రాబోయే రోజుల్లో సమృద్ధిగా విద్యుత్ సరఫరా
•విద్యుత్ శాఖను నిలబెట్టడానికి పటిష్ట చర్యలు
•విద్యుత్ సంస్థలో 5వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చాం..
•ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి సిద్ధం
•ప్రజా ప్రభుత్వంలో ఉద్యోగుల భావవ్యక్తీకరణ స్వేచ్ఛ
•డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23 : ప్రపంచంతో తెలంగాణ రాష్ట్రం పోటీ పడాలని ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన న్యూ ఎనర్జీ పాలసీతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రాబోతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. గురువారం ఖైరతాబాద్‌లోని ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ భవనంలో తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ 2025 డైరీ, క్యాలెండర్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం న్యూ ఎనర్జీ పాలసీని తీసుకురాకుండా చేసిన నిర్లక్ష్యంతో రాష్ట్ర అభివృద్ధికి అన్యాయం జరిగిందన్నారు. న్యూ ఎనర్జీ పాలసీ నాలుగు గోడల మధ్య తయారు చేయలేదని, దేశంలో అందరి అభిప్రాయాలు తీసుకొని పెద్ద ఎత్తున కొత్త ప్రాజెక్టులు, పెట్టుబడులు రావడానికి అనుగుణంగా రూపొందించినట్లు వివరించారు. వొచ్చే వేసవిలో పరిశ్రమలకు, వినియోగదారులకు, వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైన విద్యుత్ ను సమృద్ధిగా సరఫరా చేస్తామని ఈ విషయంలో ఎవరు ఆందోళన చెందొద్దని సూచించారు. ఎనర్జీ సెక్రటరీ నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకు అంతరాయాలు లేని నాణ్యమైన కరెంటు సరఫరా చేసేందుకు సమయత్తమయ్యారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక బాధ్యతలో భాగంగా వ్యవసాయానికి అందిస్తున్న ఉచిత కరెంటు కు సంబంధించి రైతులు చెల్లించాల్సిన బిల్లులను ఆర్థిక శాఖ నుంచి విద్యుత్ శాఖకు ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 12,486 కోట్లు చెల్లించిందన్నారు.
గృహ జ్యోతి పథకం ద్వారా పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా సరఫరా చేస్తున్న విద్యుత్ వల్ల డిస్కంలపై భారం పడకుండా ఆర్థిక శాఖ నుంచి రూ.1538 కోట్లు విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం చెల్లించిందన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలకు అందిస్తున్న ఉచిత కరెంట్‌కు రూ.199 కోట్లు ప్రభుత్వం విద్యుత్ శాఖకు చెల్లించిందన్నారు. విద్యుత్ సంస్థ ఆరోగ్యంగా, ఆర్థికంగా ఉండాలని ప్రజా ప్రభుత్వం కోరుకుంటుందన్నారు.విద్యుత్ శాఖ ఆర్థికంగా నిలదొక్కుకుంటే ఈ రాష్ట్రానికి మంచిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా రాష్ట్ర మంత్రులు అందరూ ఈ సూత్రాన్ని నమ్ముతూ ఆచరిస్తున్నామన్నారు. అందుకే ప్రతి నెలా విద్యుత్ శాఖకు ప్రజలకు ఇచ్చిన సబ్సిడీ డబ్బులను ప్రభుత్వం చెల్లిస్తున్నదని తెలిపారు. నూతన సబ్ స్టేషన్లను మంజూరు చేసే క్రమంలోనే మ్యాన్ పవర్ ను మంజూరు చేయాలని కోరిన ఉద్యోగ సంఘాల నాయకులు చేసిన సూచనను తప్పనిసరిగా పరిశీలిస్తామని వెల్లడించారు. విద్యుత్ శాఖలో ఏండ్ల తరబడి వేచి చూస్తున్న 5 వేల మందికి ఒకేసారి ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం పదోన్నతులు కల్పించిందన్నారు. కారుణ్య నియామకాలను భర్తీ చేయడంతో పాటు, కొత్త నియామకాలు కూడా చేశామని వివరించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఎన్‌విరాన్మెంట్ క్లియరెన్స్ సస్పెండ్ కావడంతో 2001 నుంచి గత ప్రభుత్వం గాలికి వొదిలేసిందని దీంతో ప్రాజెక్టు వ్యయం కూడా పెరిగిందన్నారు.
ప్రజా ప్రభుత్వ అధికారంలోకి రాగానే పెండింగ్‌లో ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్, భద్రాద్రి, థర్మల్ పవర్ స్టేషన్ ఇతర హైడల్ ప్రాజెక్టులను వినియోగంలోకి తీసుకురావడానికి క్యాలెండర్ రూపొందించుకొని వారం, వారం పర్యవేక్షణ చేపట్టడం వల్ల వైటీపీఎస్ యూనిట్-2ను అతి కొద్ది కాలంలోనే వినియోగంలోకి తీసుకొచ్చామని వెల్లడించారు. హైడల్ ప్రాజెక్టులోని మోటార్లు కాలిపోవడంతో గత ప్రభుత్వం గాలికొదిలేసిన వాటిని క్షేత్రస్థాయిలో సందర్శించి అక్కడి సమస్యలను తెలుసుకొని వాటిని వినియోగంలోకి తీసుకొచ్చామని వివరించారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం గురించి ప్రజా ప్రభుత్వం తప్పనిసరిగా ఆలోచన చేస్తుందన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు, యూనియన్ నేతలు మేనేజ్మెంట్ కూర్చొని చర్చించుకుని సమస్యలను పరిష్కరించుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. ఉద్యోగుల భావ వ్యక్తీకరణకు ఈ ప్రభుత్వంలో సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంటుందన్నారు. సమాజానికి జవాబుదారీగా పారదర్శకంగా సేవలు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. కార్యక్రమంలో ఎనర్జీ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్కో సీఎం డి కృష్ణ భాస్కర్, ఆ సంఘం అధ్యక్షులు రత్నాకర్ రావు, ప్రధాన కార్యదర్శి సదానందం, యూనియన్ నాయకులు వెంకటేశ్వర్లు జనప్రియ తదితరులు పాల్గొన్నారు.