- ప్రతి బడ్జెట్ లోనూ ఇదే ధోరణి
- ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 01 : నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో తెలంగాణా రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, ఎన్ డి ఏ భాగస్వామ్య రాష్ట్రాలకు దక్కాయని, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విమర్శించారు. కేంద్ర జిడిపిలో రాష్ట్రం వాటా 5 శాతంగా ఉన్నా ఆమేరకు నిధులు విదల్చలేదు. రాష్ట్రం నుంచి పన్నులు రూపంలో రూ.26 వేల కోట్లు కేంద్రానికి వెళ్లాయి. గతంలో కంటే 12 శాతం పెరిగినా రాష్ట్రంపై చిన్నచూపు చూడటానికి రాజకీయ కారణాలే కారణం.
బిజెపికి 8 మంది ఎంపీలను ఇచ్చినా కూడా తెలంగాణా ప్రజలకు మోదీ ప్రభుత్వం ద్రోహం చేసింది. బీహార్, దిల్లీ, ఏపీ, గుజరాత్ లకు మాత్రమే ప్రాధాన్యతనివ్వడం కక్ష సాధింపు కాదా సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలుసార్లు ప్రధానితో సహా కేంద్ర మంత్రులను కలిసి రూ.1.63 వేల కోట్ల సహాయం కోసం అర్థించారు. మెట్రో-2 ప్రాజెక్టు 76.4 కిలోమీటర్ల విస్తరణకు కేంద్రం వాటాగా రూ.17.212 కోట్లు కేటాయించాలని కోరగా రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్, శివారు మున్సిపాలిటీలకు సీఎస్‌ఎంపీ కింద భూగర్భ డ్రైనేజీకి నిధులు కేటాయించాలని విన్నవించుకున్నా అన్యాయం చేశారు.
మూసీ నది హైదరాబాద్ లో 55 కి మీ ప్రవహిస్తోంది. మురికి కూపంగా మారిన ఈ నది పునరుజ్జీవం కోసం రూ.4 వేల కోట్లు అడిగితే కేంద్రం నిరాశపర్చింది. ఆర్టికల్ 1 ప్రకారం ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. అంటే భారత్ రాష్ట్రాల సముదాయం. బీజేపీ దృష్టిలో మాత్రం దేశమంటే ఎన్నికలు జరుగబోయే రాష్ట్రాలు మాత్రమే. సమాఖ్య స్ఫూర్తిని విస్మరిస్తూ.. ప్రతి బడ్జెట్ లోనూ ఇదే ధోరణిని అవలంబిస్తున్నారు. ఈసారి బిహార్ పై వరాల జల్లు కురిపించారు. పెద్దన్నలా అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన నైతిక బాధ్యతను విస్మరించి.. కొన్ని రాష్ట్రాలపైనే ప్రేమను చూపిస్తున్నారు.
తలసరి ఆదాయం, వృద్ధిలో దూసుకపోతున్న తెలంగాణకు మొండిచేయి చూపారు. రాష్ట్రానికి ఐఐటీ, ఐఐఎం, ఐఐఐటీ, నవోదయ, సైనిక్ స్కూల్స్ ను కేటాయించాలని కోరినా పట్టించుకోలేదు. కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు నిధులు కేటాయించాలని కోరినా రూపాయి ఇవ్వలేదు. సాగునీటి ప్రాజెక్టులు నిధులు కేటాయించాలని కోరినా విస్మరించారు. పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చిన ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఊసే లేదు. తెలంగాణలో రైల్వే కనెక్టివిటీని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరినా పట్టించుకోలేదని, గిరిజన యూనివర్సిటీకి మద్దతు ఇవ్వలేదు. గోదావరి-మూసీ అనుసంధానం ప్రస్తావనే లేదు. ఈజీఎస్ పథకం అమలులో వెసులు ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.