– జీఎస్‌ఐటీఐలో ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10 : నాగోల్-బండ్లగూడ ప్రాంతంలోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో పలు నూతన, ఆధునిక సదుపాయాలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. జీఎసఐ శిక్షణ సంస్థ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ హాస్టల్, అడ్వాన్స్‌డ్ జియోఫిజికల్ డేటా ప్రాసెసింగ్ ల్యాబ్, కర్మయోగి డిజిటల్ స్టూడియోలను ప్రారంభించి ఆయా విభాగాలు అందించే సేవలను పరిశీలించారు. దేశ ఖనిజ భద్రతను పటిష్టం చేసేందుకు, ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు వీలుగా వినూత్న టెక్నాలజీలను ఉపయోగించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్‌లో భాగంగా లిథియం, గ్రాఫైట్, కోబాల్ట్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వంటి కీలక ఖనిజాల అన్వేషణ కోసం 2026-27 ఆర్థిక సంవత్సరంలో జీఎసఐ 300 ప్రాజెక్టులను చేపట్టనుందని ఆయన స్పష్టం చేశారు. జియోలాజికల్ డేటా విశ్లేషణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), అధునాతన డేటా అనలిటిక్స్ వాడకాన్ని పెంచాలని మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. జీఎసఐ 176 సంవత్సరాల సేవలను, అలాగే ఈ శిక్షణా సంస్థ (జీఎస్‌ఐటీఐ) 50 వసంతాల శిక్షణ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు. ఈ ఆధునిక వసతుల ఏర్పాటు ద్వారా హైదరాబాద్‌లోని జీఎస్‌ఐ శిక్షణా సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ఎదుగుతుందని కేంద్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. రూ.9.12 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇంటర్నేషనల్ హాస్టల్ కాంప్లెక్స్ (నలంద అండ్ తక్షశిల) : అంతర్జాతీయ అభ్యర్థులకు వసతి కల్పించేందుకు రూ.4.27 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. ఇందులో అత్యాధునిక వసతులతో కూడిన 32 సూట్లు, డైనింగ్ హాల్, జిమ్నాసియం, మినీ లైబ్రరీ, వినోద సాధనాలు ఉన్నాయి. అడ్వాన్స్‌డ్ జియోఫిజికల్ డేటా ప్రాసెసింగ్ ల్యాబ్: భూగర్భ ఖనిజాల అన్వేషణ, అత్యాధునిక జియోసైంటిఫిక్ పరిశోధనల కోసం డిజిటల్ డేటాను విశ్లేషించేందుకు ఈ ల్యాబ్ ఎంతో దోహదపడుతుంది. కర్మయోగి డిజిటల్ స్టూడియో: జియో సైన్స్ రంగంలో డిజిటల్ లెర్నింగ్ (ఆన్‌లైన్ శిక్షణ) సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, నాణ్యమైన విద్యా కంటెంట్‌ను రూపొందించడానికి ఈ స్టూడియోను ఏర్పాటు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




