అంతర్ రాష్ట్ర ప్రాజెక్ట్ పూర్తయితే మహారాష్ట్ర, తెలంగాణకు లబ్ధి
అదనంగా సేద్యంలోకి 66282.54 ఎకరాలు
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో నాందేడ్ ఎంపీ భేటీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23 : మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్యన ఉన్న లెండి ప్రాజెక్ట్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రవీంద్ర చవాన్, మాజీ ఎమ్మెల్యే హనుమంత్ రావు పాటిల్, సురేష్ పండిత్ వార్, సుభాష్ బాద్,వాకిడిష్వార్,దినేష్ అవాజ్, సందీప్ పాటిల్ తదితర మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధుల బృందం రాష్ట్ర సచివాలయంలో మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి లెండి భారీ ప్రాజెక్టు పూర్తి చేసే అంశంపై సమీక్ష నిర్వహించారు.
అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. 1984 ప్రాంతంలో 2183.88 కోట్ల అంచనా వ్యయంతో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముఖేడ్ తాలూకా వద్ద ప్రారంభించిన లెండి భారీ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ రాష్ట్రంలో 38573.15 ఎకరాలు, మహారాష్ట్రలో 27710.397 ఎకరాలు సేద్యంలోకి వొస్తుందన్నారు. ఇప్పటివరకు రెండు రాష్ట్రాల ఒప్పందం ప్రకారం అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ రాష్ట్రాలు ఈ ప్రాజెక్ట్ పై 1040.87 కోట్ల ఖర్చు చేసి ఎర్తేన్ డ్యామ్ వర్క్ 70%,స్పిల్ వే 80% పూర్తి కాగా కాలువల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని తెలిపారు భూ అంతర్భాగం నుంచి పైపుల ద్వారా నీటి సరఫరాకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. అయితే కాలక్రమంలో భూనిర్వాసితులు అడ్డుపడడంతో 2011 లో అర్దాంతరంగా నిలిపివేసినట్లు తెలిపారు. ఈ పనులను తిరిగి పునరుద్దరుంచడంతో నది గర్భంలోని మట్టి పనులను పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్లు తెలిపారు రెండు రాష్ట్రాల ఒప్పందంలో భాగంగా వొచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.