,904 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రత్యేక అగ్రి ఎక్స్పో
– రైతుల ఆదాయం పెంపు ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం
– మంత్రి తుమ్మల
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 25: తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి వ్యవసాయ పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దడంతో పాటు, వ్యవసాయం, ఎరువులు, ఆహార శుద్ధి పరిశ్రమలు, ఎఫ్ఎంసీజీ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026 (Gobal Summit) నేపథ్యంలో బుధవారం తెలంగాణ సచివాలయంలో వ్యవసాయం, ఎరువులు, ఎఫ్ఎంసీజీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పరిచయ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ ఇన్పుట్స్, ఎరువుల తయారీ సంస్థలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, ఎఫ్ఎంసీజీ, ఆహార ఉత్పత్తుల బ్రాండ్లు, పరిశోధనా సంస్థలు, అభివృద్ధి భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే గ్లోబల్ సమ్మిట్, తెలంగాణ బలబలాలను ప్రపంచానికి పరిచడం చేయడానికి, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, దీర్ఘకాలిక భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి ఒక గొప్ప అవకాశమని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్–2047 విజన్‌లో భాగంగా 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంలో వ్యవసాయం, అనుబంధ రంగాలు అత్యంత కీలక పాత్ర పోషించనున్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. వ్యవసాయం, ఎరువులు, వ్యవసాయ ఇన్పుట్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎఫ్ఎంసీజీ రంగాలను పరస్పరం అనుసంధానిస్తూ రైతు నుంచి వినియోగదారుడి వరకు సమగ్ర విలువ శృంఖలను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రి వివరించారు. విత్తనోత్పత్తి, నూతన తరం ఎరువులు, వ్యవసాయ సాంకేతికత, యాంత్రీకరణ, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, ఆహార శుద్ధి పరిశ్రమలు, శీతల గిడ్డంగుల వ్యవస్థ, ఎఫ్ఎంసీజీ తయారీ, ఎగుమతులు వంటి రంగాల్లో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడమే కాకుండా, రైతులు పండించిన పంటలకు రాష్ట్రంలోనే విలువ జోడింపు (వాల్యూ యాడెడ్) జరిగేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. ముడి వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి, నాణ్యమైన బ్రాండెడ్ ఉత్పత్తులుగా మార్చి, దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ పరిశ్రమలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనివల్ల రైతులకు మెరుగైన ధరలు లభించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.
పెట్టుబడి హామీ నుంచి ఉత్పత్తి వరకు
గ్లోబల్ సమ్మిట్ ప్రధాన ఇతివృత్తమైన ‘ఫ్రం ప్లెడ్జ్ టు ప్రాడక్ట్’ గురించి మంత్రి వివరిస్తూ, పెట్టుబడుల ప్రకటనలు కేవలం అవగాహన ఒప్పందాలకే పరిమితం కాకుండా, భూమి కేటాయింపు, పరిశ్రమల ఏర్పాటు, ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం, ఉద్యోగాల కల్పన, తెలంగాణలోనే తయారైన ఉత్పత్తుల మార్కెటింగ్ వరకు కార్యరూపం దాల్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. పెట్టుబడిదారులు స్పష్టమైన పెట్టుబడి ప్రతిపాదనలు, అవగాహన ఒప్పందాలతో గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని ఆహ్వానించారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించేందుకు గ్లోబల్ సమ్మిట్‌లో ఐదు ప్రత్యేక సెషన్లను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు, ఆహార వ్యవస్థల్లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం, భారతదేశానికి విత్తన రాజధానిగా తెలంగాణను మరింత బలోపేతం చేయడం, ఎఫ్ఎంసీజీ మరియు ఫుడ్ బ్రాండ్ల తయారీ నుంచి మార్కెటింగ్ వరకు అభివృద్ధి, రైతు సంక్షేమం నుంచి రైతును వ్యవసాయ పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దడం వంటి అంశాలపై ఈ సెషన్లు కేంద్రీకృతమవుతాయని వివరించారు.
1,904 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రత్యేక అగ్రి ఎక్స్పో
గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా ఎక్స్ పో ఏరియా–1లో 1,904 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రత్యేక అగ్రి ఎక్స్ పోను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ‘ఫామ్ టు ఫోర్క్’ ఇతివృత్తంతో నిర్వహించే ఈ ప్రదర్శనలో విత్తనాలు, వ్యవసాయ ఇన్పుట్స్, ఆధునిక వ్యవసాయ సాంకేతికత, యాంత్రీకరణ పరికరాలు, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులు, ఎఫ్ఎంసీజీ బ్రాండ్లు, అంకుర (స్టార్టప్) సంస్థలు తమ ఉత్పత్తులు, సాంకేతికత, ఆవిష్కరణలను ప్రదర్శించనున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల రైతులు, పరిశ్రమల ప్రతినిధులు, పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణుల మధ్య పరస్పర అవగాహన, భాగస్వామ్యాలకు మంచి అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.
పెట్టుబడిదారుల సూచనలు
నేటి సమావేశం కేవలం గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించే కార్యక్రమం మాత్రమే కాదని, పెట్టుబడిదారుల అభిప్రాయాలు, వినూత్న ఆలోచనలు, పెట్టుబడి ప్రణాళికలు, వారి అంచనాలు, ప్రభుత్వ విధానపరమైన సహకార అవసరాలను తెలుసుకునే ముఖ్యమైన వేదిక అని మంత్రి వివరించారు. పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సహకారం వంటి అంశాలను నేరుగా తెలుసుకుని, సాధ్యమైన పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని తెలిపారు. వ్యవసాయ, ఉద్యానవన, అనుబంధ శాఖల కార్యదర్శులు, డైరెక్టర్లు, వివిధ కార్పొరేషన్ల మేనేజింగ్ డైరెక్టర్లు, తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని పెట్టుబడిదారుల సూచనలు, ప్రతిపాదనలను పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి తెలిపారు. ప్రభుత్వ శాఖలు, పెట్టుబడిదారుల మధ్య సమన్వయంతో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. “తెలంగాణ రైతులు రాష్ట్రానికి బలమైన వ్యవసాయ పునాదిని నిర్మించారు. ఇప్పుడు మన లక్ష్యం ఇక్కడే వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడం. రైతులు పండించిన పంటలను ప్రాసెస్ చేసిన, బ్రాండెడ్ ఉత్పత్తులుగా మార్చి, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసే స్థాయికి తీసుకెళ్లాలి. తద్వారా గ్రామీణ తెలంగాణలోనే ఉపాధి అవకాశాలు సృష్టించాలి. రైతు నుంచి పరిశ్రమ వరకు, తయారీ నుంచి మార్కెట్ వరకు జరిగే ఈ అభివృద్ధి ప్రయాణంలో ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. పరిశ్రమలు, పెట్టుబడిదారులు ఈ ప్రయాణంలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాను” అని అన్నారు.
గ్లోబల్ సమ్మిట్‌ను తెలంగాణ వ్యవసాయ రంగానికి నూతన దిశానిర్దేశం చేసే వేదికగా మలచాలని, పెట్టుబడుల ద్వారా రైతుల ఆదాయం పెరగడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని మంత్రి ఆకాంక్షించారు. తెలంగాణను వ్యవసాయ ఆవిష్కరణలు, పెట్టుబడులు, ఫుడ్ ప్రాసెసింగ్, అంతర్జాతీయ ఎగుమతుల రంగాల్లో ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, హార్టీకల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, హాకా ఎండి చంద్రశేఖర్ రెడ్డి, సీడ్ సర్టిఫికేషన్ అథారిటి డైరెక్టర్ కిరణ్ కుమార్, ఇండస్ట్రీస్ స్పెషల్ సెక్రటరి కృష్ణ ఆదిత్య, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటి డైరెక్టర్ సుష్మ మరియు వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.





